
అరెస్టయిన చెల్లకిళి, అశోక్‌కుమార్
చెన్నై, టీ.నగర్: మగబిడ్డ కోసం బాలికను రెండో వివాహం చేసుకున్న యువకుడిని ఫోక్సో చట్టం కింద పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇందుకు సహకరించిన భార్యను అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. కడలూరు జిల్లా దిట్టకుడి సమీపంలోని ఉల్లవయ్యంగుడి గ్రామానికి చెందిన అశోక్‌కుమార్ (33). ఇతని భార్య చెల్లకిళి (28). వీరికి వివాహమై ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇలా ఉండగా తనకు మగబిడ్డ కావాలని అశోక్‌కుమార్ ఆరాటపడడంతో అదే ప్రాంతంలో ఉన్న 17 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి వశం చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీ దిట్టకుడి సమీపంలోని ఓగలూరు గ్రామంలో ఉన్న కులదైవం ఆలయంలో కుటుంబంతో పాటు వెళుతున్నట్లు చెప్పి బాలికను తనతో పంపాల్సిందిగా ఆమె తల్లిదండ్రులను కోరారు.
అసలు విషయం తెలియని తల్లిదండ్రులు అశోక్‌కుమార్ కుటుంబంతో తమ కుమార్తెను పంపారు. అయితే మూడు రోజులు అయినప్పటికీ కుమార్తె ఇంటికి రాకపోవడంతో అనుమానించిన బాలిక తల్లిదండ్రులు అశోక్‌కుమార్ భార్యను రప్పించారు. అయితే ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానించారు. దీనిపై బాలిక తల్లి విరుదాచలం మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో బాలికను అశోక్‌కుమార్, అతని భార్య కలిసి మాయమాటలు చెప్పి అశోక్‌కుమార్‌తో ఆలయంలో వివాహం జరిపించినట్లు తెలిసింది. ఇలా ఉండగా శనివారం పెన్నాడం బస్టాండులో నిలుచుని వున్న అశోక్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద విచారణ జరపగా తనకు మగ సంతానం లేకపోవడంతో బాలికను వివాహం చేసుకున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో అశోక్‌కుమార్‌ను ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసిన పోలీసులు అతనికి సహకరించిన భార్య చెల్లకిళిని అరెస్టు చేసి కడలూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment