ప్రణయ్‌ కేసులో నిందితుడిని గుజరాత్‌కు.. | PT Warrant on Pranay Killer Asghar Ali | Sakshi
Sakshi News home page

నల్లగొండ టు గుజరాత్‌..

Published Thu, Aug 1 2019 11:50 AM | Last Updated on Thu, Aug 1 2019 11:50 AM

PT Warrant on Pranay Killer Asghar Ali - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అస్ఘర్‌ అలీని గుజరాత్‌ తరలించేందుకు అక్కడి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఆ రాష్ట్ర మాజీ హోం మంత్రి హరేన్‌పాండ్య హత్య కేసులో అస్ఘర్‌ సహా మరికొందరిని దోషులుగా నిర్థారిస్తూ సుప్రీం కోర్టు  ఈ నెల మొదటి వారంలో తీర్పు ఇచ్చింది. దీంతో బయట ఉన్న వారు కోర్టులో లొంగిపోగా... గంజాయి కేసులో అరెస్టై నల్లగొండ జైల్లో ఉన్న అస్ఘర్‌ అలీని పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లనున్నారు. ఈ మేరకు అహ్మదాబాద్‌లోని పోటా ప్రత్యేక న్యాయస్థానం పీటీ వారెంట్‌ జారీ చేసింది. దీంతో త్వరలో అస్ఘర్‌ను త్వరలో గుజరాత్‌ తరలించడానికి అక్కడి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. నల్లగొండ, దారుల్‌షిఫా కాలనీకి చెందిన మహ్మద్‌ అస్ఘర్‌ అలీ బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఉగ్రవాదానికి ఆకర్షితుడయ్యాడు. పాకిస్థాన్‌లో శిక్షణ పొందిన అతను ప్యార్‌ సూఖాబాగ్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ బారి తదితరులతో ముఠా ఏర్పాటు చేశాడు. బాబ్రీని కూల్చివేసిన ‘కర సేవకులు’ అనే ఆరోపణలపై నగరంలో రెండు దారుణ హత్యలు జరిగాయి. 1993 జనవరి 22న వీహెచ్‌పీ నేత పాపయ్య గౌడ్‌ను, అదే ఏడాది  ఫిబ్రవరి 2న అంబర్‌పేట్‌లోని సెంట్రల్‌ ఎక్సైజ్‌ కాలనీలో మాజీ కార్పొరేటర్, బీజేపీ నేత నందరాజ్‌ గౌడ్‌ను హత్య చేశారు. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న మీర్జా ఫయాజ్‌ అహ్మద్‌కు జీవితఖైదు పడింది. మిగిలిన కేసుల విచారణ కోసం చర్లపల్లి జైలులో ఉన్న ఇతడిని నాంపల్లి కోర్టుకు తీసుకురాగా... అస్ఘర్, బారీ తదితరులు పథకం ప్రకారం 1996 డిసెంబర్‌ 19న ఎస్కేప్‌ చేయించారు.  కాగా 1997 ఫిబ్రవరిలో అస్ఘర్, బారీ సహా పది మంది నిందితులను సిటీ పోలీసులు నాంపల్లి వద్ద పేలుడు పదార్థాలతో పట్టుకున్నారు. ఈ విచారణలోనే మీర్జా ఎస్కేప్‌లోనూ అస్ఘర్‌ పాత్ర వెలుగులోకి వచ్చింది. 

హరేన్‌ పాండ్య హత్యలో కీలకం...
గుజరాత్‌ మాజీ హోంమంత్రి హరేన్‌పాండ్యను హత్య చేసేందుకు 2003లో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు  కుట్ర పన్నాయి. ఈ బాధ్యతల్ని గుజరాత్‌కు చెందిన లిక్కర్‌ డాన్, ఉగ్రవాది రసూల్‌ ఖాన్‌ పాఠి ద్వారా అస్ఘర్‌కు అప్పగించాయి. 2003 మార్చ్‌ 26న తన ఇంటి సమీపంలో వాకింగ్‌ చేస్తున్న హరేన్‌పాండ్యను కారులో వచ్చిన ఉగ్రవాదులు కాల్చి చంపారు. స్వయంగా తుపాకీ పట్టుకున్న అస్ఘర్‌ ఐదు రౌండ్లు   కాల్చడంతో ఆయన కన్నుమూశారు. ఈ కేసు దర్యాప్తు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ అదే ఏడాది ఏప్రిల్‌ 17న మేడ్చల్‌లోని ఫామ్‌హౌస్‌లో తలదాచుకున్న అస్ఘర్‌ తదితరులను పట్టుకుంది. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులు కాగా 15 మంది అరెస్టు అయ్యారు. సుదీర్ఘకాలం గుజరాత్‌లోని సబర్మతి జైల్లో ఉన్న వీరిపై విచారణ జరిపిన అహ్మదాబాద్‌లోని పోటా కోర్టు  అస్ఘర్‌ తదితరులను దోషులుగా తేల్చి అస్ఘర్‌కు జీవితఖైదు విధించింది. 2011లో ఈ కేసు గుజరాత్‌ హైకోర్టులో వీగిపోవడంతో వారు బయటపడ్డారు. గుజరాత్‌ ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది. దీన్ని విచారించిన సుప్రీం కోర్టు పోటా న్యాయస్థానం విధించిన శిక్షల్ని సమర్థిస్తూ అమలు చేయాలని ఈ నెల మొదటి వారంలో ఆదేశించింది. దీంతో ఈ కేసులో దోషులుగా తేలిన రెహాన్‌ పుథావాలా, పర్వేజ్‌ ఖాన్‌ పఠాన్, హాజీ ఫారూఖ్, కలీం కరీమి, అనాస్‌ మచ్చీస్‌ వాలా, పర్వేజ్‌ షేక్, మహ్మద్‌ రియాజ్‌ గోరు, యూనుస్‌ సర్వేష్‌ వాలా అహ్మదాబాద్‌లోని పోటా కోర్టులో లొంగిపోయారు. గత ఏడాది మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడిగా ఉండి, పీడీ యాక్ట్‌ పడిన అస్ఘర్‌ అలీపై ఇటీవల బయటకు వచ్చాడు. వచ్చిన వెంటనే గంజాయికోసం ప్రయత్నించిన అతను దానిని కొనుగోలు చేసి తన దగ్గర పెట్టుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న నల్లగొండ పోలీసులు మరోసారి అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ నేపథ్యంలోనే అతడిని గుజరాత్‌ తరలించడానికి అక్కడి పోలీసులు అహ్మదాబాద్‌లోని పోటా కోర్టు నుంచి పీటీ వారెంట్‌ పొందారు. త్వరలో ఇక్కడికి రానున్న ప్రత్యేక బృందం అస్ఘర్‌ను తీసుకువెళ్ళనుంది. గరిష్టంగా పది రోజుల్లో ఈ తతంగం పూర్తి చేయడానికి గుజరాత్‌ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement