రమేష్ ఛత్రి, రీటా(ఫైల్)
బంజారాహిల్స్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక భార్యాభర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుధీర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నేపాల్‌కు చెందిన రమేష్ ఛత్రి(45), రీటా(42) దంపతులు యూసుఫ్‌గూడ సమీపంలోని వెంకటగిరిలో ఉంటూ స్థానిక ఫాస్ట్‌ఫుడ్‌సెంటర్‌లో పని చేస్తున్నారు. రమేష్‌కు గతంలోనే ఓ యువతితో వివాహం కాగా కుమారుడు కూడా ఉన్నాడు. ఆరేళ్ల క్రితం మొదటి భార్యను వదిలేసిన అతను అప్పటికే వివాహం చేసుకొని ఓ కుమార్తె ఉన్న రీటాను రెండో పెళ్లి చేసుకున్నాడు. రీటా, రమేష్ దంపతులు గది అద్దెకు తీసుకొని ఉంటుండగా రీటా కుమార్తె మరో చోట ఉంటోంది.
గత కొంత కాలంగా ఆర్థిక సమస్యలు తీవ్రం కావడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో పని ముగించుకొని గదికి వచ్చారు. రాత్రి 9.20 గంటల ప్రాంతంలో వీరి ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున పొగలు వస్తుండటాన్ని గుర్తించిన ఇంటి యజమాని జహంగీర్ షరీఫ్ రమేష్ సోదరుడు రతన్ ఛత్రికి ఫోన్ చేశాడు. అక్కడికి వచ్చిన అతను ఇంటి యజమాని సహాయంతో తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో మంటలు వ్యాపించాయి. రమేష్, రీటా మంటల్లో దగ్ధమై విగతజీవులుగా మారారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. వీరిద్దరూ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని మృతుడి సోదరుడు ఫిర్యాదు చేశారు. గతమూడు నెలలుగా అద్దె కూడా ఇవ్వడం లేదని ఇంటి యజమాని తెలిపారు. జూబ్లీహిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment