తండ్రి అప్పారావుతో జాహ్నవి (ఫైల్), హారిక మృతదేహం, హారిక (ఫైల్)
అగనంపూడి (గాజువాక): ముక్కు పచ్చలారని ముద్దులొలికే చిన్నారులు.. ముద్దు మాటలతో అమ్మా నాన్నలను మురిపించే పసికూనలు... అప్పటి వరకు బుడి బుడి అడుగులు వేసుకుంటూ ఆటలాడుతున్నారు. అంతలోనే.. వారిని రైలుబండి మృత్యువై కబళించింది. రైలు శబ్దం విని సంబరపడిì పట్టాలెక్కిన ఆ చిన్నారులకు నిండు నూరేళ్లూ నిండిపోయాయి. పరవాడ పోలీస్టేషన్ పరిధి, తాడి రైల్వేస్టేషన్‌కు సమీపంలోని గొల్లపేటలో జరిగిన హృదయ విదారక సంఘటనకు సంబంధించి గ్రామస్తులు, చిన్నారుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న బంధం రామకృష్ణకు భార్య భవానీ, కుమార్తె హారిక (3) ఉన్నారు. భవానీ ప్రస్తుతం నిండు గర్భిణి. ప్రైవేటు కంపెనీలో వెల్డర్‌గా పని చేస్తున్న అదే గ్రామానికి చెందిన బర్ల అప్పారావు, శివలక్ష్మి దంపతులకు పిల్లలు పుట్టకపోవడంతో జాహ్నవి (3)ని పెంచుకుంటున్నారు. రామకృష్ణ, అప్పారావులకు ఒక్కొక్కరే కుమార్తెలు కావడంతో పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ ఆనందాన్ని హరిస్తూ రైలు బండి రూపంలో మృత్యువు చిన్నారుల ప్రాణాలను బలిగొంది.
వేగానికి ఎగిరి పడిన చిన్నారులు
గొల్లపేట గ్రామం రైల్వే ట్రాక్‌ను ఆనుకొని ఉంది. శుక్రవారం సాయంత్రం చిన్నారులిద్దరూ ఆడుకుంటూ పట్టాలపైకి వెళ్లిపోయారు. ఆ సమయంలో పిల్లల తల్లిదండ్రులు గానీ.. స్థానికులెవ్వరూ లేకపోవడం.. రైలు బండి శబ్ధం చేస్తూ రావడం జరిగిపోయాయి. పిల్లలకు ఏం జరుగుతుందో తెలిసే లోపే రైలుబండి రూపంలో మృత్యువు కబళించింది. రైలుబండి వేగానికి చిన్నారులిద్దరూ ఎగిరి 15 మీటర్ల దూరం ఎగిరి పడిపోవడంతో దుర్మరణం చెందారు. అప్పటి వరకు ఆడుకుంటూ కనపడిన పిల్లలు ఒక్కసారిగా మృత్యువాత పడడంతో గొల్లపేట దిగ్భ్రాంతికి గురైంది. చిన్నారుల తల్లిదండ్రులు భోరున విలపిస్తూ సొమ్మసిల్లి పడిపోయారు. మృతదేహాలను గ్రామస్తులు సంఘటనా స్థలం నుంచి గ్రామంలోకి తీసుకువెళ్లిపోయారు. సంబంధిత అధికారులకు సమాచారం లేకుండా గ్రామస్తులు మృతదేహాలను అక్కడి నుంచి తీసుకువెళ్లి ఖననం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment