కౌన్‌ బనేగా ‘బకరా’!  | Cyber Crime KBC Lottery Fraud On Online In Hyderabad | Sakshi
Sakshi News home page

కౌన్‌ బనేగా ‘బకరా’! 

Published Sat, Jul 28 2018 7:24 AM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

Cyber Crime KBC Lottery Fraud On Online In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సిటీబ్యూరో : కౌన్‌ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) ప్రోగ్రాం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా దాని పేరు చెప్పి మోసాలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ పేరుతో లాటరీ తగిలిందంటూ ఇద్దరు నగరవాసులకు ఎర వేసిన సైబర్‌ నేరగాళ్లు రూ.6.7 లక్షలు కాజేశారు. బాధితుల్లో ఒకరు గృహిణి కాగా, మరొకరు వాచ్‌మెన్‌. వీరి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితులిద్దరికీ నేరగాళ్లు వాట్సాప్‌లో కాల్‌ చేయడం, ఒకే పేరు చెప్పి పరిచయం చేసుకోవడం, రూ.25 లక్షల ప్రైజ్‌మనీ అంటూ ఎర వేయడం కొసమెరుపు. లండన్‌లో ఉద్యోగమంటూ మరో యువతి నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.1.75 లక్షలు కాజేశారు. ఇదిలా ఉండగా... ఓ వివాహితపై సైబర్‌ వేధింపులకు పాల్పడిన నిందితుడిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు.  

గృహిణి నుంచి రూ.4.48 లక్షలు... 
మాసబ్‌ట్యాంక్‌ ప్రాంతానికి చెందిన మహిళ అబీదకు ఈ నెల 12న ఓ వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. రాణా ప్రతాప్‌ సింగ్‌ అంటూ పరిచయం చేసుకున్న వ్యక్తి ముంబైలోని కేబీసీ ఆఫీస్‌ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పాడు. కేబీసీ లక్కీ డ్రాలో రూ. 25 లక్షలు గెలుచుకున్నారంటూ ఎర వేశాడు. ప్రైజ్‌ మనీ తీసుకోవడానికి కేవలం రూ. 20 వేల ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి గుర్తింపు కార్డులు, బ్యాంకు ఖాతా వివరాలు అందించాలన్నాడు. ఆమె వివరాలు పంపడంతో  ఓ ‘అధికారిక లేఖ’ కూడా పంపించారు. ఆపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అధికారులమంటూ విజయకుమార్, బీకే మిస్రా పేర్లతో మరో ఇద్దరు రంగంలోకి దిగారు. తమ గుర్తింపుకార్డులను సైతం వాట్సాప్‌లో పంపిన వీరు ఆర్బీఐ ద్వారా మీ ప్రైజ్‌మనీ ఖాతాలోకి రానుందని నమ్మబలికారు. జీఎస్టీ, ఆదాయపుపన్ను సహా వివిధ చార్జీ పేరు చెప్పి రూ.4.48 లక్షలు తమ ఖాతాల్లో వేయించుకున్న తర్వాత మరో రూ.2.75 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన ఆమె సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  

రూ.2.26 లక్షలు పొగొట్టుకున్న వాచ్‌మన్‌
దత్తాత్రేయ కాలనీకి చెందిన వాచ్‌మన్‌ బన్సీలాల్‌కు ఈ నెల 25న వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. రాణా ప్రతాప్‌ పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తి అదే కేబీసీ, రూ.25 లక్షల బహుమతి కథ చెప్పాడు. ఆ డబ్బు తీసుకోవడానికి ముందుగా రూ. 16 వేలు ఆదాయపుపన్నుగా చెల్లించాలంటూ నమ్మించాడు. ఈ మాటలు నమ్మిన బన్సీలాల్‌ డబ్బు డిపాజిట్‌ చేశాడు. ఇలా అతడి నుంచి రూ.2.26 లక్షలు కాజేశారు. ఆపై మరో రూ.1.3 లక్షలు డిమాండ్‌ చేయడంతో అనుమానించిన అతను  సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించడంతో కేసు నమోదైంది.  
విదేశీ ఉద్యోగమంటూ  

రూ.1.75 లక్షలు... 
లండన్‌లోని ప్రిన్సెస్‌ రాయల్‌ యూనివర్సిటీ ఆసుపత్రిలో ఉద్యోగం పేరుతో ఎర వేసిన సైబర్‌ నేరగాళ్లు నగరానికి చెందిన యువతి నుంచి రూ.1.75 లక్షలు కాజేశారు. న్యూ మెట్టుగూడకు చెందిన వినీతకు ఉద్యోగానికి సంబంధించిన ఆన్‌లైన్‌లో సమాచారం అందింది. దానికి సంబంధించిన హెచ్‌ఆర్‌ హెడ్‌ మోర్‌గెయిన్‌ క్లీన్‌ పేరుతో అపాయింట్‌మెంట్‌ లెటర్‌ కూడా వచ్చింది. మూడేళ్లు పని చేయడానికి బాండు ఇస్తే నెలకు 4500 పౌండ్ల జీతం అంటూ అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి కొన్ని ఒప్పంద పత్రాలు సైతం ఆన్‌లైన్‌లో పంపించారు. ఆపై వీటిని వీసా ప్రాసెసింగ్‌ కోసం ఢిల్లీలోని బ్రిటీష్‌ ఎంబసీకి పంపుతున్నామని, సదరు కార్యాలయం నుంచి గ్రహమ్‌ మెర్టిన్‌ సంప్రదిస్తారన్నారు.

ప్రాసెసింగ్‌ ఫీజుగా రూ.29,900 కాజేసి దీనికి బోగస్‌ రసీదులూ పంపారు.  ఆపై గ్రహమ్‌ పేరుతో సంప్రదించిన వ్యక్తి ఐఈఎల్‌టీఎస్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే వీసా వస్తుందని, అది తామే ఏర్పా టు చేస్తామని మరో రూ.60 వేలు కాజేశారు. ఆపై రూ. 89,707 బీటీఏగా (బేసిక్‌ ట్రావెల్‌ అలవెన్స్‌స్‌) చెల్లించాలంటూ ఒత్తిడి చేశారు. ఈ డబ్బు చెల్లిస్తేనే ఢిల్లీలోని యూకే ఎంబీసీలోకి వెళ్లేందుకు గేట్‌పాస్‌ లభిస్తుందంటూ భయపెట్టారు. దీంతో బాధితురాలు బజాజ్‌ ఫైన్సాన్‌ నుంచి అప్పు తీసుకొని మరీ డబ్బు చెల్లించింది. సైబర్‌ నేరగాళ్లు మళ్లీ డబ్బు డిమాండ్‌ చేస్తుండటంతో అనుమానించింది. ఢిల్లీలోని లండన్‌ ఎంబీసీకి ఫోన్‌ చేసి సంప్రదించగా మోసంగా తేలింది. సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement