యశవంతపుర: దొంగలు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. పైపులైన్ మరమ్మతుల పేరుతో ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు నగదు, బంగారం దోచుకెళ్లారు. ఈ వినూత్న తరహా చోరీ రాజరాజేశ్వరినగర పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక్కడి బీఈఎంఎల్ లేఔట్ ఫస్ట్ మొయిన్ రోడ్డు మూడవ క్రాస్‌లో విశ్రాంతి ఇంజినీర్ నరసింహమూర్తి ఉంటున్నారు. గురువారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు ఇంటికి వచ్చి నీటి పైపు జామ్ అయిందని, మరమ్మతులు చేస్తామని చెప్పారు. ఒకరు ఇంట్లోకి వెళ్లగా మరో ఇద్దరు నరసింహమూర్తిని ఇంటి వెనుక పైపులైన్ వద్ద కూర్చోబెట్టారు. తర్వాత కొద్దిసేపటికి మరో వ్యక్తి ఇంట్లోకి వెళ్లాడు. ఆ ఇద్దరూ కలిసి ఇంట్లోని రూ.16 లక్షల నగదు, 585 గ్రాముల బంగారం తీసుకుని ఉడాయించారు. అనంతరం నరసింహమూర్తితో కలిసి ఉన్న మరో వ్యక్తి తనకు ఫోన్ వచ్చిందంటూ అక్కడినుంచి జారుకున్నాడు. అదే రోజు సాయంత్రం నరసింహమూర్తి భార్య నగ కోసం బీరువా తెరవగా నగలు, నగదు కనిపించలేదు. దీంతో నరసింహమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment