
నెక్కొండ(నర్సంపేట): అరబ్ షేక్‌ల తరహా మోసాలు వరంగల్‌లో వెలుగు చూశాయి. వయసుపై బడిన వారు బాలికలు, యువతులను పెళ్లాడేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఏజెంట్లను నియమించుకుని బాలికల తల్లిదండ్రులను ఒప్పిస్తున్నారు. లంబాడీ తండాలే కేంద్రాలుగా ఈ మోసాలు జరుగుతున్నాయి. ఈ తరహా మోసం వరంగల్ రూరల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. నెక్కొండ మండలం గొట్లకొండ తండాకు చెందిన ఇద్దరు బాలికలు, ఓ వివాహిత మొత్తం ముగ్గురిని ఇతర రాష్ట్రాలకు చెందిన యాభై ఏళ్లకు పైబడిన ముగ్గురు వ్యక్తులు పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారంలో ఓ బాలిక పెళ్లికి నిరాకరించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
17వ తేదీన..
ఉత్తరభారత దేశానికి చెందిన 50 ఏళ్లకు పైబడిన వయసు కలిగిన ముగ్గురు వ్యక్తులు మహబూబాబాద్ చుట్టు పక్కల గిరిజన యువతులను పెళ్లాడేందుకు ప్రయత్నించారు. వీరికి నెక్కొండ మండలం గొట్లకొండ గ్రామపంచాయితీ నాలుగో వార్డు సభ్యుడు గుగులోతు బిచ్చాతో పరిచయం అయ్యింది. తమ గ్రామానికి చెందిన ముగ్గురు పెళ్లికి సిద్ధంగా ఉన్నారంటూ బిచ్చా తెలిపారు. ఇందులో ఇద్దరు బాలికలు, వివాహం అయి భర్తతో దూరంగా ఉంటూ విడాకులకు ప్రయత్నిస్తున మరో మహిళ ఉన్నట్లు బిచ్చా చెప్పడంతో వయసుపైడిన ఆ ముగ్గురు వ్యక్తులు పెళ్లిల్ల కోసం రాజస్తాన్ నుంచి మహబూబాబాద్‌కు వచ్చారు. ఇద్దరు బాలికలు, వివాహితతోపాటు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులు కేసముద్రం మండలం ఇనుగుర్తిలో ఓ పార్కుకు ఈనెల 17న చేరుకున్నారు. ఇందులో ఓ బాలిక పార్కులోకి వచ్చేందుకు నిరాకరించింది. దీంతో మిగిలిన ఇంకో బాలిక, వివాహితతో పెళ్లి తంతు జరిపించారు. ఆయా కుటుంబాల సంప్రదాయం ప్రకారం బాలిక, యువతిని కూర్చోబెట్టి వారి నుదుట పెళ్లి చేసుకునే వ్యక్తితో బొట్టు పెట్టించారు. ఈ తంతంగాన్ని వీడియో తీశారు.
ఇష్టం లేక..
ఇనుగుర్తి పార్కులో పెళ్లి తంతులో భాగంగా బొట్టు పెట్టుడు కార్యక్రమం పూర్తయిన తర్వాత నవంబరు 18న నెక్కొండ మండలం గొట్లకొండకు బాలిక, వివాహిత చేరుకుంది. మరుసటి రోజు నుంచి పెళ్లి(బొట్టు పెట్టుడు) జరిగింది కాబట్టి తమ భార్యలను పంపిస్తే తీసుకెళ్తామంటూ రాజస్తాన్‌కు చెందిన వారు బిచ్చాకు ఫోన్ చేయడం ప్రారంభించారు. అలాగే వెళ్లిపోయిన బాలికను పెళ్లికి ఒప్పించాలంటూ ఒత్తిడి చేశారు. పెళ్లిపై ఒత్తిడి తీవ్రం కావడంతో నవంబరు 23 గురువారం రాత్రి సదరు బాలిక విషయాన్ని తండ్రికి తెలిపింది. దీంతో కూతురు ద్వారా నెక్కొండ పోలీసులకు గురువారం రాత్రి సమాచారం అందించారు. శుక్రవారం బిచ్చాపై కేసు నమోదు చేశారు.
పెళ్లి తంతు నిర్వహిస్తున్న దృశ్యం
ఒక్కో పెళ్లికి రూ.50వేలు
ఇద్దరు బాలికలు, మరో వివాహితతో యాభైఏళ్లకు పైబడిన వ్యక్తులకు ఇచ్చి పెళ్లి జరిపించేందుకు నెక్కొండ నాలుగోవార్డు సభ్యుడు గుగులోతు బిచ్చా మధ్యవర్తిగా వ్యవహరించాడు. ఇందుకు ఒక్కో పెళ్లికి రూ.50 కమీషన్‌గా తీసుకునేందుకు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులతో ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే లంబాడీ తండాలలో శిశువులను అమ్మకాలు జరుగుతున్న వైనం వివా దాస్పదం అవుతోంది. ఈ తరుణంలో అరబ్‌షేక్‌ల తరహాలో బాలికలను వయసు పైడిన వ్యక్తులకు ఇచ్చి పెళ్లి చేస్తున్న అంశం బయటపడటం చర్చనీయాంశంగా మారింది. పెళ్లి విషయంలో గ్రామస్తులు, బాలికల తలిదండ్రులకు సమాచారం లేకపోవడం విస్మయం కలిగిస్తోంది.
మహబూబాబాద్ అడ్డా..
మహబూబాబాద్ చుట్టు పక్కల ఉన్న మార్బుల్, గ్రానైట్ వ్యాపార లావాదేవీల కోసం రాజస్థాన్‌కు చెందిన వారు ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నారు. ఇందులో కొందరు ఇక్కడి గిరిజన యువతులను పెళ్లిలు చేసుకుంటున్నారు. వయసు పైడిన వ్యక్తులకు గిరిజన యువతులను వెతికి పెట్టేందుకు మహబూబాబాద్ కేంద్రంగా కొన్ని ముఠాలు/వ్యక్తులు పనిచేస్తున్నారు. ఇందులో ఓ ముఠా సభ్యులతో బిచ్చాకు సంబంధాలు ఉన్నాయి. అలా ఈ పెళ్లి తంతు కార్యక్రమం జరిగింది. ఇప్పటికే మహబూబాబాద్ మండలం ఏటిగడ్డకు చెందిన ఓ ముఠా ఇదే తరహాలో ఐదు పెళ్లిల్లు జరిపించినట్లు సమాచారం.
పరారీలో నిందితుడు
బాధిత బాలిక కుటుంబం నుంచి ఫిర్యాదు తీసుకుని బిచ్చాపై కేసు నమోదు చేశాం. ప్రస్తుతం బిచ్చా పరారీలో ఉన్నాడు. బాలికలను పెళ్లి చేసుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరనే అంశంపై విచారణ చేస్తున్నాం. త్వరలో వీరిని అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరిస్తాం.– నవీన్, ఎస్సై, నెక్కొండ
Comments
Please login to add a commentAdd a comment