‘ఆ స్కూల్‌లో 20 మందిని చంపేస్తా’ | Florida School Shooter Chilling Videos Revealed | Sakshi
Sakshi News home page

‘ఆ స్కూల్‌లో 20 మందిని చంపేస్తా’

Published Thu, May 31 2018 12:45 PM | Last Updated on Thu, May 31 2018 3:40 PM

Florida School Shooter Chilling Videos Revealed - Sakshi

నికోలస్‌ క్రూజ్‌

వాషింగ్టన్‌: ఫ్లోరిడాలోని పార్క్‌లాండ్‌ పాఠశాలపై ఫిబ్రవరిలో కాల్పులకు తెగబడి 17 మంది విద్యార్థులను పొట్టనబెట్టుకున్న ఉన్మాది నికోలస్‌ క్రూజ్‌ ఆ ఘటనకు ముందు తీసిన వీడియోలు బుధవారం బయటపడ్డాయి. వాటిల్లో పలు విస్మయకర విషయాలు వెల్లడయ్యాయి. మరికొద్దిసేపట్లో తాను ఏం చేయబోతున్నాడో నికోలస్‌ ఒక వీడియోలో పేర్కొన్నాడు.

‘నేను 2018లో మరో నరహంతకున్ని కాబోతున్నాను. నేను చదువుకున్న మర్జోరీ స్టోన్‌మాన్‌ డగ్లస్‌ పాఠాశాలలో నరమేధం సృష్టించబోతున్నాను. నరమేధం వల్ల నాకు ఎంతో పేరొస్తుంది. గతంలో కాల్పులకు తెగబడి ఉన్మాదం సృష్టించిన వారిని అనుసరించబోతున్నాను. వార్తల్లో నన్ను చూశాక తెలుస్తుంది ఈ ప్రపంచానికి నేనెవరినో..! కనీసం 20 మందిని చంపడమే నా లక్ష్యం. నా వద్ద గల ఏఆర్‌-15 గన్‌తో రెండు రౌండ్లలో పని ముగించేస్తా. మీరంతా నా చేతుల్లో చావబోతున్నారు’ అంటూ నికోలస్‌ వికృత దరహాసం చేశాడు. కాగా, నికోలస్‌ హత్యాకాండకు పాల్పడటానికి గల కారణాలను అధికారులు వెల్లడించలేదు.

నికోలస్‌ ప్రవర్తన సరిగా లేదని, తుపాకి కూడా కలిగి ఉన్నాడని ఘటనకు ముందు పలు సందర్భాల్లో పోలీసుల అతనిపై అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. వారి అనుమానాలు నిజమయ్యాయి. ఫిబ్రవరి 14న దర్జాగా స్కూల్‌లోకి ప్రవేశించిన నికోలస్‌ 17 విద్యార్థులను తన గన్‌తో పిట్టల్ని కాల్చినట్టు కాల్చాడు. మరో 17 మందిని తీవ్రంగా గాయపరిచాడు. అభం శుభం తెలియని పిల్లలను బలితీసుకుని ఉరికంభం ఎక్కబోతున్నాడు. బ్రోవార్డ్‌ కౌంటీ న్యాయవాదులు నికోలస్‌కు మరణ శిక్ష పడేలా చూస్తామని అన్నారు. కాగా, ఈ వీడియోని బహిర్గతం చేయొద్దని బాధిత కుటుంబాలు మీడియా చానెళ్లను కోరాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement