సాక్షి, హైదరాబాద్: ఫార్ములా వన్ రేసింగ్ తరహాలో ఇండియా వన్ రేస్ కార్ల పోటీలు నిర్వహిస్తామంటూ నగర వ్యాపారవేత్త రఘురామ కృష్ణమరాజు నుంచి రూ.7.5 కోట్లు వసూలు చేసి మోసం చేసిన కేసులో ఓ సంస్థతోపాటు ముగ్గురిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన మజ్దార్ కంపెనీతోపాటు ఆ సంస్థలో డైరెక్టర్లుగా ఉన్న డెక్కన్ క్రానికల్ ఎండీ వినాయక్ రవిరెడ్డి కుమార్తె అంజనారెడ్డి, వినోద్ మినాన్, దర్శన్ ఉతప్పలపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇప్పటికే అంజనారెడ్డికి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేసి ఆమె వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు. వినోద్ మినాన్, దర్శన్ ఉతప్పలను శనివారం పిలిపించి విచారించినట్టు తెలిసింది.
వాంగ్మూలాల రికార్డు...
‘ఐపీఎల్‌లో డెక్కన్ చార్జెస్ మాకున్న సమయంలో మజ్దార్ కంపెనీ వాళ్లు సంప్రదించారు. కంపెనీలో 20 శాతం వాటా ఇస్తామన్నారు. ఆ తర్వాత వాళ్లు ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో డైరెక్టర్ పదవికి రాజీనామా చేశా. ఆ కంపెనీతో నాకు ఎటువంటి సంబంధం లేదు’అంటూ అంజనారెడ్డి వివరణ ఇచ్చినట్టు తెలిసింది. ‘మచదర్ మోటార్ కారు కంపెనీకి డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే. ఆ తర్వాత నష్టాలు రావడంతో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. తెలిసిన వాళ్లు కదా అని వెళ్లి మాట్లాడాను. అంతే తప్ప నాకు ఎటువంటి సంబంధం లేదు.’అని చాముండేశ్వరినాథ్ ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా పోలీసులు రికార్డు చేశారు.
సచిన్, షారుఖ్, నాగార్జున బ్రాండ్ అంబాసిడర్లంటూ...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాదిరిగా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇండియా వన్ కార్ రేసింగ్ నిర్వహించేందుకు ఆరేళ్ల క్రితం బెంగళూరు కేంద్రంగా మచదర్ మోటార్ కారు కంపెనీని ఏర్పాటు చేశారు. ఇందులో వినోద్ మినాన్, దర్శన్ ఉతప్పలతోపాటు అంజనారెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ మేరకు రియల్ ఎస్టేట్ వ్యాపారులను వీరు సంప్రదించారు. తమ రేస్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా సచిన్ టెండూల్కర్, షారుఖ్ ఖాన్, నాగార్జునలను నియమిస్తున్నట్టుగా నమ్మించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే 2011లో రఘురామ కృష్ణమరాజు దగ్గరికి చాముండేశ్వరినాథ్‌తో కలసి అంజనారెడ్డి వెళ్లారు. ఫార్ములా వన్ రేసింగ్ తరహాలో ఇండియా వన్ రేస్ కార్ల పోటీలు నిర్వహిస్తున్నామని వివరించడంతో చెన్నై ఫ్రాంచైజీస్ కొనుగోలు చేసేందుకు రూ.7.5 కోట్లను రఘురామ కృష్ణమరాజు చెల్లించారు. ఆ తర్వాత కారు రేసింగ్ నిర్వహించకపోవడంతో రఘురామ కృష్ణమరాజు 2016లో నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు అంజనారెడ్డి, వినోద్ మినాన్, దర్శన్ ఉతప్పలపై కేసు నమోదు చేయాలంటూ కోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment