చెన్నై, వేలూరు: తాళి కట్టే సమయంలో భర్త రెండవ వివాహాన్ని మొదటి భార్య అడ్డుకున్న ఘటన సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. వేలూరు సమీపంలోని మేట్టు ఇడయాంబట్టి గ్రామంలోని ఎంజీఆర్ నగర్‌కు చెందిన రామచంద్రన్(45) తొర్రపాడిలో టైలర్ దుకాణం నడుపుతున్నాడు. ఇతనికి గత 19 ఏళ్ల క్రితం కమలితో వివాహం జరిగి ఇద్దరు కుమారులున్నారు. మనస్పర్థల కారణంగా దంపతులు ఇద్దరూ ఐదేళ్లుగా వేర్వేరుగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరూర్‌కు చెందిన ఒక యువతి తొర్రపాడిలోని బందువుల ఇంటికి వచ్చిన సమయంలో రామచంద్రన్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో ఆ యువతిని రెండవ వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నాడు. (అమ్మా.. ఇక్కడ ఉండలేకపోతున్నా! )
బుధవారం ఉదయం అడుక్కంబరైలోని అమ్మన్ ఆలయంలో వివాహ ఏర్పాట్లు చేశారు. ఉదయం పూజలు పూర్తి చేసుకొని తాళి కట్టేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. విషయం తెలుసుకున్న కమలి తన ఇద్దరు కుమారులను తీసుకొని ఆలయానికి వచ్చింది. పెళ్లి దుస్తులతో ఉన్న రామచంద్రన్‌ను కమలి నిలదీసింది. ఆ సమయంలో పెళ్లి కుమార్తె బంధువులు, కమలి మధ్య ఘర్షణ వాతావారణం నెలకొంది. విషయం తెలుసుకున్న మహిళా పోలీసులు అమ్మన్ ఆలయం వద్దకు చేరుకొని వివాహాన్ని నిలిపి వేసి రామచంద్రన్, పెళ్లి కుమార్తె, ఆమె బంధువులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ సమయంలో రామచంద్రన్‌కు గుండె నొప్పి రావడంతో వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఇరు వర్గాల మధ్య జరిగిన సంఘటనల గురించి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment