నెత్తురోడిన రోడ్లు | bus and lorry accident in puthala pattu | Sakshi
Sakshi News home page

నెత్తురోడిన రోడ్లు

Published Fri, Oct 27 2017 7:37 AM | Last Updated on Thu, Aug 30 2018 4:15 PM

bus and lorry accident in puthala pattu - Sakshi

కారులోనే మృతిచెందిన ఎం.వెంకటయ్య

అధికారులు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా జనాల్లో మార్పు రావడంలేదు. అతివేగం, డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తొట్టంబేడు, గంగవరం, కేవీపల్లె మండలాల్లో గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.  

లారీ ఢీకొని..
తొట్టంబేడు : మండలంలోని లింగమనాయుడుపల్లి వద్ద పూతలపట్టు–నాయుడుపేట రోడ్డుపై గురువారం టెంపోను లారీ ఢీకొంది. దీంతో ఒకరు మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. ఏర్పేడు మండలం బాలకృష్ణాపురానికి చెందిన చెంచయ్య(45) పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఓ ప్రైవేటు కర్మాగారంలో పనిచేస్తున్నాడు. గురువారం విధులు ముగించుకుని స్వగ్రామానికి వెళ్లేందుకు నాయుడుపేటలో బస్సు కోసం నిలబడ్డాడు. ఆ సమయంలో కొబ్బరి బోండాలతో వెళుతున్న టెంపోలో చెంచయ్యతో పాటు నాయుడుపేటకు చెందిన బసవయ్య(36), కృష్ణయ్య(37), లక్ష్మీనారాయణ(32), చిన్నమునెయ్య(30) ఎక్కారు. తొట్టంబేడు మండలం లింగమనాయుడుపల్లి వద్ద ఎదురుగా వస్తున్న వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో చెంచయ్య అక్కడికక్కడే మృతిచెం దాడు. డ్రైవర్‌ రహీం(42)తో పాటు మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ బోల్తాపడింది. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

                      మృతిచెందిన చెంచయ్య, పక్కన బోల్తా పడిన లారీ
గ్యాస్‌ ట్యాంకర్‌ ఢీకొని..
గంగవరం: మండలంలోని గండ్రాజుపల్లె వద్ద గురువారం గ్యాస్‌ ట్యాంకర్‌ ఢీకొని ఉపాధ్యాయుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. పొన్నమాకులపల్లెకు చెందిన శ్రీరంగపాణి(47) ఉల్లిగుంట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గురువారం గండ్రాజుపల్లె ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన సీఆర్‌సీ సమావేశానికి వెళ్లారు. సమావేశం మధ్యలో మూత్ర విసర్జన కోసం రోడ్డు దాటుతుండగా బెంగళూరు వైపు నుంచి వస్తున్న గ్యాస్‌ ట్యాంకర్‌ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆయనను తోటి ఉపాధ్యాయులు 108 ద్వారా పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన మృతిచెందారు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఎస్‌ఐ రాజశేఖర్‌ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కారు అదుపు తప్పి..
కేవీపల్లె : కారు అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్నిఢీకొని బండరాళ్లను ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం కేవీపల్లె మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వైఎస్సార్‌ కడప జిల్లా సుండుపల్లె మండలం గొల్లపల్లె పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన ఎం.వెంకటయ్య (55)కు ఆరోగ్యం సరిగాలేదు. ఆయనను కుమారుడు రామచంద్ర, అదే గ్రామానికి చెందిన నాగమ్మతో కలిసి కారులో పీలేరు బయలుదేరాడు. కేవీపల్లె మండలం ఎంవీపల్లె పంచా యతీ గుండ్రేవారిపల్లె సమీపంలో జిల్లేళ్లమంద పంచాయతీ పాతవడ్డిపల్లెకు చెందిన వెంకట్రమణ (35) ద్విచక్ర వాహనంలో గర్నిమిట్టకు వెళ్లేందుకు రోడ్డుపైకి వచ్చాడు. కారు అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొని అనంతరం రోడ్డు పక్కన బండ రాళ్లను ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో వెంకట్రమణ తీవ్రంగా గాయపడ్డాడు. వెంకట్రమణను 108లో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు తిరుపతికి రెఫర్‌ చేశారు. వెంకటయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవింగ్‌ చేస్తున్న రామచంద్ర, కారులో ఉన్న నాగమ్మ స్వల్పగాయాలతో బయటపడ్డారు. వెంకటయ్య మృతితో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ ఆనంద్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement