చందర్లపాడు (నందిగామ) : తండ్రి క్షణికావేశానికి కన్నకూతురు ప్రాణాలు పోగొట్టుకుంది. ఫోన్‌లో మాట్లాడుతోందని ఆగ్రహించిన తండ్రి కర్రతో తలపై మోదటంతో అక్కడికక్కడే మృతి చెందింది. వివరాలు.. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామానికి చెందిన తొండపు కోటయ్య, పద్మావతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె చంద్రిక (22) గుడ్లవల్లేరులో బీఫార్మసీ పూర్తి చేసి ఇంటివద్దనే ఉంటోంది. చిన్న కుమార్తె శిరీష బీటెక్ చదువుతోంది. బీఫార్మసీ పూర్తి చేసిన చంద్రికను తల్లిదండ్రులు ఎంఫార్మసీ చేయించాలనుకున్నారు.
ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం చంద్రిక ఫోన్‌లో మాట్లాడుతుండగా.. ప్రియునితో మాట్లాడుతోందని అనుమానించిన తండ్రి కోటయ్య ఆవేశంతో అందుబాటులో ఉన్న కర్ర తీసుకుని ఆమె తలపై మోదాడు. కుప్పకూలిన చంద్రిక అక్కడికక్కడే మృతి చెందింది. చంద్రిక తన 22వ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంది. మరుసటి రోజే ఇలా జరిగింది. మృతురాలి తాత పారా రామారావు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదుచేశారు.
ప్రేమ విషయం తెలియడం వల్లే : చంద్రిక హత్య వెనుక ప్రేమ వ్యవహారం ఉందని నందిగామ పోలీసులు నిర్ధారించారు. ఆమె ఫోన్‌లో మాట్లాడిన యువకుడిని ప్రశ్నించగా తమ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు అంగీకరించాడు. తమ ప్రేమ విషయాన్ని చంద్రిక ఇంట్లో చెప్పడంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించాడు. అయితే చంద్రిక కుటుంబ సభ్యుల వాదన మాత్రం మరోలా ఉంది. తల్లిదండ్రుల మధ్య గొడవలో వెళ్లడంతో జరిగిన పొరపాటు కారణంగా చంద్రిక చనిపోయిందని చెబుతున్నారు. కారణం ఏమైనా నిందితుడికి కచ్చితంగా శిక్ష పడుతుందని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment