రాజేందర్, భవానీ, లక్ష్మి (ఫైల్ ఫొటోలు)
దుబ్బాకటౌన్: ఆర్థిక బ్బందుల కారణంగా ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు ఉరివేసి ఆపై తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ కథనం ప్రకారం.. లచ్చపేటకు చెందిన బడుగు రాజేందర్(40) చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాడు. నమ్ముకున్న వృత్తిలో ఆదాయం సరిగా లేకపోవడంతో ఆ పనిని వదిలి కుటుంబాన్ని పోషించేందుకు దుబ్బాకలో చిన్నగా గ్యాస్ స్టవ్‌ల రిపేరు దుకాణం పెట్టుకున్నాడు. ఏడాది క్రితం రాజేందర్ భార్య విజయలక్ష్మి బ్రెయిన్ ట్యూమర్ కారణంగా ఆస్పత్రిపాలవడంతో చికిత్సకోసం దాదాపు నాలుగు లక్షలు అప్పులు చేశాడు. వ్యాధి తీవ్రమై ఆమె మృతి చెందింది. భార్య చనిపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో పాటు ఇద్దరు కూతుళ్లు.. భవానీ (9), లక్ష్మి(6)లను ఎలా పోషించాలో అర్థం కాక తీవ్రమనోవేదనకు గురయ్యాడు.
ఈ క్రమంలోనే గురువారం రాత్రి రాజేందర్ తన కూతుళ్లు భవానీ, లక్ష్మి నిద్రపోతున్న సమయంలో వారిని ఇంట్లో దూలానికి నైలాన్ తాడుతో ఉరివేసి, తానూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం రాజేందర్ తల్లి యాదమ్మ ఇంట్లోకి వెళ్లి చూడగా దూలానికి తండ్రీ కూతుళ్లు వేలాడుతూ కన్పించారు. ఆమె పెద్దగా కేకలు పెడుతూ రోదిస్తూ బయటకు రావడంతో చుట్టుపక్కల వారు విషయం తెలుసుకుని దుబ్బాక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, సిద్దిపేట రూరల్ సీఐ వెంకట్రామయ్య కూడా సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ఏరియా ఆసుపత్రికి తరలించారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. మృతుడు రాజేందర్ తాము ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నామంటూ రాసి ఉంచిన లెటర్ ఇంట్లో లభ్యమయిందని ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment