బెజవాడలో ఘోరం | Brutal Murder of Women in Vijayawada | Sakshi
Sakshi News home page

బెజవాడలో ఘోరం

Published Mon, Aug 12 2019 4:28 AM | Last Updated on Mon, Aug 12 2019 9:09 AM

Brutal Murder of Women in Vijayawada - Sakshi

భార్య మణిక్రాంతితో నిందితుడు (ఫైల్‌)

సాక్షి, అమరావతి బ్యూరో/సత్యనారాయణపురం (విజయవాడ సెంట్రల్‌): విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా కడతేర్చాడు. ఆమె తలను నరికి ఆ తర్వాత ఆ తలను చేత్తో పట్టుకుని రోడ్డుపైకి నడుచుకుంటూ వచ్చాడు. ఈ భీతావహ దృశ్యాన్ని చూసిన స్థానికులు కేకలు వేయడంతో తలను సమీపంలోని ఏలూరు కాలువలో పడేశాడు. అనంతరం సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్‌ కాలనీ నాలుగోలైన్‌కి చెందిన గోపిశెట్టి లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మణిక్రాంతి, కృష్ణాజిల్లా ఘంటసాల సమీపంలోని శ్రీకాకుళానికి చెందిన పేటేటి ప్రదీప్‌కుమార్‌ ప్రేమించుకున్నారు.

ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఆ తర్వాత వారిని ఒప్పించి 2014లో వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా ప్రదీప్‌ అక్క ఝూన్సీరాణి, తల్లి తరచూ కట్నం కోసం మణిక్రాంతిని వేధిస్తుండడంతో చివరకు ఆమె వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రదీప్‌ను పోలీసులు అరెస్టుచేశారు. ఇరువురూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి మణిక్రాంతి తన తల్లి వద్దే ఉంటోంది. జైలు నుంచి బయటకు వచ్చిన ప్రదీప్‌ తనను వెంబడిస్తున్నాడని బాధితురాలు ఇటీవల తల్లికి చెప్పినట్లు సమాచారం. అంతేకాక, ఇరవై రోజుల కిందట ఝాన్సీ, మణిక్రాంతి ఘర్షణ పడి ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.  

తల నరికి నడిరోడ్డుపైకి వచ్చి..  
ఈ నేపథ్యంలో ప్రదీప్‌ తన భార్యను కడతేర్చాలని నిర్ణయించుకుని ఆదివారం ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. షాపింగ్‌ నుంచి మణిక్రాంతి మ.2.30 సమయంలో ఇంటికి వచ్చింది. తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ముందు పార్కు చేస్తుండగా ప్రదీప్‌ ఒక్కసారిగా ఆమె తలను నరికేసి ఆ తలతో నడిరోడ్డుపైకి వచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు కేకలు వేయడంతో తలను సమీపంలోని ఏలూరు కాలువలో పడేసి సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. కాలువలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో రాత్రి వరకు మృతురాలి తల ఆచూకీ లభించలేదు. కాగా, పోలీసులు మృతదేహన్ని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా మృతురాలి కుటుంబసభ్యులు అడ్డుకున్నారు.

నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. డీసీపీ–2 విజయరావు ఘటనపై విచారణకు ఆదేశించారు. కుటుంబ సభ్యులతో పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడి మణిక్రాంతి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. కాగా, నిందితుడిని నున్న పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నట్లు తెలిసింది. అతనిపై 302 సెక్షన్‌ ప్రకారం కేసు నమోదు చేశారు. మణిక్రాంతి ఫిర్యాదుతో ప్రదీప్‌పై ఇప్పటికే సత్యనారాయణపురం, సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లలో చెరో మూడు కేసులు ఉన్నట్లు సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement