నిందితుల అరెస్ట్ వివరాలను తెలుపుతున్న కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా
కడప అర్బన్ : జీవితఖైదీ సునీల్ పథకం ప్రకారమే పరారయ్యాడు. అతను ఈ నెల 27న పోలీసులను ప్రలోభ పెట్టి, వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ కేసులో ముగ్గురు కానిస్టేబుళ్లతోపాటు సునీల్ పారిపోయేందుకు సహకరించిన అతనికి చెందిన ముగ్గురు బంధువులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ వివరాలను కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా తమ కార్యాలయంలో సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లాలోని ప్రొద్దుటూరులో నాలుగేళ్ల క్రితం సునీల్‌కుమార్ అలియాస్ సునీల్ కొంత మంది యువకులను మభ్యపెట్టి సునీల్ గ్యాంగ్‌గా ఏర్పరుచుకుని.. కిడ్నాప్‌లు, హత్యలు లాంటి కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. వాటిని పథకం ప్రకారం చేస్తూ తన జల్సాలకు యువతను లోబరుచుకుని నేరాలకు పాల్పడేవాడు. అదే పద్ధతిలో ఎస్కార్టుగా వచ్చిన కానిస్టేబుళ్లను సైతం ప్రలోభపెట్టి పథకం ప్రకారం పరారయ్యాడు. ఆటో డ్రైవర్‌గా సాధారణ జీవితాన్ని ప్రారంభించిన సునీల్ ప్రొద్దుటూరులో అనతికాలంలోనే ఇంటర్మీ డియెట్, ఇంజినీరింగ్ విద్యార్థులను సైతం దురలవాట్లకు బానిసలుగా మార్చి నేరాలకు పాల్పడే వాడు. సదరు కేసులకు సంబంధించి ప్రస్తుతం కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని కోర్టులలో విచారణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జీవిత ఖైదు పడింది. తాను ఎలా తప్పించుకోవాలో పథకాన్ని రచించుకోసాగాడు. ఆ ప్రకారంగానే కానిస్టేబుళ్లను లోబరుచుకుని తన వంతు ప్రయత్నం చేసి వారి కళ్లు గప్పి ఎంచక్కా పరారయ్యాడు.
సునీల్ ఎలా పరారయ్యాడంటే..
ప్రొద్దుటూరుకు చెందిన సునీల్‌కుమార్ అలియాస్ సునీల్ పథకం ప్రకారం తాను పరారయ్యేందుకు వ్యూహ రచన చేసుకున్నాడు. ఈ నెల 27న కర్నూలుకు చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ జమ్మలమడుగు పెద్ద అన్వర్‌బాషా, ఏఆర్ కానిస్టేబుళ్లు కుంటా సత్యనారాయణ, ఏటూరి బాలస్వామి కర్నూలు నుంచి కడప కేంద్ర కారాగారానికి వచ్చారు. సునీల్‌కుమార్‌ను కర్నూలులోని కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్లారు. తర్వాత తిరుగు ప్రయాణంలో తనకు డబ్బులు రావాలని, పులివెందుల మార్గంలో నందిమండలం వద్దకు వెళితే వచ్చిన డబ్బుల్లో వారికి ఇస్తానని ప్రలోభ పెట్టాడు. తర్వాత సంఘటనను తాను అనుకున్న ప్రకారం కడప బిల్టప్ సర్కిల్ వద్దకు రాగానే డస్టర్ కారు (ఏపీ37 బీఎస్ 0369)ను అప్పటికే అనంతపురం జిల్లా పుట్లూరు మండలం తలారి పాపమ్మగారి గోపాల్ అద్దెకు వెళుతున్నానని తాడిపత్రికి చెందిన తన యజమానికి చెప్పి చేరుకున్నాడు. ఇతనితోపాటు పెండ్లిమర్రికి చెందిన బాలకృష్ణ, శ్రీనివాసులు, మరో మహిళ అమ్మణ్ణి కూడా వచ్చారు. వీరితోపాటు ఓ మోటారు సైకిల్ (ఏపీ04 ఏజీ 7228)ను పై నిందితుల్లో ఒకరైన శ్రీనివాసులు తీసుకొచ్చారు. గత నెల 27వ తేది రాత్రి 8 గంటల సమయంలో కారులో సునీల్, కానిస్టేబు ళ్లు ఇరువురు బంధువులతో కలిసి నందిమండలం వద్దకు వెళ్లారు. అక్కడ కొండమీద గంగమ్మ గుడి సమీపంలో సునీల్ కారులో మహిళతో ఏకాంతంగా గడిపారు.
ముచ్చట్లు ఆడుతుండగా..
కానిస్టేబుళ్లు, సునీల్ బంధువులు కారు సమీపంలో ముచ్చట్లు ఆడుతుండగా .. కొంత సేపటికే సునీల్ తన పని ముగించుకుని మహిళను అక్కడే దించేసి కారులో కొంతదూరం పరారయ్యాడు. గమనించిన పోలీసులు వెంబడించారు. రెండు కిలోమీటర్లు దాటిన తర్వాత మరో మోటారు సైకిల్‌లో అతనికి సహకరించిన వారు రావడంతో.. అదే బైక్ ద్వారా పరారైనట్లు తెలుస్తోంది. ఈ సంఘటన జరిగిన వెంటనే కానిస్టేబుళ్లు పెండ్లిమర్రి పోలీసుస్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందే హెడ్ కానిస్టేబుల్ మార్గంమధ్యలో చాగలమర్రిలో దిగిపోయాడు. ఇరువురు కానిస్టేబుళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఎస్పీ బాబూజీ అట్టాడ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా ఆధ్వర్యంలో కడప రూరల్ సీఐ హేమసుందర్‌రావు, పెండ్లిమర్రి ఎస్‌ఐ ఎస్‌కే రోషన్, కడప తాలూకా ఎస్‌ఐ ఎన్.రాజరాజేశ్వర్‌రెడ్డి, చిన్నచౌకు ఎస్‌ఐ మోహన్, తమ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారు.
ఆదివారం ఉదయం పెండ్లిమర్రి మండలం తిప్పిరెడ్డిపల్లె క్రాస్ వద్ద పెండ్లిమర్రి మండలం వెల్లటూరుకు చెందిన పెండ్లిమర్రి బాలకృష్ణ, అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గాండ్లపాడుకు చెందిన తలారి పాపమ్మగారి గోపాల్, పెండ్లిమర్రికి చెందిన చింతాకుల శ్రీనివాసులును అరెస్ట్ చేశారు. వీరు ఎత్తుకుపోయిన రెండు తుపాకులను, సెల్‌ఫోన్లు, బుల్లెట్ సామగ్రిని, కారు, మోటారు సైకిల్‌ను సీజ్ చేశారు. అలాగే జీవిత ఖైదు సునీల్‌కుమార్‌కు పారిపోవడానికి అవకాశం కల్పించిన కర్నూలుకు చెందిన ఒక ఏఆర్ హెడ్ కానిస్టే బుల్ జమ్మలమడుగు పెద్ద అన్వర్‌బాష, ఏఆర్ కానిస్టే బుళ్లు కుంట సత్య నారాయణ, ఏటూరి బాలస్వామిని కూడా అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యల కోసం రిమాండ్‌కు తరలించారు. త్వరలోనే సునీల్‌ను, అతను పారిపోవడానికి సహకరించిన మిగిలిన నిందితులను అరెస్ట్ చేస్తామనీ డీఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో కడప రూరల్ సీఐ హేమసుందర్ రావు, పెండ్లిమర్రి ఎస్‌ఐ రోషన్, కడప తాలూకా ఎస్‌ఐ ఎన్. రాజరాజేశ్వరరెడ్డి, చిన్నచౌక్ ఎస్‌ఐ మోహన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment