శావల్యాపురం: లంచం ఇస్తే ఎంత పని అయినా సులువుగా చేస్తామని రెవెన్యూ అధికారులు నిరూపించారు. ఒకరి పేరు మీద ఉన్న పొలాన్ని అన్‌లైన్‌లో మరొకరి పేరు మీద నమోదు చేయడంతో కొందరు దర్జాగా రుణాలు పొందారు. జరిగిన అక్రమాన్ని మండలంలోని పిచికలపాలెం గ్రామ సర్పంచి తిరివీధుల సూర్యనారాయణ వివరించారు. గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తమ పొలాల పక్కనే ఉన్న రైతుల సర్వే నంబర్లు, అమ్మిన పొలాలు తమ పేర్లు మీద రెవెన్యూ సిబ్బంది సహకారంతో నమోదు చేయించుకొని వినుకొండ, శావల్యాపురం బ్యాంకుల్లో లక్ష నుంచి రూ.5లక్షల వరకు రుణాలు పొందారని ఆయన వెల్లడించారు. తహసీల్దారు కార్యాలయంలో దళారులు తిష్ట అక్రమాలకు పాల్పడుతున్నారని, దీనికి వీఆర్వో నుంచి ఉన్నతాధికారులు కూడా సహకరిస్తున్నారని ఆరోపించారు.
సిబ్బందితో వాదనకు దిగిన రైతులు
విషయం తెలుసుకున్న రైతులు తహసీల్దారు కార్యాలయ సిబ్బందితో గురువారం ఉదయం వాదులాటకు దిగారు. శానంపూడి, చినకంచెర్ల, పొట్లూరు తదితర గ్రామాల్లోనూ బినామీ పేర్లతో రుణాలు తీసుకున్నట్లు వారు ఆరోపించారు. రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై తహసీల్దార్ వి.కోటేశ్వరరావు నాయక్‌ను కోరగా ఆరోపణలతో నిజం లేదన్నారు. ఒకరు భూమిని మరొకరి పేరుతో ఆన్‌లైన్‌లో నమోదు చేయడం అవాస్తమన్నారు. క్షేత్రస్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment