పొత్తూరి వెంకట్రాజు, బంగారమ్మ (ఫైల్) శ్మశానంలో తండ్రి మృతదేహం వద్ద విలపిస్తున్న తనయుడు జయరాజ్
రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి ఆ దంపతులది. కాయకష్టం చేసుకుని సంపాదించిన రూపాయి, రూపాయి పోగేసి కొంత మొత్తం దాచారు. ఆ డబ్బు అనారోగ్యంతో ఉన్న కొడుక్కి వైద్య ఖర్చులకు పనిచేస్తుందని భావించారు. ఇంతలో వారితో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి వారిని మాయ మాటలతో నమ్మించి వారి వద్ద నుంచి రూ.రెండు లక్షల సొమ్మును అప్పుగా తీసుకున్నాడు. ఒక ఏడాది పాటు వారికి వడ్డీ చెల్లించేందుకు నానా తిప్పలు పెట్టాడు. కొన్ని రోజులకు మొత్తం ఇవ్వడం మానేశాడు. ఇదేంటని? ఆ దంపతులు అతడిని ప్రశ్నించారు. తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని వారు అతడికి వివరించారు. అంతేకాదు పెద్దల్లోనూ పంచాయతీ పెట్టారు.. అయినా ఆ కర్కశుడి గుండె కరగలేదు.. ‘ఇవ్వను ఏం చేస్తారో చేసుకోండి. మీ దిక్కున్న చోట చెప్పుకోండి’ అంటూ వారి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఆ దంపతుల వద్ద ఉన్న కాగితాలు సైతం లాక్కున్నాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ వృద్ధదంపతులు బాకీదారుడి ఇంటి వద్దే పురుగుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకుని అక్కడి వచ్చిన దంపతుల కుమారుడు వారిని ఆసుపత్రిలో చేర్చగా వారు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనమైంది.
తూర్పుగోదావరి, అంబాజీపేట, అమలాపురం టౌన్: అప్పు తీసుకున్న వ్యక్తులు వాటిని చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తుంటాం.. దానికి భిన్నంగా రుణం ఇచ్చిన దంపతులు.. ఆ బాకీల వసూలు కాక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. అయినవిల్లి మండలం వెలవలపల్లికి చెందిన పొత్తూరి వెంకట్రాజు(70) బంగారమ్మ (60) దంపతులకు 2014లో దుర్గమ్మ కాలనీలో ఇళ్ల స్థలం ఇచ్చారు. అప్పటికే అక్కడ ఇళ్ల నిర్మాణాన్ని కాంట్రాక్టు తీసుకుంటున్న అంబాజీపేట మండలం కె.పెదపూడికి చెందిన బొక్కా చిట్టిబాబు వీరికి పరిచయమై వారికి ఇళ్లు నిర్మించాడు. ఈ నేపథ్యంలో వారితో పరిచయాలు పెంచుకుని వారి వద్ద నుంచి నాలుగేళ్ల క్రితం రూ.రెండు లక్షలను అప్పుగా తీసుకున్నాడు. ఒక ఏడాది తీసుకున్న రుణానికి సంబంధించి స్వల్ప వడ్డీ మొత్తాన్ని ఇస్తూ వారికి చుక్కలు చూపించాడు. ఆ తరువాత కనీసం వడ్డీ డబ్బులు కూడా చెల్లించకుండా నానా ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో గ్రామ పెద్దలను ఆశ్రయించగా వారి తీసుకున్న రుణాన్ని పది రోజుల్లో చెల్లిస్తానని పంచాయతీ పెద్దలనే నమ్మించాడు. పెద్దల మాటకు విలువ లేకుండా ప్రవర్తించడంతో ఆ వృద్ధ దంపతులు నేరుగా చిట్టిబాబు ఇంటికి వచ్చి తీసుకున్న డబ్బులు ఇవ్వమని, తన కుమారుడికి వైద్యం చేయించాలని కంట తడిపెట్టుకుని వెళ్లేవారు. అయినా అతడి మనస్సు కరగలేదు. దాంతో ఈ నెల 6న ఆ వృద్ధ దంపతులు చిట్టిబాబు ఇంటికి వచ్చి తమ కుమారుడికి వైద్యం కోసం డబ్బులు అవసరమని, తీసుకున్న అప్పు చెల్లించమని కోరడంతో వారి పట్ల ఎంతో దురుసుగా ప్రవర్తించి వారి వద్ద నున్న కాగితాలను సైతం లాక్కొని దుర్భాషలాడాడు.
పురుగు మందు సేవించి..
మనస్తాపానికి చెందిన వృద్ధ దంపతులు కూల్‌డ్రింక్‌లో పురుగు మందు కలుపుకొని సేవించారు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా తన కుమారుడైన జయరాజ్‌కు తల్లిదండ్రులు వివరించారు. విషయాన్ని తెలుసుకున్న కుమారుడు సంఘటన స్థలానికి చేరుకుని చిట్టిబాబును ప్రశ్నించగా అతడి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించి అతడి వద్ద నున్న మోటారు సైకిల్ తాళం లాక్కున్నాడు. వైద్య చికిత్స నిమిత్తం తల్లిదండ్రులను అమలాపురం ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతున్న బంగారమ్మ ఈ నెల ఎనిమిదో తేదీన మృతి చెందారు. ఆమె అంత్యక్రియలను బంధువులు, స్థానికుల సాయంతో జరిపారు. వెంకట్రాజు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల పదో తేదీన మృతి చెందారు. తండ్రి అంత్యక్రియలను నిర్వహించేందుకు తన వద్ద చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో కుటుంబానికి న్యాయం జరగలేదన్న కారణంతో మృతదేహాన్ని నాలుగు రోజులుగా అంత్యక్రియలు చేపట్టకుండా అమలాపురం శ్మశాన వాటిక వద్దే ఉంచారు. వినాయక చవితి రోజు గురువారం కూడా శవం వద్ద వారు నిరసన కొనసాగించారు. శవాన్ని శ్మశానంలోనే ఫ్రిజర్‌లో పెట్టి ఆందోళన కొనసాగిస్తున్నారు. అప్పు తీసుకుని దంపతుల ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, మృత దంపతుల ఏకైక కుమారుడైన కిడ్నీ వ్యాధిగ్రçస్తుడిని ఆర్థికంగా ఆదుకోవాలన్న డిమాండ్లతో బంధువులు నిరసన కొనసాగిస్తున్నారు. దంపతుల ఆత్యహత్యకు కారకుడైన చిట్టిబాబుపై అంబాజీపేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయానికి బంధువుల ఆందోళన తీవ్రతరం చేయడంతో అంబాజీపేట, అయినవిల్లి ఎస్సైలు నాగార్జున, షేక్ జానీ బాషాలు శ్మశాన వాటిక వచ్చి బంధువులతో చర్చలు జరిపినా సాయంత్రం వరకూ సఫలం కాలేదు.
జయరాజ్‌కు దిక్కెవరు..?
కంటికి రెప్పలా చూసుకునే తల్లిదండ్రులు ఇక లేరని తెలిసి జయరాజు కన్నీరుమున్నీరవుతున్నాడు. అతడి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతినెలా వేలాది రూపాయలు ఖర్చవుతుందని, అతడికి దిక్కెవరంటూ బంధువులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వెంకట్రాజు, బంగారమ్మల వద్ద నుంచి అప్పుగా తీసుకున్న రూ.రెండు లక్షలతో పాటు కొంత మొత్తం అతడి పేరున బ్యాంకులో వేస్తే జయరాజ్‌ను ఆదుకునేవారమవుతామనే ఆలోచన నిందితుడు చిట్టిబాబు, పోలీసులకు లేకపోవడం బాధాకరం.
దంపతుల ఆత్మహత్యకు కారకుడైన వ్యక్తి అరెస్టు
దంపతుల ఆత్మహత్యకు కారకుడైన చిట్టిబాబును అరెస్టు చేసి, అమలాపురం కోర్టులో హాజరు పరిచామని అంబాజీపేట ఎస్సై కె.వి.నాగార్జున శుక్రవారం తెలిపారు. కోర్టు అతడికి 15 రోజులు రిమాండ్ విధించినట్టు ఆయన వెల్లడించారు.
నేడు కోనసీమ క్షత్రియ పరిషత్ ఆందోళన
అమలాపురం టౌన్: అప్పు ఇచ్చిన పాపానికి అయినవిల్లి మండలం వెలవెలపల్లికి చెందిన దంపతుల ఆత్మహత్యలపై... ఆ కుటుంబానికి జరగాల్సిన న్యాయం కోసం కోనసీమ క్షత్రియ పరిషత్ శనివారం ఉదయం నుంచి ప్రత్యక్ష ఆందోళనకు దిగనున్నట్టు ఆ పరిషత్ ప్రతినిధులు శుక్రవారం ప్రకటించారు. అమలాపురం శ్మశానంలో నాలుగు రోజులుగా ఆత్మహత్యలు చేసుకున్న దంపతుల్లో భర్త వెంకట్రాజు మృతదేహంతో నిరసన తెలుపుతున్న వారి బంధువులను కోనసీమ క్షత్రియ పరిషత్ అధ్యక్షుడు డీవీఎస్ రాజు, మున్సిపల్ కౌన్సిలర్ దంతులూరి మోహనరాజు, పరిషత్ నాయకుడు సయ్యపరాజు సత్తిబాబురాజు తదితరులు శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. వెంకట్రాజు మృతదేహాన్ని కూడా పరిశీలించారు. ఈ ఘటనపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నుంచి పరిషత్ తరఫున ఆందోళన దిగుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అయినవిల్లి ఎంపీపీ సలాది పుల్లయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.
దంపతుల ఆత్మహత్యలపై నిజ నిర్ధారణ: దంపతుల ఆత్మహత్యలు, శ్మశానంలో భర్త మృతదేహంలో నిరసన వంటి సంఘటనలపై పౌర హక్కుల సంఘం (సీఎల్సీ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిజ నిర్ధారణ జరిగింది. దీనిపై ప్రభుత్వం స్పందించాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బీఆర్ అమలదాసు డిమాండ్ చేశారు. అప్పు తీసుకున్న చిట్టిబాబు వల్లే దంపతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment