
ఇక్బాల్ బీ (ఫైల్)
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తర మండలం, తిరుమలగిరి ఠాణా పరిధిలో సోమవారం ఉదయం జరిగిన బందిపోటు దొంగతనం ఉదంతంలో గాయపడిన బాధిత వృద్ధురాలు మంగళవారం రాత్రి కన్నుమూసింది. దీంతో ఈ కేసులో హత్యారోపణలు జోడించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..కార్వాన్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న షానవాజ్ తిరుమలగిరి దర్గా సమీపంలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతను ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు డ్యూటీకి వెళ్లిపోతాడు. సోమవారం కూడా అలానే వెళ్లిపోగా... భార్య, తల్లి ఇక్బాల్ బీ మాత్రం ఇంట్లో మిగిలారు. దీనిని గమనించి పథకం ప్రకారం వ్యవహరించిన దొంగలు సోమవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో విరుచుకుపడ్డారు.
ముఖాలకు మాస్క్‌లు ధరించిన నలుగురు పురుషులు, బుర్ఖా వేసుకుని ఓ మహిళ వీరి ఇంట్లోకి దూసుకువచ్చారు. అత్తాకోడళ్లను కత్తులతో బెదిరించి కట్టేయడంతో పాటు వారి నోటికి ప్లాస్టర్ వేశారు. భయపెట్టే ఉద్దేశంతో వారిపై చేయి చేసుకున్నారు. ఇద్దరి ఒంటిపై ఉన్న ఐదు తులాల బంగారు నగదు, 45 తులాల వెండి పట్టీలు తీసుకుని, అల్మారాలో వెతికి ఉడాయించారు. దుండగుల నోటికి ప్లాస్టర్ వేయడంతో ఆస్తమా రోగి అయిన ఇక్బాల్ బీ ఆ తర్వాత అస్వస్థతకు గురైంది. దుండగుల దాడిలో ఆమె చెవి ప్రాంతంలోనూ గాయాలయ్యాయి. షానవాజ్ తల్లిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కన్నుమూసింది.
దీంతో ఈ బందిపోటు దొంగతనం కేసులో హత్యారోపణల్ని చేర్చాలని తిరుమలగిరి పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. మరోపక్క దుండగులు వినియోగించిన కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment