పిచ్చాటూరు పోలీస్ స్టేషన్ వద్ద గుమికూడిన మాలిక్ భాధితులు, (ఇన్‌సెట్) పట్టుబడ్డ చీటీ వ్యాపారి మాలిక్
చిత్తూరు,పిచ్చాటూరు : దీపావళి చీటీల పేరిట ఏడాది పాటు డబ్బులు వసూలు చేసి పారిపోయిన చీటీల వ్యాపారి మాలిక్ ఎట్టకేలకు మంగళవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్ష్యమయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితులు స్టేషన్ వద్ద బారులు తీరారు. వివరాలిలా ఉన్నాయి.. పిచ్చాటూరు బజారువీధికి చెందిన మాలిక్ ఎస్‌ఎస్ మార్కెటింగ్ దీపావళి సేవింగ్ ఫండ్ పేరిట చీటీల వ్యాపారం చేస్తూ గత నెల 29న డబ్బులతో ఉడాయించిన సంగతి తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్‌ఐ రామాంజనేయులు ఈ నెల 10న మాలిక్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం పిచ్చాటూరు పోలీస్‌స్టేషన్‌లో మాలిక్ ప్రత్యక్షమయ్యాడు. చీటీల బాధితులను ఎస్‌ఐ స్టేషన్‌కు పిలిపించి వారి నుంచి బాండ్లను సేకరించారు. ఇలా సేకరించిన బాండ్ల సొమ్మును మాలిక్ చేత లెక్కకట్టించారు. ఈ మేరకు సాయంత్రానికి రూ.21.50 లక్షలుగా తేలింది. ఇంకా చాలా మంది నుంచి బాండ్లు రావాల్సి ఉన్నట్లు తెలిసింది.
డబ్బులిచ్చేందుకు అంగీకరించినతల్లిదండ్రులు..
మాలిక్ తల్లిదండ్రులను ఎస్‌ఐ స్టేషన్‌కు పిలిపించి చర్చలు జరిపారు. ఆస్తులు అమ్మి దీపావళి చీటీ బాధితులకు సొమ్ము చెల్లించడానికి మాలిక్ తల్లిదండ్రులు అంగీకరించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండు పక్కన 6సెంట్ల ప్లాటు ఉందని, దానిని అమ్మి బాధితులకు ఇస్తామని వారు చెప్పినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాధితులకు న్యాయం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తామన్నారు.
బాండ్లతో క్యూకట్టిన బాధితులు..
మాలిక్ పోలీసుల అదుపులో ఉన్నాడని తెలుసుకున్న నెలసరి చీటీదారులు బాండ్లు, అగ్రిమెంట్ కాగితాలతో పోలీస్‌స్టేషన్‌కు క్యూకట్టారు. అయితే మాలిక్ వద్ద నెలసరి చీటీ వేసిన వారు కోర్టు ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఎస్‌ఐ తేల్చేశారు. సాయంత్రానికి నెలసరి చీటీ వేసిన వారి మొత్తం రూ.12 లక్షలు తేలింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని బాధితులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment