
బాధితురాలు విమలమ్మ
కురబలకోట : కన్న కూతురే మోసపూరితంగా ఇల్లు రాయించుకుందని, న్యాయం చేయాలంటూ అంగళ్లుకు చెందిన విమలమ్మ రూరల్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం మేరకు.. అంగళ్లుకు చెందిన విమలమ్మకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. వీరికి పెళ్లిళ్లు కావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఇప్పుడు విమలమ్మ ఒక్కరే ఉంటున్నారు. చిన్న అంగడి పెట్టుకుని జీవనం సాగిస్తోంది. ఫొటో స్టూడియో ఏర్పాటుకు లోన్(రుణం) తీసుకుంటున్నట్లు ఐదేళ్ల క్రితం కూతురు చెప్పింది. ఇందుకు తల్లి సంతకాన్ని ష్యూరిటీగా కోరారని నమ్మబలికింది. దీంతో తల్లి విమలమ్మ బిడ్డ బాగుపడుతుందని మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పేపర్లపై సంతకం చేసింది. ఆ తర్వాత నిజం తెలిసిన విమలమ్మ షాక్ తింది.
మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తను సంతకం చేసింది.. తనకున్న ఏకైక ఆధారమైన ఇంటిని కూతురి పేరిట దాన విక్రయమని తెలిసి కుమిలిపోయింది. అప్పటి నుంచి ఇంటి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని కుమార్తెను బతిమలాడినా ఆమె ఖాతరు చేయలేదు. చివరకు పోలీసులు, అధికారులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని వృద్ధురాలు వాపోతోంది. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తే, తూతూ మంత్రంగా విచారణ జరిపి పోలీసులు కూడా చేతులెత్తేశారని వాపోతుంది. దీంతో మరోసారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి మదనపల్లెలో దీక్షకు ఉపక్రమిస్తున్నట్లు ఆదివారం విలేకరులకు తెలిపింది. ఈమె పరిస్థితి చూసి స్థానికులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment