
ఖాతాదారుడి సెల్‌కు వచ్చిన మెసేజ్‌లు
ఒంగోలు: ఆశపడి కొనుక్కున్న ఆండ్రాయిడ్ ఫోన్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా నిండా మునిగినట్లే. ఏటీఎం కార్డుల వినియోగంలో జరుగుతున్న పలు లోపాలను పోలీసు శాఖ ప్రధానంగా ప్రస్తావిస్తూ అవగాహన కలిగిస్తుండటంతో సైబర్ నేరస్తులు కొత్త రకం దందాకు శ్రీకారం చుట్టారు. ఇటీవల నగరంలోని ఓ వ్యక్తి తన మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌లను గమనించి ఆశ్చర్యపోయి బ్యాంకర్‌ను కలిస్తే అది సైబర్ క్రైం నేరస్తుల పని..అంటూ సూచించారు.
ఏం..జరిగిందంటే
ఈ నెల 20వ తేదీన ఎస్‌బీఐ ఖాతాదారుడు ఒకరి మొబైల్‌కు వరుసగా మెసేజ్‌లు వచ్చాయి. రూ.12990 ఫ్లిప్ కార్టులో వస్తువులు కొనుగోలు చేసినట్లు ఆ మెసేజ్‌లో సారాంశం ఉంది. ఆ అకౌంట్‌కు బ్యాంక్ అకౌంట్ లింకై ఉండటంతో ఒన్‌టైం పాస్‌వర్డు జెనరేటై ఖాతాదారుని మొబైల్‌కు సమాచారం వచ్చింది. తాను ఎటువంటి వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయకున్నా తనకు ఎందుకు సమాచారం వస్తుందంటూ కార్డు చివరి నాలుగు అంకెలను పోల్చి చూసుకుంటే అది తన ఏటీఎం కార్డు నంబర్‌గానే స్పష్టమైంది. బ్యాంకు అధికారుల వద్దకు వెళ్లి మెసేజ్‌లను చూపడంతో వారు పరిశీలించి మీ ఏటీఎం కార్డు వివరాలు తెలుసుకున్న వారు ఎవరో మీ అకౌంట్‌ను హ్యాక్ చేసి ఆన్‌లైన్ లావాదేవీలకు యత్నించారని, ఇది తప్పకుండా సైబర్ క్రైం అని పేర్కొన్నారు. అందువల్ల తాము ఏమీ చేయలేమని, పోలీసులకు ఫిర్యాదు చేయమంటూ సలహాలు ఇచ్చారు. ఖాతాదారుడు మాత్రం తన ఏటీఎం కార్డు వివరాలు తెలుసుకొని దాని ద్వారా ఆన్‌లైన్ వస్తువులు కొనుగోలు చేసేందుకు యత్నించారని, అయితే పాస్‌వర్డు ఊహించి టైప్ చేయడంతో వారి యత్నం వృథా అయిందని పేర్కొన్నారు. తాను ఏర్పాటు చేసుకున్న పాస్‌వర్డు క్లిష్టంగా ఉండటంతో వారి యత్నం వృథా అయినట్లు భావిస్తున్నానని పేర్కొన్నారు.
జాగ్రత్త పడాలంటున్న బ్యాంకర్లు
♦ పెట్రోలు బంకులు, మాల్స్, పెద్ద పెద్ద షోరూంల్లో ఏటీఎం కార్డులను ప్రజలు ఎక్కువుగా వినియోగిస్తుంటారు. తాము కొన్న వస్తువులకు ఏటీఎం కార్డు ద్వారా నగదు చెల్లిస్తుంటారు. అయితే ఈ నగదు చెల్లించే సందర్భంలో ఏటీఎం పిన్ నంబర్ నొక్కుతాం. సమయంలో 14 అంకెల ఏటీఎం కార్డు నంబర్, వెనుక సీవీసీ నంబర్‌ను ఇతరులు ఫొటోలు తీసుకోవడం లేదా నోట్ చేసుకుంటున్నారేమో అనే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
♦ బార్లు, వైన్ షాపులు, రెస్టారెంట్లు వంటి వాటిలో బిల్ పే చేసేందుకు సహజంగా వెయిటర్ల మీద డిపెండ్ అవుతుంటారు. ఏటీఎం కార్డు ఇచ్చేసి పిన్ నంబర్ చెబుతారు. ఇది సరైన విధానం కాదని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. వాస్తవంగా ఏటీఎం కార్డును ఎక్కడ ఉపయోగించినా తమ సమక్షంలో వినియోగించుకోవడం మంచిదని పేర్కొంటున్నారు.
♦ అదే విధంగా ఇటీవల ఆండ్రాయిడ్ మొబైల్స్ మినీ బ్యాంకుల్లా మారాయి. చాలామంది ఇప్పటికి తమ ఏటీఎం కార్డులకు వెనుక వైపున పాస్‌వర్డు నోట్ చేసుకుంటున్నారు. ఏటీఎం కార్డు 14 అంకెల నంబర్‌తో పాటు సీవీసీ నంబర్ తెలుసుకున్న వారికి మీ మొబైల్ గనుక దొరికితే ఇక క్షణాల్లో మీకు ఏమాత్రం తెలీకుండానే మీ అకౌంట్‌లో ఉన్న డబ్బును మాయం చేయవచ్చు. అయితే చాలామంది తప్పుడు చిరునామాలతో ఇటువంటి కొనుగోళ్లు చేయడం చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతున్నాయి. అందువల్ల ఏటీఎం కార్డులైనా, ఆండ్రాయిడ్ మొబైల్స్ అయినా వాటి వినియోగంలో రహస్య సమాచారాన్ని ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం సుస్పష్టం.
Comments
Please login to add a commentAdd a comment