అరెస్టు చేసిన నిందితులతో త్రీటౌన్ సీఐ శ్రీనివాసరావు, ఎస్సై పైడిబాబు
ఏలూరు టౌన్ : ‘తాము అవినీతి నిరోధక శాఖ అధికారులం.. నీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి.. తాము అడిగినంత ఇస్తే సరే లేకుంటే కేసుల్లో ఇరికిస్తాం..’ అంటూ ఏలూరు మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్తి పద్మనాభమూర్తిని బెదిరిస్తూ భారీ మొత్తంలో సొమ్ములు డిమాండ్ చేసిన వ్యక్తులను ఏలూరు త్రీటౌన్ పోలీసులు పట్టుకున్నారు. రూ.1.50 కోట్లు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడిన ముఠాను త్రీటౌన్ సీఐ పి.శ్రీనివాసరావు, ఎస్సై ఎ.పైడిబాబు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు మత్స్యశాఖలో ఏడీగా పనిచేస్తున్న సత్తి పద్మనాభమూర్తికి వారం రోజులుగా బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. తాము అవినీతి శాఖ అధికారులం అంటూ రూ.1.50 కోట్లు ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
తమకు సొమ్ములు ఇవ్వకుంటే కేసులు పెడతామని బెదిరించారు. దీంతో ఏడీ పద్మనాభమూర్తి ఏలూరు త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించారు. రెండురోజుల కిత్రం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రెండురోజుల్లో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగికి చెందిన చంచెలవాహి ఉమామహేశ్వరరావు, మండపేట మండలం ద్వారపూడికి చెందిన గుండాబత్తుల మణికంఠ, సత్తి సాయి సూర్యనారాయణమూర్తి, హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్‌కు చెందిన బెండ్ర రాంబాబును అరెస్ట్ చేశారు.
తోడల్లుడి పన్నాగం బట్టబయలు
సత్తి పద్మనాభమూర్తి స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి. ఈ కేసులో నిందితుడుగా ఉన్న సత్తి సాయిసూర్యనారాయణమూర్తి ఆయనకు బంధువు. కుటుంబ అవసరాలు సాకుగా చూపిండచంతో అప్పడప్పుడూ సూర్యనారాయణమూర్తికి ఏడీ పద్మనాభమూర్తి సొమ్ములు ఇస్తుండేవారు. ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతున్న సూర్యనారాయణమూర్తి అప్పులపాలవడంతో ఏడీ నుంచి సొమ్ములు కాజేయాలని పన్నాగం పన్నాడు. తూర్పుగోదావరి జిల్లాలో తన స్నేహితులతో కలిసి ఏసీబీ అధికారులుగా చెబుతూ డబ్బులు డిమాండ్ చేసేందుకు పథకం వేశాడు. ఒకేసారి ఏకమొత్తంలో భారీగా సొమ్ములు కాజేయాలనే ఆశతో ఏసీబీ అధికారులుగా చెప్పుకుంటూ బెదిరింపులకు దిగారు. చివరకు పోలీసులకు చిక్కి కేసుల్లో ఇరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment