కాల్‌ చేస్తే.. ఖాతా ఖాళీనే!  | Cyber Criminals Place Fake Call Centre Of Banks | Sakshi
Sakshi News home page

కాల్‌ చేస్తే.. ఖాతా ఖాళీనే! 

Published Mon, Feb 25 2019 4:12 AM | Last Updated on Mon, Feb 25 2019 7:56 AM

Cyber Criminals Place Fake Call Centre Of Banks - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడు డబ్బు డ్రా చేసుకోవడానికి బషీర్‌బాగ్‌ సమీపంలోని ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఏటీఎం కేంద్రానికి వెళ్లారు. అక్కడ చేయాల్సిన తతంగం మొత్తం పూర్తయ్యాక ఆయన ఖాతా నుంచి డబ్బు కట్‌ అయినట్లు డిస్‌ప్లే, మెసేజ్‌ వచ్చాయి. అయితే ఏటీఎం నుంచి డబ్బు బయటకు రాకపోవడంతో ఆందోళనకులోనై సదరు బ్యాంక్‌ కాల్‌ సెంటర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేశారు. అక్కడ టాప్‌లో కనిపించిన 76+++++219 నంబర్‌కు కాల్‌ చేశారు. అవతలి వ్యక్తి చెప్పినట్లు చేసి తన ఖాతా నుంచి మరో రూ.80 వేలు పోగొట్టుకున్నారు. చివరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు మొదలైంది.
 
ప్రజలకు టోకరా వేయడానికి సమయం, సందర్భాన్ని బట్టి ఒక్కో పంథాను అనుసరించే సైబర్‌ నేరగాళ్లు ఇటీవల కాలంలో ఇలా టోకరా వేస్తున్నారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు. ఆ అంతర్రాష్ట్ర నేరగాళ్లు ఏకంగా గూగుల్‌లోకే చొచ్చుకుపోయి బురిడీ కొట్టించే ఈ క్రైమ్‌ ఎలా సాగుతుందో ‘సాక్షి’కి వివరించారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఫిర్యాదులు పెరిగాయని, అంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు.
 
అన్నింటికీ మూలం సిమ్‌కార్డులే.. 
ఎలాంటి మోసాలు చేయాలన్నా సైబర్‌ నేరగాళ్లకు ప్రాథమికంగా సిమ్‌కార్డులు అవసరం. వీటిని నకిలీ పేర్లు, చిరునామాలతో తీసుకుంటున్నారు. బోగస్‌ వివరాలతో కొన్ని యాప్స్, బ్యాంకు ఖాతాలు సైతం సిద్ధం చేసుకుంటున్నారు. కొందరైతే బ్యాంకు ఖాతాలకు బదులుగా మనీమ్యూల్స్‌గా పిలిచే దళారుల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. మెట్రో నగరాలతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతకు కమీషన్‌ ఆశ చూపి సైబర్‌ నేరగాళ్లు వారిని తమ వైపు తిప్పుకుంటున్నారు. వీరికి చెందిన మనీ ట్రాన్స్‌ఫర్‌ యాప్స్, బ్యాంక్‌ ఖాతాలను తమకు అనుకూలంగా వాడుకుంటూ 5 శాతం చొప్పున కమీషన్‌ ఇస్తున్నారు. సిమ్‌కార్డులు, బేసిక్‌ మోడల్‌ సెల్‌ఫోన్లతోపాటు బ్యాంకు ఖాతాలు, యాప్స్‌ సిద్ధమయ్యాక ఈ సైబర్‌ నేరగాళ్లు దందా మొదలుపెడుతున్నారు.  

గూగుల్‌లో రిజిస్టర్‌ చేసుకుని... 
ఈ సైబర్‌ నేరగాళ్లు ఎక్కడా తమ ఉనికి బయటపకుండా ఉండేలా కొన్ని మెయిల్‌ ఐడీలు సృష్టిస్తున్నారు. వీటిని వినియోగించి గూగుల్‌లోకి ఎంటర్‌ అవుతున్న కేటుగాళ్లు అందులో రిజిస్టర్‌ చేసుకోవడం ద్వారా తమ నంబర్లను ఆయా బ్యాంకులకు చెందిన కాల్‌ సెంటర్లవిగా పేర్కొంటూ పొందుపరుస్తున్నారు. ట్రూ కాలర్‌లో సైతం వీటిని ‘బ్యాంక్‌’, ‘బ్యాంక్‌ మేనేజర్‌’పేర్లతోనే రిజిస్టర్‌ చేసుకున్నారు. అయితే గూగుల్‌ సెర్చ్‌లో పొందుపరిచిన వాటిలో వేటికి వ్యూస్‌ ఎక్కువగా ఉంటే అది పైభాగానికి వస్తుంది. దీంతో సదరు సైబర్‌ నేరగాళ్లు తమ అనుచరుల ద్వారా ఆయా నంబర్లకు వ్యూస్‌ పెరిగేలా చేసి సెర్చ్‌లో పైకి తీసుకువస్తున్నారు. ఇలా వచ్చిన తర్వాత ఎవరైనా ఖాతాదారుడు తన బ్యాంక్‌ కాల్‌ సెంటర్‌ కోసం సెర్చ్‌ చేస్తే ఈ నేరగాళ్లు పొందుపరిచిన తప్పుడు కాల్‌ సెంటర్ల నంబర్లే పైభాగంలో కనిపిస్తుంటాయి. ఇలా కనిపించిన కాల్‌ సెంటర్‌ నంబర్‌కు ఖాతాదారుడు కాల్‌ చేసిన వెంటనే అది సదరు సైబర్‌ నేరగాడికి వెళ్తుంది. తాను బ్యాంక్‌ మేనేజర్‌ని అంటూ మాట్లాడే అతగాడు డబ్బు తిరిగి రావాలంటే తాము మరో నంబర్‌ నుంచి ఓ ఎస్సెమ్మెస్‌ పంపుతామని, దాన్ని మళ్లీ అదే నంబర్‌కు పంపించాలని సూచిస్తుంటారు. 

ఎంపిన్‌తో ఎర.. 
ఎవరైనా సరే తమ బ్యాంకు ఖాతాలను మనీ ట్రాన్స్‌ఫర్‌ యాప్స్‌కు అనుసంధానం చేయాలంటే యూపీఐగా పిలిచే యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ కచ్చితంగా ఉండాలి. ఇది కావాలంటే బ్యాంకు ఖాతాతో రిజిస్టర్‌ అయిన సెల్‌ఫోన్‌ నుంచి యూపీఏకు సంబంధించిన ఎంపిన్‌ను బ్యాంక్‌ నంబర్‌కు పంపాల్సి ఉంటుంది. దీన్నే ఈ సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. 

అత్యధికం హిందీలోనే.. 
ఇలాంటి సైబర్‌ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఫోన్‌ చేసిన వారితో బ్యాంకు అధికారి, మేనేజర్‌ అంటూ పరిచయం చేసుకునే వీరిలో అత్యధికులు హిందీలోనే మాట్లాడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపిన్‌ను ఎవరి సెల్‌ నంబర్‌కు పంపకూడదు. మెసేజ్‌ వచ్చినా ఏటీఎం నుంచి డబ్బు రాకుంటే సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించాలి. గూగుల్‌లో చూసి అవి బ్యాంకుల కాల్‌ సెంటర్లు అని నమ్మితే నిండా మునిగినట్లే. అనేక సందర్భాల్లో ఏటీఎం మిషన్‌ నుంచి బయటకు రాని డబ్బులు రెండు మూడు పని దినాల్లో తిరిగి ఖాతాలోకి జమవుతూ ఉంటాయి. అపరిచితులు, ఫోన్‌ ద్వారా పరిచయమైన వారితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకపోవడం ఉత్తమం. సాధారణంగా గూగుల్‌లో కనిపించే వివరాలన్నీ ఎవరో ఒకరు పోస్ట్‌ చేసిన, అప్‌లోడ్‌ చేసినవే అయి ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందులో కనిపించిన ప్రతి అంశాన్నీ గుడ్డిగా నమ్మకూడదు. – సైబర్‌ క్రైమ్‌ పోలీసులు  

యాప్స్‌ను అనుసంధానిస్తూ.. 
తమ వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్లలోకి అప్పటికే కొన్ని యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసి ఉంచుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు ఇలా కాల్‌ వచ్చినప్పుడు ఎంపిన్‌ క్రియేట్‌ చేస్తున్నారు. దీన్ని తొలుత తమకు కాల్‌ చేసిన ఖాతాదారుడికి వేరే నంబర్‌ నుంచి పంపిస్తున్నారు. అలా వచ్చిన ఎంపిన్‌ను బ్యాంక్‌ నంబర్‌కు సెండ్‌ చేయాలని సూచిస్తున్నారు. ఖాతాదారుడు ఇలా చేస్తే తన బ్యాంకు ఖాతాను వారి యాప్‌తో అనుసంధానించడానికి యాక్సస్‌ ఇచ్చినట్లే అవుతుంది. ఆ వెంటనే సదరు నంబర్‌ను వినియోగించి యాప్‌ను యాక్టివేట్‌ చేయడంతోపాటు ఖాతాదారుడి ఖాతా నుంచి నగదు కాజేస్తున్నారు. ఈ విధానంలో రోజుకు రూ.లక్ష వరకు బదిలీ చేసుకునే అవకాశం ఉండటంతో సైబర్‌ నేరగాళ్లు తమ యాప్స్‌కు లేదా మనీమ్యూల్స్‌ ఖాతాలోకి డబ్బు బదిలీ చేసి స్వాహా చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement