
ధర్మవరం అర్బన్: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు నిలువరించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు అనంతపురం జిల్లా ధర్మవరం అర్బన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ధర్మవరం పరిసరాల్లోని వలస కార్మికులను శుక్రవారం అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి శ్రామికరైలులో బెంగళూరు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీరిని రైల్వేస్టేషన్‌కు తీసుకెళుతున్న ధర్మవరం ఆర్టీసీ డిపో బస్సు (ఏపీ02జెడ్ 0552)ను అధికారులు మధ్యలోనే వెనక్కు రప్పించారు.
కార్మికుల కోసం మరో బస్సు పంపించారు. దీంతో మధ్యలోనే కార్మికులు బస్సు దిగేశారు. కర్ణాటక రాష్ట్రం విజయపుర గ్రామానికి చెందిన ముజామిల్‌ఖాన్ మద్యం మత్తులో బస్సు వెనక సీట్లో నిద్రపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో అతడు ఆ బస్సులోనే ధర్మవరం ఆర్టీసీ గ్యారేజికి వచ్చేశాడు. కొద్దిసేపటికి మెలకువ వచ్చిన అతడు బస్సు ఇంజన్ తాళంచెవి కూడా అక్కడే ఉండటంతో స్టార్ట్‌చేసి బయటకు తీసుకొచ్చేశాడు. బస్టాండ్ బయట ఉన్న డ్రైవర్ వెంకటేశ్ గమనించి డిపో మేనేజరు మల్లికార్జునకు, డయల్ 100కు ఫోన్‌చేసి చెప్పి బైక్‌పై బస్సును వెంబడించారు. బస్సు పెనుకొండ హైవేలో వెళ్తుండగా కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ గణేష్, చెన్నేకొత్తపల్లి ఎస్‌ఐ రమేష్ రోడ్డుకు అడ్డంగా లారీ కంటైనర్‌ను పెట్టి బస్సును ఆపి ముజామిల్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు బస్సును ధర్మవరం అర్బన్ పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment