అస్ఘర్ అలీని అహ్మదాబాద్ తీసుకెళుతున్న పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉగ్రవాది అస్ఘర్ అలీని గుజరాత్ పోలీసులు పీటీ వారెంట్‌పై అక్కడకు తరలించారు. ఆ రాష్ట్ర మాజీ హోమ్‌మంత్రి హరేన్‌పాండ్య హత్య కేసులో అస్ఘర్‌ను సైతం దోషిగా నిర్థారిస్తూ సుప్రీం కోర్టు గత నెల మొదటి వారంలో తీర్పు ఇచ్చింది. దీంతో బయట ఉన్న ఇతర దోషులు వెళ్ళి గుజరాత్‌లో లొంగిపోగా... గంజాయి కేసులో అరెస్టై నల్లగొండ జైల్లో ఉన్న అస్ఘర్ అలీని బుధవారం పీటీ వారెంట్‌పై తీసుకువెళ్ళారు. గురువారం అహ్మదాబాద్‌లోని పోటా ప్రత్యేక న్యాయస్థానంలో అస్ఘర్‌ను హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు శిక్ష పూర్తి చేయడం కోసం అతడిని సబర్మతి జైలుకు పంపారు.
ప్రణయ్ హత్యకేసుతోపాటు పలు కేసుల్లో నిందితుడు
నల్లగొండలోని దారుల్‌షిఫా కాలనీకి చెందిన మహ్మద్ అస్ఘర్ అలీ బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఉగ్రవాదానికి ఆకర్షితుడయ్యాడు. అప్పటి నుంచి పలు ఉగ్రవాద సంబంధిత కేసుల్లో నిందితుడిగా మారాడు. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్‌పాండ్యను హత్య చేయడానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు 2003లో కుట్ర పన్నాయి. ఈ బాధ్యతల్ని గుజరాత్‌కు చెందిన లిక్కర్ డాన్, ఉగ్రవాది రసూల్ ఖాన్ పాఠి ద్వారా అస్ఘర్‌కు అప్పగించాయి. రసూల్ కొన్నాళ్ళ పాటు నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో తలదాచుకున్నాడు. అప్పట్లోనే అస్ఘర్‌తో ఇతడికి పరిచయం ఏర్పడింది. అప్పట్లో హరేన్‌పాండ్య హత్యకు నేరుగా రంగంలోకి దిగింది అస్ఘర్ అలీనే. హరేన్‌పాండ్య 2003 మార్చ్ 26న తన ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తుండగా కారులో వెళ్ళిన ఉగ్రవాదులు ఆయన్ను కాల్చి చంపాడు. స్వయంగా> తుపాకీ పట్టుకున్న అస్ఘర్ ఐదు రౌండ్లు పాండ్యపై కాల్చడంతో ఆయన కన్నుమూశారని దర్యాప్తు అధికారులు తేల్చారు. ఈ కేసు దర్యాప్తు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ అదే ఏడాది ఏప్రిల్ 17న మేడ్చెల్‌లోని ఫామ్‌హౌస్‌లో తలదాచుకున్న అస్ఘర్ తదితరుల్ని పట్టుకుంది. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులుగా ఉన్న 15 మంది అరెస్టు అయ్యారు.
సుదీర్ఘకాలం గుజరాత్‌లోని సబర్మతి జైల్లో ఉన్న వీరిపై విచారణ జరిపిన అహ్మదాబాద్‌లోని పోటా కోర్టు అస్ఘర్ తదితరులను దోషులుగా తేల్చి అస్ఘర్‌కు జీవితఖైదు విధించింది. 2011లో ఈ కేసు గుజరాత్ హైకోర్టులో వీగిపోవడంతో వాళ్ళు బయటపడ్డారు. గుజరాత్ హైకోర్టు తీర్పును ఆ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. దీన్ని విచారించిన సుప్రీం కోర్టు పోటా న్యాయస్థానం విధించిన శిక్షల్ని సమర్థిస్తూ అమలు చేయాలని గత నెల మొదటి వారంలో ఆదేశించింది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉండి దోషులుగా తేలిన గుజరాత్ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన రెహాన్ పుథావాలా, పర్వేజ్ ఖాన్ పఠాన్, హాజీ ఫారూఖ్, కలీం కరీమి, అనాస్ మచ్చీస్ వాలా, పర్వేజ్ షేక్, మహ్మద్ రియాజ్ గోరు, యూనుస్ సర్వేష్ వాలా కొన్నాళ్ళ క్రితం నేరుగా వెళ్ళి అహ్మదాబాద్‌లోని పోటా కోర్టులో లొంగిపోయారు. గత ఏడాది మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉండి, పీడీ యాక్ట్ పడిన అస్ఘర్ అలీపై ఇటీవలే బయటకు వచ్చాడు. వచ్చిన వెంటనే గంజాయి మత్తుకోసం ప్రయత్నించి ఆ మాదకద్రవ్యాన్ని ఖరీదు చేసి దగ్గర పెట్టుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న నల్లగొండ పోలీసులు మరోసారి అరెస్టు చేసి జైలుకు పంపారు. దీంతో ఇతడు నేరుగా వెళ్ళి లొంగిపోవడం సాధ్యం కాలేదు. ఈ విషయం తెలుసుకున్న గుజరాత్ పోలీసులు అహ్మదాబాద్‌లోని పోటా కోర్టు నుంచి పీటీ వారెంట్ పొందారు. దీన్ని త్వరలో తీసుకురానున్న ప్రత్యేక బృందం నల్లగొండకు వచ్చింది. బుధవారం ఇక్కడి జైలు అధికారులకు వారెంట్‌ను అందించి అస్ఘర్‌ను తీసుకువెళ్ళింది.
Comments
Please login to add a commentAdd a comment