సాక్షి, హైదరాబాద్: మద్యానికి బానిసైన ఓ తండ్రి కన్న కూతుర్ని రూ.3 లక్షలకు అమ్మేశాడు. ఆమెను కొని.. పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు నగరంలో మకాం పెట్టాడు. మరోపక్క బాలిక మిస్సింగ్‌పై రాజస్తాన్ హైకోర్టులో హెబియస్ కార్పస్ దాఖలైంది. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం నగరానికి వచ్చి.. బాలికను గుర్తించడానికి యాచకుల వేషంలో రెండ్రోజుల పాటు మాటు వేసింది. చివరికి చిన్నారి ఆచూకీ కనుగొని రాజస్తాన్‌కు తరలించింది. బాలిక ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణిగా గుర్తించారు.
మేనమామ వద్ద దించి వస్తానని..
రాజస్తాన్‌లోని బర్మేర్ జిల్లా సివాన ప్రాంతానికి చెందిన రాజురామ్ మద్యం మత్తులో గత జూన్ 22న తన కుమార్తె (13)ను తీసుకుని ఇంట్లోంచి బయల్దేరాడు. ఆమెను మేనమాన రామ్‌లాల్ వద్ద దించి వస్తానని ఇంట్లో చెప్పాడు. మద్యానికి అవసరమైన డబ్బు కోసం కుమార్తెను అమ్మేయాలని ముందే పథకం వేసిన ఇతగాడు సివాన ప్రాంతానికే చెందిన గోపారామ్ మాలీ సాయం తీసుకున్నాడు. వీరిద్దరూ సన్వాలా రామ్ దాస్‌పా అనే వ్యక్తితో కలిసి చిన్నారిని బర్మేర్ ప్రాంతానికి చెందిన భరత్‌కుమార్ (32)కు రూ.3 లక్షలకు అమ్మేశారు. తన సోదరుడైన మోహన్‌లాల్ సహకారంతో భరత్ ఆ చిన్నారిని పెళ్లి చేసుకున్నాడు. ఆర్థికంగా స్థితిమంతుడైన భరత్.. బాలికతో కలిసి హైదరాబాద్ నగర శివార్లలోని ఆదిభట్ల పోలీసుస్టేషన్ పరిధి తుర్కయాంజాల్‌లో ఉన్న పరిచయస్తుడి వద్ద ఆశ్రయం పొందాడు.
నిలదీసి అడిగితే.. నిజం చెప్పాడు
జూన్ 26న బాలిక మేనమామ రామ్‌లాల్ సివానలోని సోదరి వద్దకు వచ్చాడు. చిన్నారి గురించి వాకబు చేయగా, తనకేం తెలియదని చెప్పాడు. దీంతో అనుమానించిన కుటుంబసభ్యులు రాజురామ్‌ను నిలదీశారు. కుమార్తెను రూ.3 లక్షలకు బర్మేర్‌కు చెందిన వ్యక్తికి అమ్మేశానని, ఇందుకు గోపారామ్ సహకరించాడని చెప్పాడు. దీంతో బాలిక మేనమామ రామ్‌లాల్ ఫిర్యాదుతో జూన్ 30న సివాన ఠాణాలో మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే, కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యం వహించడంతో రామ్‌లాల్ రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు.. చిన్నారిని తండ్రే విక్రయించాడని, దాదాపు మూడురెట్ల వయసున్న వ్యక్తితో పెళ్లి చేశాడని తెలిసినా పోలీసులు పట్టనట్లు వ్యవహరించడాన్ని తప్పుపట్టింది.
బాలిక కోసం గాలింపు మొదలైందిలా..
సివాన పోలీసుస్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) దౌడ్ ఖాన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం (సిట్) కేసు దర్యాప్తు చేపట్టింది. ప్రాథమిక ఆధారాలతో జూలై చివరి వారంలో చిన్నారి తండ్రి రాజురామ్, దళారిగా వ్యవహరించిన గోపారామ్‌ను అరెస్టు చేశారు. విచారణలో సన్వాలా రామ్ దాస్‌పా పేరు బయటికొచ్చింది. అతడిని విచారించగా, బర్మేర్‌కు చెందిన భరత్‌కుమార్‌కు చిన్నారిని అమ్మేశామని, అతడు పెళ్లి చేసుకున్నాడని చెప్పాడు. దీంతో సివాన పోలీసులు భరత్, మోహన్‌లాల్ కోసం గాలింపు ప్రారంభించారు.
చాటింగ్ చేయబోతే.. జాడ దొరికింది
పోలీసులు గాలిస్తున్నారని తెలిసి భరత్‌కుమార్, మోహన్‌లాల్ తమ సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. రెండుసార్లు హైదరాబాద్ వచ్చిన సివాన పోలీసులు.. వివిధ ప్రాంతాల్లో గాలించి వెనుదిరిగారు. వారం క్రితం వాట్సాప్‌లో చాటింగ్ చేయడానికి భరత్‌కుమార్ తన సెల్‌ఫోన్ ఆన్ చేశాడు. ఫలితంగా అతడి ఆచూకీ తుర్కయాంజాల్‌లో ఉన్నట్లు సివాన పోలీసులు గుర్తించారు. వెంటనే హెడ్–కానిస్టేబుల్ సేతాన్ సింగ్, మరో కానిస్టేబుల్ సిటీకి వచ్చారు. తమ కదలికలు బయటపడితే భరత్‌కుమార్.. బాలికను తీసుకుని పారిపోతాడని అనుమానించారు. దీంతో యాచకుల వేషంలో రెండురోజుల పాటు తుర్కయాంజాల్ ప్రాంతంలో గాలించారు. చివరకు మంగళవారం బాలికను కనిపెట్టి రెస్క్యూ చేయడంతో పాటు భరత్‌కుమార్, మోహన్‌లాల్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment