సాక్షి, సిటీబ్యూరో: తవ్వకాల్లో దొరికిన పురాతన బంగారం అంటూ నమ్మిస్తారు... టెస్టింగ్ కోసం పుత్తడితో చేసిన నాణాలు, విగ్రహం ముక్కలు ఇస్తారు... టార్గెట్ చేసిన వ్యక్తి నుంచి నగదు అందిన తర్వాత ఇత్తడి అంటగట్టి ఉడాయిస్తారు. ఈ పంథాలో మోసాలకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్ ముఠాకు ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ పెట్టారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వీరి నుంచి రూ.9 లక్షల నగదు, పురాతనమైనదిగా కనిపిస్తున్న మహావీరుడి విగ్రహం, ఇత్తడి నాణాలు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి సోమవారం సీపీ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని అక్రమాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మద్ కల్లు 15 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చి ఛత్రినాకలో స్థిరపడ్డాడు. ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్ళి్లతను ఇటీవల తన స్వస్థలానికి వెళ్లినప్పుడు తన స్నేహితుడైన అర్జున్ శర్మను కలిశాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడానికి ఇత్తడిని పుత్తడిగా నమ్మించి మోసాలు చేద్దామని ఇద్దరూ పథకం పథకం పన్నారు. పాత నేరగాడైన అర్జున్‌పై గతంలో కేరళలోని తివేండ్రం, తమిళనాడులోని కొయంబత్తూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో 10 గ్రాముల బంగారు నాణాలు, మూడు బంగారు కోటింగ్ నాణాలతో పాటు 380 ఇత్తడి నాణాలు, ఇత్తడిదిగా అనుమానిస్తున్న వర్థమాన మహావీరుడి విగ్రహం (5 కేజీల బరువు) తీసుకుని నగరానికి వచ్చి ఛత్రినాకలోని కల్లు వద్ద మకాం వేశాడు.
వీరిద్దరూ కలిసి తమ వద్ద పురాతన బంగారు నాణేలు, విగ్రహం ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఆసక్తి చూపిన వారికి తాను ఉత్తరప్రదేశ్‌లోని తమ పొలం దున్నుతుంటే అవి దొరికాయని, ఎక్కువ కాలం దగ్గర ఉంచుకుంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో విక్రయిస్తున్నట్లు చెప్పేవారు. తమ వద్ద ఉన్న నాణాల మధ్యలో 10 గ్రాములు బంగారంతో చేసినవి, మూడు బంగారం కోటింగ్‌తో ఉన్నవి ఉంచేవారు. వర్థమాన మహావీరుడి కుడి భుజం భాగంలో ‘వీ’ ఆకారంలో కోసి అందులో బంగారంతో చేసిన ముక్కను అతికించేవారు. ఆసక్తి చూపిన వారికి టెస్టింగ్ కోసం అంటూ ఈ ముక్కతో పాటు బంగారు నాణెం ఇచ్చేవారు. పరీక్షలో నిజమైన బంగారంగా తేలడంతో ఎదుటి వారు వారి వల్లో పడిపోతున్నారు. ఆపై మొత్తం బంగారం తీసుకునేందుకు డబ్బు తీసుకుని ఓ నిర్మానుష్య ప్రాంతానికి రావాల్సిందిగా సూచించేవారు. వారు డబ్బు పట్టుకుని వచ్చిన తర్వాత పోలీసులు వస్తున్నారంటూ హడావుడి చేస్తారు. అదను చూసుకుని ఇత్తడి సరుకు అంటగట్టి డబ్బు తీసుకుని ఉడాయించేవారు. ఈ పంథాలో వీరు పలువురిని మోసం చేశారు. అంబర్‌పేట ప్రాంతానికి చెందిన శ్రీరామదాస్ సంజీవచారికి ఇదే తరహాలో ఎర వేసిన ఈ ద్వయం అతడి నుంచి రూ.13.45 లక్షలు స్వాహా చేసింది. బాధితుడి ఫిర్యాదుతో అంబర్‌పేట ఠాణాలో కేసు నమోదైంది. ఇలా వచ్చిన డబ్బును ఇద్దరు నేరగాళ్లు సమానంగా పంచుకుంటున్నారు. వీరి వ్యవహారంపై ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్ తమ బృందాలతో రంగంలోకి దిగారు. ముమ్మరంగా గాలించి సోమవారం నిందితులను పట్టుకున్నారు. వీరితో పాటు స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చర్యల నిమిత్తం అంబర్‌పేట పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment