తపాలా ఉద్యోగుల సమ్మెకు మద్దతు పలుకుతున్న వివిధ సంఘాల నేతలు
విజయనగరం టౌన్ : తపాలా శాఖలోని ఉద్యోగులకు కమలేష్ చంద్ర కమిటీ నివేదికలోని సానుకూల అంశాలను ఆమోదించి వేతన కమిటీని వెంటనే నియమించాలనే డిమాండ్‌తో గత నెల 22 నుంచి చేపట్టిన ఉద్యోగుల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. నేటికి 15 రోజులు కావస్తున్నా డిమాండ్ పరిష్కారానికి నోచుకోకపోవడంతో కార్మిక సంఘాలన్నీ కలిసి తపాలా ఉద్యోగులకు మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఎన్‌టీయూసీ నాయకులు ఎం.శ్రీనివాస్, ఐఎఫ్‌టీయూ సన్యాసిరావు, ఏఐఎఫ్‌టీయూ నాయకులు శంకరరావు, సీఐటీయూ నాయకులు టీవీ రమణ, ఏఐటీయూసీ నాయకులు కృష్ణంరాజు, ఏపీటీఎఫ్ నాయకులు ఈశ్వరరావు, పీఆర్‌టీయూ నాయకులు పట్నాయక్, యూటీఎఫ్ నాయకులు శేషగిరి, ప్రభూజీ, ఆపస్ నాయకులు శాంతమూర్తి తదితరులు మంగళవారం సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తపాలా శాఖలో వెట్టిచాకిరీ చేస్తున్న గ్రామీణ తపాలా ఉద్యోగులకు అమలు చేయాల్సిన వేతన కమిటీని ఇప్పటి వరకూ అమలు చేయకపోవడం దారుణమన్నారు. కేంద్రం మొండి వైఖరిని వీడాలని సూచించారు. కమలేష్ చంద్ర కమిటీ కేంద్ర ప్రభుత్వానికి తన రిపోర్టును సమర్పించి 18 నెలలు సమయం పూర్తయినా నేటి వరకూ ఆమోదించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ తపాలా ఉద్యోగుల నిరవధిక సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తపాలా జేఏసీ నాయకులు కె.సూర్యారావు, ఎ.పెంటపాపయ్య, కంది నారాయణరావు, శ్రీనివాసరావు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment