అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్ సిబ్బంది
గరివిడి: దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ప్రమాదం విజయనగరం జిల్లా గరి విడి మండలం వెదుళ్లవలస గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన సీఆర్‌పీఎఫ్ జవాను కాపరోతు వెంకటరమణరావు(48), భార్య నాగమణి(40) మృతి సమాచారం కుటుంబీకులు, గ్రామస్తులను కలచి వేసింది. కార్తీక పౌర్ణమి పూజలు కుటుంబంతో కలసి చేసుకోవాలని సుదూరం నుంచి వచ్చిన ఆ దంపతులు అర్ధంతరంగా ప్రాణా లు కోల్పోవడం విషాదాంతమైంది. కనురెప్పపాటులో జరిగిన దుర్ఘటనలో వారిద్దరూ శవాలుగా మారడంతో పిల్లలు అనాథలయ్యా రు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా.. మండలంలో వెదుళ్లవలసకు చెందిన కాపరోతు వెంకటరమణరావు ఛత్తీస్‌గఢ్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) హెచ్‌సీగా పనిచేస్తున్నారు.
ఆయన భార్య నాగమణితో కలసి అక్కడే నివాసముంటున్నారు. కార్తీక పౌర్ణమి పూజలు కుటుంబ సభ్యులతో కలసి చేసుకోవాలని ఛత్తీస్‌గఢ్ నుంచి సికింద్రాబాద్–భువనేశ్వర్ వీక్లీ స్పెషల్ ట్రైన్‌లో వస్తున్నారు. ముందుగా నాగమణి కన్నవారి ఊరైన దువ్వాడలో దిగి వెదుళ్లవలస రావా లని వారు భావించారు. ఏసీ బోగీలో ప్రయాణిస్తూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇంతలో ఆదివారం వేకువజాము మూడు గంటలయ్యేసరికి దువ్వాడ రైల్వే స్టేషన్ వచ్చేసింది. తోటి ప్రయాణికులు వారిని లేపి దువ్వాడ స్టేషన్‌లో దిగుతామన్నారు కదా అని చెప్పడంతో వారు కంగారు పడి లేచి కదిలిపోతున్న రైలు నుంచి ప్లాట్‌ఫారం వైపు కాకుండా రెండో వైపున మొదట వెంకటరమణరావు తన చేతిలో ఉన్న బ్యాగును బయటకు విసిరి గాబరాగా దిగి ప్రమాదవశాత్తూ రైలు చక్రాల మధ్యలో ఇరుక్కున్నాడు. తన భర్త కూడా దిగిపోయాడనుకొని భార్య నాగమణి కూడా దిగి చక్రాల కింద నలిగిపోయింది. ఇద్దరి శరీరాలు నుజ్జనుజ్జయ్యాయి. మృతదేహాలను అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. విశాఖపట్నం జీఆర్‌పీ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అధికారిక లాంఛనాలతోఅంత్యక్రియలు..
మృతదేహాలను సొంత ఊరైన వెదుళ్లవలసలకు ఆదివారం సాయంత్రానికి తీసుకువచ్చారు. ఇక్కడే విశాఖకు చెందిన సీఆర్‌పీఎఫ్ సిబ్బంది అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. వెంటరమణరావు, నాగమణి దంపతులకు ఇద్దరు మగపిల్లలున్నారు. పెద్దకుమారుడు పవన్ సాయికృష్ణ మద్రాసులోని విట్ ఇంజినీరింగ్‌లో బీటెక్ ద్వీతీయ సంవత్సరం చదువుతుండగా, రెండో కొడుకైన నేతాజీ వెంకటసాయి హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment