ప్రతీకాత్మక చిత్రం
రాయ్‌చూర్ : కర్ణాటకలోని రాయ్‌చూర్‌లో దారుణమైన ఘటన వెలుగుచూసింది. రాయ్‌చూర్ అడవిలో గత మంగళవారం యువతి మృతదేహం చెట్టుకు వేలాడుతూ లభ్యమైంది. మృతురాలిని మధు పథారాగా గుర్తించారు. సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న మధుపై ‘అత్యాచారం’ జరిపి.. ఆపై సజీవ దహనం చేసి.. చెట్టుకు వేలాడదీసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన ఈ నెల 13న జరగగా.. ఈ నెల 16న చెట్టుకు వేలాడుతున్న బాధితురాలి మృతదేహాన్ని గుర్తించారు. హత్యకేసుగా భావిస్తున్న ఈ ఘటనలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
దుండగులు బాధితురాలిని చిత్రహింసలకు గురిచేసి.. ఆమెతో సూసైడ్ నోట్ రాయించారని, అనంతరం ఆమెను చంపేసి.. చెట్టుకు వేలాడదీశారని మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. ఆమె రాసినట్టు చెప్తున్న సూసైడ్ నోట్‌లో చదువులో వెనుకబడటంతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఉంది. అయితే, ఆమె అన్ని సబ్జెక్టులను పాస్ అయిందని, చదువులో వెనుకబడిందనే మాట అవాస్తవమని ఈ సూసైడ్ నోట్‌ను ఆమె స్నేహితులు, బంధువులు కొట్టిపారేస్తున్నారు. మధు ఆత్మహత్య చేసుకోలేదని, ఆమె సజీవదహనం చేసి.. చెట్టుకు వేలాడదీశారని ఆమె తండ్రి నాగరాజ్ నేతాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
మధుకు న్యాయం చేయాలంటూ హ్యాష్‌ట్యాగ్‌తో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఘటనకు సంబంధించిన ఫొటోలుగా కొన్ని భయంకరమైన ఫొటోలు నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ప్రముఖ నటి రష్మిక మంధానతోపాటు పలువురు ప్రముఖులు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ట్విటర్‌లో పోస్టులు పెట్టారు. అయితే, పోలీసులు ఇప్పటివరకు క్రైమ్‌సీన్ ఫొటోలు విడుదల చేయలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment