ఐపీఎల్‌ హోరు..బెట్టింగ్‌ జోరు | Cricket Bettings On ipl Matches | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ హోరు..బెట్టింగ్‌ జోరు

Published Tue, Apr 10 2018 7:50 AM | Last Updated on Tue, Apr 10 2018 7:50 AM

Cricket Bettings On ipl Matches - Sakshi

జిల్లాను ఐపీఎల్‌ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) బెట్టింగ్‌ ఫీవర్‌ ఆవహించింది. మారుమూల గ్రామాలు మొదలు పట్టణాలు, విజయవాడ నగరం వరకు ప్రస్తుతం క్రికెట్‌ పందేలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. అమాయకులను టార్గెట్‌గా చేసి ఈజీ మనీ ఆశ చూపి రూ.కోట్లు కొల్లగొట్టేందుకు ఇప్పటికే బుకీలు బుసలు కొడుతున్నారు. గతంలో క్రికెట్‌ పందేలు  నిర్వహించి ఆర్థికంగా నష్టపోయి పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయినా అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో క్రికెట్‌ పందేలు కొనసాగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు స్పందించి పందేలు నివారించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.  

కోనేరుసెంటర్‌ (మచిలీపట్నం): ఈ నెల 7 నుంచి మే 27వ తేదీ వరకు సాగనున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి 20 మ్యాచ్‌లను అడ్డుపెట్టుకుని రూ.కోట్లు కొల్లగొట్టే పనిలో బుకీలు నిమగ్నమయ్యారు. రాత్రికి రాత్రే డబ్బు సంపాదించాలనే అత్యాశతో వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, స్థితిమంతులు, కూలీలు, ఆటోడ్రైవర్లు బెట్టింగ్‌ ఊబిలో కూరుకుపోయి బలైపోతున్నా స్పందించే నాథుడే లేడు. ఈ వ్యవహారంలో చివరికి బుకీలు మాత్రం పెద్ద మొత్తంలో జేబులు నింపుకుంటుండగా.. బెట్టింగ్‌రాయుళ్లు మాత్రం బికారులుగా మారిపోతున్నారు. జిల్లాలో మూడేళ్లుగా బెట్టింగ్‌ల పర్వం విచ్చలవిడిగా సాగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఏడాది కూడా బుకీలు మరింత పెట్రేగే ప్రమాదం ఉందంటూ వందలాది కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఐపీఎల్‌  ఫీవర్‌ దెబ్బకు పందెం రాయుళ్లు గజగజలాడిపోతున్నారు. గత ఏడాది ఇదే ఫీవర్‌కు గురైన అనేక మంది ఆర్థికంగా నలిగిపోయి కట్టుబట్టలతో బజారునపడ్డారు. కొంత మంది ఐపీఎల్‌ మహమ్మారిని తప్పించుకునేందుకు ఊళ్లు సైతం వదిలి వెళ్లిపోయారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో భారీగా కొనసాగుతున్న క్రికెట్‌ బెట్టింగ్‌ల వ్యవహారాన్ని అరికట్టే విషయంలో ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు విఫలమయ్యారని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రేక్షకపాత్ర వహిస్తున్నారే గానీ చర్యలు తీసుకునే విషయంలో మీనమేషాలు లెక్కించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

బందరులోనే తొలిమ్యాచ్‌కురూ.కోటికిపైగానే బెట్టింగ్‌...
ఈ నెల 7 నుంచి ప్రారంభమైన ఐపీఎల్‌ సిరీస్‌లో తొలి రోజు జరిగిన ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌కు సంబంధించి ఒక్క బందరులోనే రూ.కోటికిపైగా బెట్టింగ్‌లు జరిగినట్లు తెలుస్తోంది. తొలి రోజు బెట్టింగ్‌ల్లో ఎక్కువ మంది జేబులు ఖాళీ చేసుకోగా బుకీలకు మాత్రం కాసుల వర్షం కురిసినట్లు సమాచారం. తొలిరోజు మ్యాచ్‌లోనే బెట్టింగ్‌ రాయుళ్లు లక్షలకు లక్షలు చేతులు కాల్చుకోగా బుకీలు పెద్ద మొత్తంలో దోచుకున్నారని తెలిసింది.

ప్రతి అంశంపై పందెమే...
 సిరీస్‌ ప్రారంభానికి 30  రోజుల ముందు నుంచే ఏ జట్టు ఫైనల్‌కు చేరుతుంది... ఏ జట్టు విజయం సాధిస్తుంది, ఏయే జట్లు ఫైనల్‌కు చేరతాయి... సిరీస్‌లో ఏ ప్లేయర్‌ ఎక్కువ స్కోరు చేస్తాడు.. ఏ ప్లేయర్‌ అత్యధిక వికెట్‌లు.. తీస్తాడు... సిరీస్‌లో ఎవరు ఎక్కువ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లు దక్కించుకుంటారు...మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ఎవరు గెలుచుకుంటారు.. అత్యధిక సిక్స్‌లు, ఫోర్‌లు ఎవరు కొడతారు... పవర్‌ప్లేలో ఏ జట్టు గెలుస్తుంది... వంటి ప్రతి అంశంలోనూ బెట్టింగ్‌లు రూ.కోట్లలో జరిగినట్లు తెలుస్తోంది. తొలి రోజు మ్యాచ్‌కే రూ. కోటికిపైగా బెట్టింగ్‌లు జరిగితే మరో 50 రోజులు పాటు జరగనున్న 59 మ్యాచ్‌లకు సంబంధించి ఎన్ని కోట్ల రూపాయల్లో బెట్టింగ్‌లు నడుస్తాయోననే చర్చ విస్తృతంగా కొనసాగుతోంది. బెట్టింగ్‌ల దెబ్బకు ఎన్ని వందల కుటుంబాలు వీధినపడతాయనే ఆందోళన అనేక మందిలో నెలకొంది.  జిల్లా వ్యాప్తంగా రూ.వంద కోట్లకుపైగానే బెట్టింగ్‌లు నడుస్తాయని పలువురు అంటున్నారు.

పోలీసులను ప్రసన్నం చేసుకుంటూ....
జిల్లాలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న క్రికెట్‌ బుకీలకు పోలీసుల ఆశీస్సులు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  కళ్ల ముందే రూ.కోట్ల పందేలు జరుగుతున్నా పోలీసులు కళ్లు లేని కబోదుల్లా వ్యవహరించటం ఏంటంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. బందరులో జరుగుతున్న బెట్టింగ్‌లకు సంబంధించి ఒకప్పుడు దివాళా తీసిన బుకీలు సైతం తిరిగి అదే మార్గంలో రూ.లక్షలు ఆర్జిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో బుకీల వద్ద అసిస్టెంట్‌లుగా పనిచేసిన వ్యక్తుల్లో కొందరు ఈ ఏడాది డైరెక్ట్‌ బుకీలుగా అవతారమెత్తినట్లు సమాచారం. బందరులో సుమారు 50 నుంచి 75 మంది వరకు డైరెక్టు, సబ్‌బుకీలు ఉన్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. అయినాæ బుకీలపై  పోలీసు యంత్రాంగం ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవటం సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement