రక్తసిక్తమైన సంఘటన స్థలం
అతి వేగం ఆదివారం వేకువజామున ఓ కుటుంబాన్నికాటేసింది. ఆగి ఉన్న లారీరూపంలో ఎనిమిది మందిని మృత్యువు కబళించింది. తాత, అవ్వల ఒడిలో గాఢ నిద్రలో ఉన్న ఇద్దరు చిన్నారులు శాశ్వత
నిద్రలోకి వెళ్లారు. బంధువుల ఇంటికి వెళ్తున్న చెన్నై మేడవాక్కంకు చెందిన ఈ కుటుంబం తిరుచ్చి సమయ పురం వద్దప్రమాదానికి గురయ్యారు.
సాక్షి, చెన్నై : జాతీయ రహదారుల్లో వాహనాల్ని ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే నిలుపుదల చేయాలన్న హెచ్చరికల బోర్డులు ఉన్నా, ఖాతరు చేసే వాళ్లు మరీ తక్కువే. అలాగే, అతి వేగం ప్రమాదకరం అన్నట్టు హెచ్చరికలు ఉన్నా, అతిగా దూసుకువెళ్లే వాళ్లు మరీ ఎక్కువే. ఈ పరిణామాలు వెరసి అనేక కుటుంబాల్ని ప్రమాదం బారిన పడేస్తున్నాయి. జాతీయ రహదారుల్లో లారీలను ఎక్కడ బడితే అక్కడ రోడ్డు పక్కన ఆపేస్తున్నా, గస్తీ సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గంటల తరబడి రోడ్డు పక్కనే ఆగి ఉండే లారీల రూపంలో నిత్యం ప్రమాదాలు తప్పడం లేదు. ఆ కోవలో గంటల తరబడి టోల్ గేట్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఎవరూ పట్టించుకోకపోవడంతో, చిమ్మ చీకట్లో అతి వేగంగా దూసుకొచ్చిన స్కార్పియో వాహనం ఢీకొంది. ఇందుకు మూల్యంగా ఎనిమిది మంది విగత జీవులు కావాల్సి వచ్చింది.
కొత్త ఇంటిని చూద్దామన్న ఆశతో..
చెన్నై మేడవాక్కం సెల్వ వినాయక ఆలయం వీధికి చెందిన సుబ్రమణియన్, జయలక్ష్మి దంపతులకు ముగ్గురు పిల్లలు. బాలమురుగన్, విజయ రాఘవన్ కుమారులు. భాగ్యలక్ష్మి కుమార్తె. వీరందరికీ వివాహాలు అయ్యాయి. బాలమురుగన్ భార్య కవిత, విజయ రాఘవన్ భార్య గోమతి, భాగ్యలక్ష్మి భర్త మంజునాథ్. వీరందరితో పాటు మనవళ్లు, మనవరాళ్లతో కలిసి సుబ్రమణియన్, జయలక్ష్మి దంపతులు తిరుచ్చి సమయపురం సమీపంలోని బంధువు కొత్తగా నిర్మించిన ఇంటిని చూడడానికి శనివారం రాత్రి చెన్నై నుంచి పయనం అయ్యారు. పనిలో పనిగా సమయపురం మారియమ్మన్ ఆలయంతో పాటు పలు ఆలయాల సందర్శనకు ఏర్పాట్లు చేసుకున్నారు. చెన్నై నుంచి స్కార్పియో వాహనంలో మొత్తం 13 మంది బయలు దేరారు. ఈ వాహనాన్ని బాల మురుగన్ నడిపాడు.
