ఫిరోజ్‌పూర్: భారత్–పాకిస్తాన్ సరిహద్దులోని కంచెలు, రహదారులకు సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్ ఏజెంటుకు అందజేశాడన్న ఆరోపణలపై ఒక బీఎస్‌ఎఫ్ జవానును అరెస్టు చేశారు. గత కొన్ని నెలలుగా షేక్ రియాజుద్దీన్ అనే జవానుపై నిఘా పెట్టిన బీఎస్‌ఎఫ్ వర్గాలు ఆయనను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నాయి. రియాజుద్దీన్ మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా రెన్పురా గ్రామానికి చెందిన వాడని, పంజాబ్‌లో ఫిరోజ్‌పూర్‌లోని 29వ సరిహద్దు భద్రతాదళానికి చెందిన బెటాలియన్‌లో పనిచేస్తున్నాడని తెలిపారు.
అతని నుంచి రెండు సెల్‌ఫోన్లు, ఏడు సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. పాకిస్తాన్ గూఢచార సంస్థకు చెందిన మీర్జా ఫైజల్ అనే వ్యక్తికి సరిహద్దు ఫెన్సింగ్, రోడ్లు, ఉన్నతాధికారుల ఫోన్ నెంబర్లు, ఇతర రహస్య వివరాలు రియాజుద్దీన్ అందజేసినట్టుగా బీఎస్‌ఎఫ్ వెల్లడించింది. 29వ బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. రియాజుద్దీన్ పోలీసు రిమాండ్‌కోసం కోర్టును ఆశ్రయిస్తామని విచారణ అధికారి రంజిత్‌సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment