
సాక్షి, చింతపల్లి (విశాఖపట్నం) : మండలంలోని లోతుగెడ్డ జంక్షన్ వద్ద సోమవారం పర్యాటకుడిని గంజాయి తరలిస్తున్న ఆటో బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో పర్యాటకుడు తీవ్రంగా గాయపడగా ఆటో బోల్తాపడింది. వివరాల్లోకి వెళితే.. లోతుగెడ్డ జంక్షన్‌లో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు. దీంతో ప్రధాన రహదారిలో పింఛనుదారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రత కాస్తున్నారు. ఇదే సమయంలో సోమవరం ప్రాంతం నుంచి ఆటో వేగంగా వస్తోంది.
ఇక్కడ ఉన్న పోలీసులను గమనించి ఆటో డ్రైవరు ఆందోళనకు గురై ఆటో వేగం పెంచాడు. ఇదే సమయంలో సమీపంలోని పంచవటి తోటల వద్ద విశాఖపట్నం పర్యాటకుడు శ్రీను భోజనం చేసి బయటకు వస్తుండగా వేగంగా వస్తున్న ఆటో అతడిని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఆటో బోల్తా పడగా పర్యాటకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో డ్రైవర్‌తో పాటు ఇంకో వ్యక్తి ఉన్నారు. ఆటో బోల్తా పడ్డాక వారు అక్కడ నుంచి పరారు అయ్యారు. వారికి స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఆటో అడుగు భాగంలో గంజాయి ప్యాకెట్లు గుర్తించిన స్థానికులు వెంటనే పొలీసులకు సమాచారం అందించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.