చీకట్లో కనిపించని లారీ
ఆదివారం వేకువ జామున 4.20 గంటలకు తిరుచ్చి సమయపురం టోల్ గేట్‌ను స్కార్పియో సమీపించింది. అక్కడి నుంచి మరో అరగంటలోబంధువు ఇంటికి చేరుకోవాల్సిన ఈ కుటుంబాన్ని చీకట్లో ఆగి ఉన్న లారీ రూపంలో మృత్యువు కబళించింది. టోల్ గేట్‌కు కూత వేటు దూరంలో ఆంధ్రా నెల్లూరు నుంచి తిరుచ్చి వైపు ఇనుప కమ్మిల లోడుతో వెళ్తున్న లారీ కొన్ని గంటల పాటు ఆగి ఉండడాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దీనికితోడు అక్కడ విద్యుత్ లైట్లు వెలగలేదు.. చిమ్మ చీకటి.. ఈ సమయంలో అటువైపు అతి వేగంగా దూసుకొచ్చిన స్కార్పియో వాహనం ఇక్కసారిగా లారీ వెనుక భాగంలో ఢీకొంది. పెద్ద శబ్దం రావడాన్ని గుర్తించిన టోల్ గేట్ సిబ్బంది పరుగులు తీశారు. అప్పటికే స్కార్పియో ముందు భాగం లారీ వెనుక భాగంలోకి చొచ్చుకు వెళ్లింది. గాఢ నిద్రలో ఉన్న వాళ్లు శాశ్వత నిద్రలోకి వెళ్లారు. ముందు, మధ్య సీట్లలో ఉన్న వాళ్లు సంఘటన స్థలంలోనే విగత జీవులయ్యారు.
ఎనిమిది మంది మృతి
రోడ్డు ప్రమాద సమాచారం అందుకున్న సమయపురం అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, అతి కష్టం మీద స్కార్పియో తలుపుల్ని, అద్దాలను పగుల కొట్టాల్సి వచ్చింది. వెనుక సీట్లు ఉన్న ఐదుగురితో పాటు ఓ చిన్నారిని రక్షించి చికిత్స నిమిత్తం తిరుచ్చి ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలంలోనే సుబ్రమణియన్ (60), జయలక్ష్మి(58), బాల మురుగన్(46), ఆయన కుమారుడు కందస్వామి(10), విజయరాఘవన్(43), ఆయన భార్య గోమతి(40), మంజునాథన్(40) ఆయన కుమార్తె నివేద(11) మరణించారు. కవిత, భాగ్యలక్ష్మి, వారి పిల్లలు రమ్య, జయశ్రీ, కందలక్ష్మి గాయపడ్డారు. వారందరూ వెనుక సీట్లో ఉండడంతో గాయాలతో బయటపడ్డారు. స్కార్పియో వాహనం డోర్లను అతి కష్టం మీద తొలగించిన క్షణంలో అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. పిల్లలు నివేద, కందస్వామి తాత, అవ్వల ఒడిలో నిద్రిస్తూ శాశ్వత నిద్రలోకి వెళ్లిన దృశ్యం అక్కడి వారిని కలచి వేసింది. వారిని రక్షించేందుకు ఆ అవ్వ తాత ఒడిలో అక్కున చేర్చుకున్నారో ఏమోగానీ మృత్యువు మాత్రం ఆ పిల్లల్ని వదలి పెట్టలేదు.
ఒంటరిగా జయశ్రీ
ప్రమాదంలో అవ్వ, తాతతోపాటు ఎనిమిది మంది కుటుంబీకులు మరణించడం, మరో నలుగురు గాయపడ్డా, రెండేళ్ల చిన్నారి జయశ్రీకి మాత్రం ఎలాంటి గాయాలు తగలలేదు. ప్రమాదం షాక్‌తో ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో ఉన్న ఆ చిన్నారి ఆలనా పాలన చూసుకునేందుకు కొన్ని గంటల పాటు ఎవరూ లేరు. ఆస్పత్రి సిబ్బందే తమ వద్ద ఉంచుకున్నారు. తొమ్మిది గంటల సమయంలో బంధువులు రావడంతో వారికి అప్పగించారు. ఈ ప్రమాదం రూపంలో కుటుంబీకులు విగత జీవులు కావడంతో ఆప్తుల రోదన వర్ణణాతీతం. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిలో మూడు గంటల పాటు వాహనాల రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రమాదం తదుపరి లారీ డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment