
పంజగుట్ట: అనుమతి లేని లేఔట్లను చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో డబ్బు వసూలు చేసి మోసం చేసిన కేసులో ‘దమరి ఎస్టేట్స్’ యజమానికి చెరువుపల్లి సుమన్‌బాబును పంజగుట్ట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా, రాయదుర్గం గ్రామానికి చెందిన అనిత ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ఇతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సతీష్‌కుమార్ తెలిపారు. గతంలో ఇతడి వ్యవహారాలపై ఆరా తీయడానికి ప్రయత్నించిన పోలీసులనే బెదిరించిన ఉదంతాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన సుమన్ బీఏ పూర్తిచేసిన తర్వాత హైదరాబాద్‌కు వలసవచ్చి కళ్యాణినగర్‌లో స్థిరపడ్డాడు. తొలుత ‘సిరి మీడియా’ పేరుతో ఓ యాడ్ ఏజెన్సీ నిర్వహించిన ఇతను ఆపై రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ద్వారకపురి కాలనీలో ‘దమరి ఎస్టేట్స్’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి ఆపై దీనిని అమీర్‌పేటకు మార్చాడు.
భూ యజమానులకు డబ్బు చెల్లించకుండా, అవసరమైన అనుమతులు లేకుండా దందా నిర్వహించేవాడు. తొలుత ఆయా వెంచర్స్ పేరుతో ఆకర్షణీయమైన కరపత్రాలు రూపొందించడమేగాక, మీడియాలో ప్రకటనలు గుప్పించి పలువురిని ఆకర్షిస్తాడు. షాదనగర్ సమీపంలోని ఫారూఖ్ నగర్‌లో విల్లాలు నిర్మించి ఇస్తామని, తక్కువ ధరకు ప్లాట్లు అంటూ పలువురిని ఆకర్షించాడు. వారి మాటలు నమ్మి అనిత రెండు విల్లాలు బుక్ చేసుకుంది. ఒక్కో విల్లాకు రూ.29 లక్షల చొప్పున ఒప్పందం చేసుకుని, అడ్వాన్స్‌గా రూ.14 లక్షలు బ్యాంకు అకౌంట్ ద్వారా సుమన్‌కు బదిలీ చేశారు. 10 రోజుల్లోనే విల్లా రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పిన ఇతను అలా చేయకపోవడంతో అనుమానం వచ్చిన అనిత నిలదీసింది. దీంతో కొన్నాళ్లుగా ఆమెకు మాయమాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు ద్వారకా పురిలోని దమరి కార్యాలయానికి వెళ్లగా... అమీర్‌పేటలోని సిరి ఎస్టేట్స్ మార్చినట్లు తెలిసింది. సుమన్ బాబు ఇదే తరహాలో అనేక మందిని మోసం చేసినట్లు గుర్తించిన ఆమె పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సుమన్ బాబు గ్రీన్‌ల్యాండ్స్–2, శివపార్వతి డైమండ్ స్పేస్ పేరుతో వెంచర్స్ అంటూ ప్రచారం చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించారు. దీంతో శుక్రవారం సుమన్ బాబును అరెస్టు చేశారు. అతడి చేతిలో లేదా ఈ సంస్థ ద్వారా మోసపోయిన వారు తమను ఆశ్రయించాలని పంజగుట్ట ఇన్‌స్పెక్టర్ నిరంజన్‌రెడ్డి కోరారు. బాధితుల సంఖ్య భారీగానే ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment