గన్నవరంలో కుమ్ములాటలు | Disagreement Fight In TDP Party | Sakshi
Sakshi News home page

గన్నవరంలో కుమ్ములాటలు

Published Tue, Mar 20 2018 12:58 PM | Last Updated on Tue, Oct 2 2018 7:28 PM

Disagreement Fight In TDP Party - Sakshi

ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ,ఎస్సీ, ఎస్టీ మోనిటరింగ్‌ కమిటీ సభ్యుడు స్టాలిన్‌బాబు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: టీడీపీలో కుమ్ములాటలు ఎక్కువయ్యా యి.  నేతల మధ్య విభేదాలు పొడచూపుతున్నాయి. నియోజకవర్గాల వారీగా నువ్వానేనా అన్నట్టుగా కత్తులు దూసుకుంటున్నారు. కాకినాడ...రాజమహేంద్రవరం...అనపర్తి.....అమలాపురం....రాజోలు....తదితర నియోజకవర్గాల్లో  కొనసాగుతున్న నేతల పోరు ఇప్పటికే రచ్చకెక్కింది. తాజాగా ఆ జాబితాలోకి పి.గన్నవరం చేరింది. ఇక్కడ టికెట్‌ విషయంలో అంతర్గత పోరు నడుస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తికి అసమ్మతి సెగ తాకింది. ఆయనకు ఎసరు పెట్టే నాయకులు నియోజకవర్గంలో తయారయ్యారు. అంతటితో ఆగలేదు సరికదా ఈసారి పులపర్తికి టికెట్‌ రాదని తెరపైకి వచ్చి విస్తృత ప్రచారం కూడా చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే పులపర్తికి చిర్రెత్తికొచ్చింది. తనకు వ్యతిరేకంగా ప్రచారానికి ఒడిగొడుతున్న నాయకులపై అంతెత్తున లేస్తున్నారు. తన అనుయాయుల చేత ఎదురుదాడికి దిగుతున్నారు. ఇదెక్కిడికి దారితీస్తుందో తెలియదు గాని పి.గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నివురు గుప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు భగ్గుమంటుందో చెప్పలేని పరిస్థితి నెలకుంది. 

టికెట్‌ కోసం రగడ
ఎన్నికలకు మరో ఏడాది ఉన్నప్పటికీ టికెట్‌ తమదేనంటూ పి.గన్నవరంలో ఆసక్తికరమైన పోరు నడుస్తోంది. దీంతో పార్టీలో వర్గ విభేదాలు నివురుగప్పిన నిప్పులా మారాయి. ప్రస్తుత ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తికి పోటీగా ఎస్సీ, ఎస్టీ జిల్లా మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు నేలపూడి స్టాలిన్‌బాబు రేసులోకి రావడంతో అంతర్గత పోరుకు తెరలేచింది. ఎమ్మెల్యే పులపర్తికి ఈ దఫా ఎన్నికల్లో టికెట్‌ రావడం కష్టమని, అతనికి ప్రత్యామ్నాయంగా వేరే వ్యక్తికి టికెట్‌ ఇస్తారని అసమ్మతి స్వరం ఊపందుకుంది. అందుకు తగ్గట్టుగా పులపర్తి వ్యతిరేక వర్గీయులు ప్రచారంలో స్పీడు కూడా పెంచారు. తన వర్గాన్ని పటిష్టం చేసుకోవడమే కాకుండా పులపర్తిని లక్ష్యంగా అసమ్మతి రాజకీయాలు నడుపుతున్నారు. అంతేకాకుండా తన రాజకీయ వ్యూహంలో భాగంగా ఎమ్మెల్యేకు ధీటుగా  స్టాలిన్‌బాబు తన పుట్టిన రోజు వేడుకలు ఈసారి ఘనంగా నిర్వహించేందుకు యత్నించారు. తనదైన ముద్ర వేసుకోవడానికి వ్యూహ రచన చేశారు. దీంతో పరిస్థితులు ఎమ్మెల్యే పులపర్తికి తలనొప్పిగా పరిణమించాయి.

స్టాలిన్‌ ఎత్తులకు ఎమ్మెల్యే పైఎత్తులు...
నియోజకవర్గ పరిధిలో స్టాలిన్‌బాబు సమావేశాలు పెట్టి కార్యక్రమాలు నిర్వహించడం ఎమ్మెల్యేకు రుచించడలేదు. వ్యూహాత్మకంగా స్టాలిన్‌ నిర్వహించిన పుట్టిన రోజు వేడుకలలకు పార్టీ శ్రేణులు వెళ్లకుండా ఎమ్మెల్యే పులపర్తి ఎత్తుకు పైఎత్తులు వేశారు. స్టాలిన్‌ కార్యక్రమానికి  వెళ్లడానికి వీలు లేదంటూ ఎమ్మెల్యే నారాయణమూర్తి, అతని కుమారుడు, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు పులపర్తి రవిబాబు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో కొంతమేరకు విజయం సాధించారు. అంతేకాకుండా తనకు టికెట్‌ రాదని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారంపై కూడా తనదైన శైలిలో రాజకీయాలు నెరుపుతున్నారు. అందులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో పార్టీ మండల కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి,  వ్యతిరేక ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టే విధంగా ఎమ్మెల్యే నారాయణమూర్తి తీర్మానాలు చేయించినట్టు తెలిసింది. వేరే వ్యక్తికి ఎవరికీ టికెట్‌ కేటాయించే అవకాశం లేదని, అలా జరుగుతున్న ప్రచారం అవాస్తవమని సమావేశాల్లో తీర్మానాలు చేయించినట్టు సమాచారం.

అగ్గి రాజేసిన ఫ్లెక్సీల తొలగింపు...
పులపర్తి, స్టాలిన్‌బాబు మధ్య చోటుచేసుకున్న విభేదాలకు ఫ్లెక్సీల తొలగింపు మరింత ఆజ్యం పోసినట్టయింది. స్టాలిన్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించి వేసి, వాటిని రాత్రికి రాత్రే తొలగించారు. పక్కా ప్లాన్‌ ప్రకారమే ఈ వ్యవహారం జరిగిందని, స్టాలిన్‌బాబు అంటే గిట్టని వారే ఈ పని చేయిస్తున్నారంటూ అతని వర్గీయులు ఆరోపిస్తున్నారు. పరోక్షంగా ఎమ్మెల్యే పులపర్తిని లక్ష్యం చేస్తూ మాటల దాడి చేస్తున్నారు. ప్రత్యర్థులు కౌంటర్‌ ఎటాక్‌ చేస్తున్నా ఫ్లెక్సీల తొలగింపు వెనక వారే ఉన్నారని స్టాలిన్‌ వర్గీయులు బల్లగుద్ది చెబుతున్నారు. ఈ విధంగా ప్రతి విషయంలో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఎమ్మెల్యే ఆధిపత్యానికి చెక్‌ పెట్టేలా స్టాలిన్‌ పావులు కదపగా, ఆదిలోనే తుంచేయాలని స్టాలిన్‌పై ఎమ్మెల్యే వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ విధంగా ఒక దాని తరువాత మరొకటిగా జరుగుతున్న పరిణామాలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి..  ఇద్దరు నాయకుల మధ్య కొనసాగుతున్న వర్గ విభేదాలు పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలకు దారితీశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement