సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన దంపతులు గుజరాత్ వ్యాపారులకు టోకరా వేశారు. కమీషన్ పద్ధతిలో విలువైన ఉంగరాలు అమ్మిపెడతామంటూ ఎర వేశారు. వారి నుంచి రూ.1.6 కోట్లు ఖరీదు చేసే ఆరు ఉంగరాలు తీసుకుని మోసం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) ఫిర్యాదు చేశారు. గురువారం కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ప్రాంతానికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి కొన్నేళ్లుగా హైదరాబాద్ వచ్చిపోతూ వ్యాపారం చేస్తున్నాడు. వజ్రాలతో పాటు ఖరీదైన రాళ్లు పొదిగిన ఆభరణాలు, ఉంగరాలకు తీసుకువచ్చి స్థానిక వ్యాపారులకు సరఫరా చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో సిటీకి చెందిన దంపతులతో పరిచయం ఏర్పడింది. నగరంలో తామూ వజ్రాభరణాల వ్యాపారం చేస్తున్నామంటూ వారు అతడితో చెప్పారు. తమకు అనేక మంది పరిచయస్తులైన వారు, సంపన్న వర్గాలకు చెందిన కస్టమర్లు ఉన్నారని, తమకు కొన్ని ఉంగరాలు ఇస్తే అమ్మి పెడతామంటూ ఎర వేశారు. అలా చేస్తే కమీషన్ సైతం ఇస్తానంటూ చెప్పిన గుజరాత్ వ్యాపారి కొన్ని నెలల క్రితం రూ.1.5 కోట్ల విలువైన నాలుగు ఉంగరాలు (ఒకటి వజ్రం, మిగిలిన మూడు ఖరీదైన రాళ్లు పొదిగినవి) ఇచ్చాడు. వీటికి సంబంధించిన నగదు చెల్లించమని దంపతుల్ని వ్యాపారి కోరగా.. ఇంకా అమ్ముడుపోలేదంటూ కొన్నాళ్లుగా నమ్మబలుకుతూ వస్తున్నారు.
ఆపై ఖరీదు చేసిన వారి నుంచి డబ్బు రావాల్సి ఉందని మరికొన్ని రోజులు తప్పించుకున్నారు. చివరకు అతడికి అందుబాటులో లేకుండా ఉంటున్నారు. ప్రతి నెలా సిటీకి వస్తున్న గుజరాత్ వ్యాపారి ఇక్కడి ఓ సమాజ్‌లో ఉంటూ నగదు వసూలు కోసం రెండుమూడు రోజులు ప్రయత్నించి వెళ్లేవాడు. ఇలా ఆ సమాజ్‌లో ఈయన ఉన్నప్పుడే గుజరాత్‌కు చెందిన మరో వ్యక్తీ వచ్చి ఉండేవాడు. కొన్నాళ్లకు వీరిద్దరికీ పరిచయం కావడంతో వ్యాపార విషయాలతో పాటు ఇతర అంశాలూ చర్చించుకోవడం మొదలెట్టారు. ఈ నేపథ్యంలో మొదటి వ్యాపారి నుంచి రూ.1.5 కోట్ల విలువైన నాలుగు ఉంగరాలు తీసుకున్న దంపతులే.. దీనికి కొన్నాళ్ల ముందే మరో వ్యాపారి నుంచి రూ.15 లక్షల విలువైన రెండు ఉంగరాలు తీసుకుని మోసం చేసినట్లు ఇద్దరూ తెలుసుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఇద్దరూ కలిసి నగరానికి వస్తూ డబ్బు వసూలుకు ప్రయత్నాలు చేసేవారు. వీరు వచ్చి సమాజ్‌లో ఉంటున్న నాలుగు రోజూలూ ఆ దంపతులు సిటీలో లేకుండా.. ఉన్నా అందుబాటులో ఉండకుండా తప్పించుకుని తిరగడం మొదలెట్టారు. కొన్ని రోజులుగా కనీసం వీరి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం మానేశారు. దీంతో ఇద్దరు వ్యాపారులూ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇరువురినీ మోసం చేసింది ఒకరే కావడంతో కలిసి కొన్ని రోజుల క్రితం సీసీఎస్ పోలీసుల్ని ఆశ్రయించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆధారాలు సేకరించిన అధికారులు సిటీకి చెందిన దంపతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment