సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం చోటు చేసుకుంది. కాళి మాత వేషం వేసుకున్న ఓ వ్యక్తిని అతికిరాతకంగా చంపేశారు. గత వారం ఈ ఘటన చోటు చేసుకోగా, దర్యాప్తు అనంతరం సోమవారం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... మే 23న ఉదయం ఎన్‌ఎస్‌ఐసీ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఛాతీ, తల, ముఖంపై కత్తి పోట్లతో గుర్తు పట్టలేని స్థితిలో ఆ దేహం ఉంది. దొరికిన ఆధారాలతో చివరకు ధర్మశాలకు చెందిన కలూ అనే వ్యక్తి మృతదేహంగా పోలీసులు నిర్ధారించారు. అయితే అనాథ అయిన అతన్ని అంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అన్నది పోలీసులకు సవాల్‌గా మారింది.
పిల్లలు ఇచ్చిన సమాచారంతో... కల్కజీ మందిర్ సమీపంలోని ధర్మశాలలో కలూ పెరిగాడు. ఒంటరి అయిన కలూ తరచూ హిజ్రాలతో కలిసి కాళి మాతను పూజించేవాడు. ఈ క్రమంలో అతను తనను తాను దేవతగా భావించుకునేవాడని వారు చెప్పారు. గత మంగళవారం పూజ పూర్తయ్యాక కాళి మాత వేషాధారణతో ఆశ్రమం విడిచివెళ్లాడని, ఆ తర్వాత తిరిగి రాలేదని వారు చెప్పారు. ఆపై చుట్టుపక్కల వారిని ప్రశ్నించే క్రమంలో అక్కడే ఆడుకుంటున్న కొందరు పిల్లలు పోలీసులతో ఆరోజు జరిగింది వివరించారు. కాళిమాత వేషం వేసుకున్న కలూను కొందరు వ్యక్తులు అడ్డగించి వేధించారని, చిన్నపాటి గొడవ కూడా జరిగిందని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ సమయంలో ఆ ప్రాంతంలో సంచరించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
కిరాతకంగా చంపారు... కాళిమాత వేషాధారణలో ఉన్న కలూను నిందితుల కంటపడ్డాడు. మద్యం మత్తులో ఉన్న వాళ్లంతా కలూ చున్నీ లాగుతూ వేధించారు. కోపంతో కలూ.. తాను దైవాంశాన్ని అని, ఎగతాళి చేస్తే చచ్చిపోతారని వాళ్లతో చెప్పాడు. దీంతో వాళ్లకు చిర్రెత్తుకొచ్చింది. బలవంతంగా కలూను అటవీలోకి లాక్కెల్లారు. ఆపై పిడిగుద్దులతో దాడి చేసి అనంతరం, రాళ్లు, తమ వెంట ఉన్న కత్తులతో అతన్ని చిత్రవధ చేసి మరీ చంపారు. మిగతా నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నిందితులంతా పాతికేళ్లలోపు వాళ్లే కాగా.. వారిలో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment