నమ్మి మోసపోయామని ఎస్‌ఐకు వివరిస్తున్న గ్రామస్తులు
‘మా తల్లిదండ్రుల కాలం నాటి నుంచి ఆయనపై నమ్మకం...అదే విశ్వాసంతో పోస్టల్ ఆర్‌డీలు పేరిట డబ్బు కట్టాం...తీరా ఇప్పుడేమో కట్టిన డబ్బులకు రశీదుల్లేవు...బాండ్లు లేవు...తిరిగి డబ్బుల్లేవు...’ అంటూ జి.ములగాం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. వివరాల్లోకి వెళ్తే...
విజయనగరం, చీపురుపల్లి: పోస్టల్ ఆర్‌డీల పేరిట ఓ వ్యక్తిని నమ్మి రూ.లక్షల్లో డబ్బులు కట్టి మోసపోయామని తమకు న్యాయం చేయాలని వారం రోజుల కిందట పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించిన జి.ములగాం గ్రామస్తులు మంగళవారం మరోసారి పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కరిమజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ మండల నాయకులు ఇప్పిలి అనంతరం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు సహకారంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వారు తమకు న్యాయం చేయాలని ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ను వేడుకున్నారు.
తమతో డబ్బులు కట్టించుకుని గ్రామంలో లేకుండా ఉడాయించిన పోస్టు రన్నర్‌ను కూడా తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన వందలాది మంది ఏళ్ల తరబడి పోస్టు రన్నర్ వద్ద డబ్బులు కడుతున్నామని ఎవరికీ ఏ రోజు రశీదులు ఇవ్వడం ఆయనకు అలవాటు లేదన్నారు. తాము కూడా ఆయనపై ఎంతో నమ్మకంతో రశీదులు, బాండ్లు ఏరోజు అడగలేదన్నారు. దాచుకున్న డబ్బులు ఎంత కాలమైనా రాకపోవడంతో ఇటీవల ఆయన్ను అడగడంతో గ్రామం వీడి వెళ్లిపోయాడని చెప్పారు. ఇదిలా ఉండగా గ్రామస్తులు తీసుకొచ్చిన పోస్టు రన్నర్‌ను ఎస్‌ఐ ప్రశ్నించగా ప్రజల నుంచి సేకరించిన డబ్బు మొత్తం సహారా ఇండియా పరివార్ సంస్థలో పెట్టానని, ఆ సంస్థ దివాళా తీయగా సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందన్నారు. ఆ సంస్థ నుంచి డబ్బులు రావాల్సి ఉందన్నారు. దీంతో జోక్యం చేసుకున్న గ్రామస్తులు తాము చెల్లించిన డబ్బులకు రశీదులు, బాండ్లు ఇవ్వాలని పట్టుబట్టారు. తన ఇంటి వద్ద ఉన్నాయని ఇస్తానని పోస్టు రన్నర్ చెప్పాడు. చివరగా ఎస్‌ఐ దుర్గాప్రసాద్ జోక్యం చేసుకుని గ్రామంలోకి వచ్చి విచారణ నిర్వహిస్తామని తరువాత చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. దీంతో గ్రామస్తులు వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment