బాధిత యువతి శిరీష, తల్లి సూరీడమ్మను విచారిస్తున్న ఎస్సై అమ్మినాయుడు, పోలీసు సిబ్బంది
శృంగవరపుకోట రూరల్: మండలంలోని శివరామరాజుపేటలో ఎస్సీ యువతిపై ఆటో డ్రైవర్ బుధవారం హత్యాయత్నం చేశాడు. సంచలనం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించి ఎస్.కోట ఎస్సై ఎస్.అమ్మినాయుడు, బాధిత యువతి జుంజూరు శిరీష (19) తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. జుంజూరు శిరీష స్వగ్రామం వేపాడ మండలంలోని ఆకుల సీతంపేట. ఈమె ప్రస్తుతం ఎస్.కోట పట్టణంలోని పుణ్యగిరి ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం బీకాం చదువుతోంది. ఈమె తండ్రి శ్రీను చనిపోవటంతో తల్లితో కలిసి గంట్యాడ మండలంలోని మధుపాడ గ్రామంలో గల అమ్మమ్మ గారింట్లో ఉంటూ ఎస్.కోటలో చదువుకుంటోంది. అయితే వేపాడ మండలం ఆకుల సీతంపేట గ్రామానికి చెందిన సుంకరి బంగారు బుల్లయ్య (ఆటో డ్రైవర్) సంవత్సర కాలంగా ప్రేమ పేరుతూ వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాధిత యువతి, ఆమె తల్లి సూరీడమ్మ బుల్లయ్య తీరును ఆకులసీతంపేట పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో వారు మందలించారు.
దీంతో బుల్లయ్య రెండు నెలలుగా వేధింపులు ఆపేశాడు. మంగళవారం సాయంత్రం బాధిత యువతి తల్లి సూరీడమ్మతో కలిసి ఎస్.కోటలో బ్యాంకు పని ముగించుకుని శివరామరాజుపేటలో ఉన్న మేనమామ తెరపల్లి గౌరినాయుడు ఇంటికి వెళ్లారు. అక్కడ బాధితురాలు శిరీష ఉండిపోగా ఆమె తల్లి సూరీడమ్మ మధుపాడలోని కన్నవారింటికి ఇంటికి వెళ్లిపోయింది. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో మేనమామ ఇంట్లో శిరీష టీవీ చూస్తుండగా... నిందితుడు బుల్లయ్య ఒక్కసారిగా ఇంటిలోకి చొరపడడంతో యువతి బయటకు పరుగు తీసేందుకు ప్రయత్నించింది. అయితే బుల్లయ్య వెంటనే ఆమె మెడ పట్టుకుని మంచంపై తోసి నన్ను పెళ్లి చేసుకుంటావా.. లేదా అని గద్దించడంతో శిరీష చేసుకోనని స్పష్టం చేసింది. వెంటనే నిందితుడి ఆమె చున్నీతో శిరీషను హత్య చేసుందుకు ప్రయత్నించాడు. నోరు, ముక్కు నుంచి రక్తం రావడంతో శిరీష చనిపోయిందని భావించి నిందితుడు పరారయ్యడు. ఇంతలో ఇంటికొచ్చిన గౌరినాయుడు రక్తంతో ఉన్న శిరీషను చూసి వెంటనే ఎస్.కోట ఆస్పత్రికి తరలించాడు. ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై అమ్మినాయుడు ఆస్పత్రికి వెళ్లి బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బుల్లయ్యను పట్టుకోవడానికి పోలీస్ బృందాలు వెళ్లాయని.. విజయనగరం డీఎస్పీ కేసు దర్యాప్తు చేస్తారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment