సాక్షి, అల్లిపురం (విశాఖ దక్షిణ): లాటరీ పేరిట పలు విడతల్లో రూ.70లక్షలు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సైబర్ క్రైం సీఐ వి.గోపీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం... నగరానికి చెందిన బి.రామకృష్ణ అనే వ్యక్తి ఈ – మెయిల్‌కు 2015వ సంవత్సరంలో ఒక మెయిల్ వచ్చింది. అందులో వరల్డ్ లాటరీ ఆర్గనైజేషన్ నుంచి 250 గ్రేట్ బ్రిటిష్ పౌండ్స్ గెలుచుకున్నారన్నది సారాంశం. దీంతో రామకృష్ణ తిరిగి వారు అడిగిన సమాచారం అందించాడు. తరువాత ఫాస్టర్ న్యూ మాన్ అనే వ్యక్తి +448726148738 నంబరు నుంచి ఫోన్ చేశాడు. తాను హెచ్‌ఎస్‌బీసీ యూకే బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాను.., మీ ప్రైజ్ మనీ తమ యూకే బ్యాంకులో జమైంది, దానిని క్లెయిమ్ చేసుకోవాలంటే హెచ్‌ఎస్‌బీసీలో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని సూచించాడు. అందుకోసం కొంత సొమ్ము కట్టాలని, తరువాత తాము పంపే హెచ్‌ఎస్‌బీసీ ఏటీఎం కార్డు ద్వారా ఎక్కడి నుంచైనా ప్రైజ్ మనీ డ్రా చేసుకోవచ్చని చెప్పాడు. దీంతో బాధితుడు రూ.34,500 డిపాజిట్ చేశాడు. తరువాత వారు చెప్పిన విధంగా హెచ్‌ఎస్‌బీసీ యూకే ఏటీఎం కార్డు రావడంతో దాని యాక్టివేషన్ కోసం వరల్డ్ బ్యాంకుకు కొంత సొమ్ము కట్టాలని, యాంటీ టెర్రరిస్ట్, ఇన్సూరెన్స్ కోసం మరికొంత సొమ్ము కట్టాలని చెప్పడంతో డిపాజిట్ చేశాడు.
తరువాత గెలుచుకున్న ప్రైజ్ మనీని తమ రిప్రజెంటేటివ్ కెల్విన్ ఫిలిప్స్ మీ ఇంటికి తెచ్చి ఇస్తారని చెప్పడంతో... కెల్విన్ ఫిలిప్స్‌ను విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో రామకృష్ణ రిసీవ్ చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన తరువాత ఫిలిప్స్ తెచ్చిన డిజిటల్ లాకర్ బాక్స్‌ను తెరిచి బ్లాక్ కోటెడ్ కరెన్సీని ఒక లిక్విడ్‌లో ముంచి కొన్ని చేంజ్ అయిన యూకే పౌండ్స్‌ను చూపించి నిజమేనని నమ్మించాడు. తరువాత తాను తెచ్చిన లిక్విడ్ అయిపోయిందని, అది తరువాత కొరియర్‌లో పంపుతానని చెప్పటంతో అది నిజమేనని నమ్మిన బాధితుడు వారి సూచించిన అకౌంట్‌లలో విడతల వారీగా రూ.70 లక్షలు డిపాజిట్ చేశాడు. అయితే ఎంతకీ లిక్విడ్ కొరియర్ రాకపోవటంతో జరిగిందంతా మోసం అని తెలుసుకొని గురువారం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. డబ్బులు ఊరికే రావని, మోసగాళ్ల చేతుల్లో మోసపోవద్దని, లాటరీల పేరిట వచ్చే మెసేజ్‌లు, లెటర్లు, ఈ మెయిల్స్ నమ్మవద్దని, వాటికి స్పందించవద్దని సీఐ గోపీనాథ్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment