బండి లేకపోయినా.. | Fake vehicle registration gang arrest | Sakshi
Sakshi News home page

బండి లేకపోయినా..

Published Fri, Mar 2 2018 7:02 AM | Last Updated on Fri, Mar 2 2018 7:02 AM

Fake vehicle registration gang arrest - Sakshi

పోలీసుల అదుపులో నిందితులు

సాక్షి, సిటీబ్యూరో: సాధారణ పౌరుడు ఓ వాహనం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే... సవాలక్ష ఫార్మాలిటీలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ స్లాట్‌ నుంచి ఆధార్‌ కార్డు వరకు వివిధ రకాలైన పత్రాలను జత చేసి, వాహ నం తీసుకుని యజమానే స్వయంగా వెళ్లి, కనీసం మూడునాలుగు గంటలు వెచ్చిస్తే తప్ప రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తికాదు. ఆ తర్వాత ఆర్సీ చేతికి రావడానికి మరో వారం పది రోజులు పడుతుంది. హితేష్‌ నేతృత్వంలోని ముఠా రంగంలోకి దిగితే కేవలం ‘ఫార్మాలిటీస్‌’ తప్ప ఇంకేం అవసరం లేదు. వాహనాన్ని, దానికి సంబంధించిన పత్రాలను దాఖలు చేయాల్సిన పని లేదు. కేవలం స్లాట్‌ బుక్‌ చేసి, ఫామ్‌–20 లేదా ఫామ్‌–25 సమర్పిస్తే చాలు. గంటలోనే ఆర్సీ సిద్ధమైపోయి వీరి చేతికి వచ్చేస్తుంది.

అసలు వాహనం లేకపోయినా పర్వాలేదు... భవిష్యత్తులో ‘ఖరీదు చేసే’ ఆలోచన ఉంటే చాలు రిజిస్ట్రేషన్‌ పూర్తయి ఆర్సీ వీరి చేతిలో ఉంటుంది.  బండ్లగూడలోని సౌత్‌జోన్‌ ఆర్టీఏ కార్యాలయం కేంద్రంగా సాగిన ‘బోగస్‌ రిజిస్ట్రేషన్ల దందా’ నేపథ్యమిదీ. 2015 నుంచి సాగిన ఈ అడ్డగోలు వ్యవహారంలో ఆర్టీఏ అధికారులకు పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆర్టీఓ నుంచి క్లర్క్‌ వరకు మొత్తం నలుగురు అధికారులు/సిబ్బంది దళారి విఠల్‌రావుతో కుమ్మక్కైనట్లు ప్రాథమికంగా నిర్థారించారు. సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన ఐదుగురు సభ్యుల ముఠా 2015 నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 వాహనాలకు రిజిస్ట్రేషన్లు సృష్టించి విక్ర యించింది. ఆలుగడ్డబావికి చెందిన మెకానిక్‌ వద్ద దొరికిన ‘తీగ’ లాగిన టాస్క్‌ఫో ర్స్‌ ఈ ము ఠా గుట్టును రట్టు చేసింది. ఈ రాకెట్‌ ప్రధాన సూత్రధారి హితేష్‌ పటేల్‌ వాహనాన్ని చూసి దాని మోడల్, ఏ ఏడాదిలో తయారయ్యిందో చెప్పగల నేర్పరి కావడం కొసమెరుపు. 

ఒక్కో వాహనానికి రూ.80 వేలు...  
ఓఎల్‌ఎక్స్‌ ద్వారా కాలం చెల్లిన వాహనాలను రూ.10 వేల నుంచి రూ.15 వేలకు ఖరీదు చేసే హితేష్‌ వాటిని తొలుత మెకానిక్‌లకు అప్పగిస్తాడు. రూ.20 వేల నుంచి రూ.30 వేలు ఖర్చు చేసి వీటిని కొత్తగా తయారు చేయిస్తాడు. ఆపై ఒక్కో వాహనం కోసం ‘వెహికిల్‌ రిజిస్ట్రేషన్‌ సెర్చ్‌’ నుంచి కొన్ని నెంబర్లను ఎంపిక చేసి, ఇంజన్‌తో పాటు ఛాసిస్‌ నెంబర్లు సృష్టించి ఆర్టీఏ దళారి విఠల్‌రావుకు అందించేవాడు. వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ పత్రాలు జారీ చేయించడానికి ఇతను రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఇలా మొత్తమ్మీద గరిష్టంగా ఒక్కో వాహనానికీ రూ.80 వేల వరకు ఖర్చు చేసున్న హితేష్‌ గ్యాంగ్‌ దాన్ని రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకుంటోంది. 2015 నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 వాహనాలను ఈ పంథాలో విక్రయించగా... వాటిలో అత్యధికం ఎన్‌ఫీల్డ్, యమహా బైక్‌లే కావడం గమనార్హం. మార్కెట్‌లో వీటికి ఎక్కువ క్రేజ్‌ ఉండటంతో హితేష్‌ వీటిపైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు.

పత్రాలు ఇస్తే చాలు...
ఈ రిజిస్ట్రేషన్‌ వ్యవహారాన్ని విఠల్‌రావు బండ్లగూడలోని సౌత్‌జోన్‌ ఆర్టీఏ కార్యాలయం కేంద్రంగా సాగిస్తున్నాడు. ఒక్కో వాహనంపై ఆర్సీ సృష్టించడానికి గరిష్టంగా రూ.5 వేలు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఆర్టీఓకు రూ.1500, ఎంవీఐకి రూ.1000, సూపరింటెండెంట్‌కు రూ.1000, ఓ మహిళా క్లర్క్‌కు రూ.500లతో పాటు కొందరు కానిస్టేబుళ్లకు రూ.500 చొప్పున చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ మామూళ్లు తీసుకుంటున్న అధికారులు, సిబ్బంది వాహనం, ఇతర పత్రాలు తీసుకురాకపోయినా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. రీ–అసైన్‌మెంట్‌కు ఫామ్‌–20, రీ–రిజిస్ట్రేషన్‌కు ఫామ్‌–25 ఇస్తే చాలు ఆర్సీలు జారీ చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఎలాంటి వాహనాలు లేనప్పటికీ 14 ఆర్సీలు ఈ ముఠా వద్ద సిద్ధంగా ఉండటం. మరో 75 నెంబర్లను ఆర్సీల జారీ కోసం సిద్ధం చేసి ఉంచడం. 

అందరూ నకిలీ వ్యక్తులే...
ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయడానికి యజమాని, వాహనం తప్పనిసరి. అయితే అధికారులను మేనేజ్‌ చేస్తున్న ఈ ముఠా వాహనాలు అసలే తీసుకువెళ్లట్లేదు. యజమానులుగా పరిచయస్తులైన మెకానిక్‌లతో పాటు ఇతరుల్ని తీసుకువెళ్తోంది. వీరితోనే వేలి ముద్రలు వేయించి, వీరే ఫొటోలు దిగిన తర్వాత డిజిటల్‌ సంతకాలు సైతం చేయించేస్తోంది. కొన్ని సందర్భాల్లో హితేష్‌ స్వయంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న 35 ఆర్సీల్లో ఆరు హితేష్‌ పేరుతో, ఐదు అబు నాసిర్, మరో ఐదు రాజ్‌కుమార్, ఐదు మహ్మద్‌ సలీం పేరుతో మిగిలినవి గుర్తుతెలియని వ్యక్తుల పేర్లతో ఉండటం గమనార్హం. వీరే పదేపదే ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్తూ తమ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించేసుకుని వాహనాలను అమ్మేస్తున్నారు. 

ఈ రిజిస్ట్రేషన్లతో ఎన్నో ఇబ్బందులు...
ఈ ముఠా విక్రయించిన వాటిలో కొన్ని కాలం చెల్లిన వాహనాలు, మరికొన్ని చోరీ వాహనాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా జరుగుతున్న రిజిస్ట్రేషన్లతో ఎన్నో ఇబ్బందులు ఉంటాయని పోలీసులు పేర్కొంటున్నారు. ఒకే రిజిస్ట్రేషన్‌ నెంబర్‌తో ఒకటికి మించి వాహనాలు తిరిగేస్తుంటాయి. ఫలితంగా హిట్‌ అండ్‌ రన్‌తో పాటు ఇతర నేరాలు జరిగినప్పుడు వాహనం రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ తెలిసినా.. బాధ్యులను పట్టుకోవడంతో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. చిక్కినా వీటికి ఇన్సూరెన్స్‌ ఉండవు. మరోపక్క చోరీ వాహనాలకు సైతం కొత్త నెంబర్ల వచ్చేస్తున్న నేపథ్యంలో ఎలా దర్యాప్తు చేసినా వీటిని పట్టుకోవడం కష్టం. దీంతో బాధితులు నష్టపోవాల్సి వస్తోంది. 

చిన్న ఆధారంతో ముందుకు..
మూడేళ్లుగా సాగుతున్న హితేష్‌ ముఠా దందాపై ఆలుగడ్డబావిలో టాస్క్‌ఫోర్స్‌కు ఆధారం దొరికింది. అక్కడి మెకానిక్‌ మైఖేల్‌ మోదీ ఇటీవల ఓ వాహనానికి ఇదే పంథాలో ఆర్సీ సృష్టించి విక్రయించాడు. అవే రిజిస్ట్రేషన్, ఛాసిస్, ఇంజిన్‌ నెంబర్లు మరో వాహనానికి తగిలించి తిరుగుతున్నాడు. ఈ ‘డబుల్‌ రిజిస్ట్రేషన్‌’ వ్యవహారంపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావుకు సమాచారం అందడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా... దందా మొత్తం వెలుగులోకి వచ్చి హితేష్, మోదీ సహా ఐదుగురు కటకటాల్లోకి చేరారు. ఈ ముఠాకు సహకరించిన ఇతర మెకానిక్‌లు ఎవరనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో పాత్రధారులుగా ఉన్న ఆర్టీఏ అధికారులను ఆధారాలతో సహా గుర్తించడానికీ ప్రయత్నాలు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement