
సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఫార్ములా వన్ రేస్ పేరిట జరిగిన భారీ మోసం ఏడేళ్ల అనంతరం మరోసారి తెరమీదకు వచ్చింది. 2011లో కార్ రేసింగ్ నిర్వహిస్తామని పలువురు దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసిన డెక్కన్ క్రానికల్ ఎండీ వినాయక్ రవిరెడ్డి కుమార్తె అంజనారెడ్డితో పాటు మరో ముగ్గురిపై కేసులో సీసీఎస్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా ఐపీఎల్ మాదిరిగా ఫార్ములా వన్ రేస్ నిర్వహిస్తామని అంజనారెడ్డి నమ్మబలికి, మచదర్ మోటర్ కార్ సంస్థ పేరుతో మోసం చేసినట్లు అప్పట్లోనే అభియోగాలు నమోదు అయ్యాయి.
ఫార్ములా వన్ రేసు పేరుతో అంజనారెడ్డి రూ.8కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ నేత రఘురామ కృష్ణమరాజు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో కేసు కూడా నమోదు అయింది. దీనిపై కోర్టు నోటీసులు ఇవ్వడంతో దర్యాప్తు కోసం కేసును సీసీఎస్ పోలీసులు మళ్లీ వెలుగులోకి తెచ్చారు. కాగా ఈ కేసుకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేయడంతో పాటు, నోటీసులు ఇచ్చినట్లు కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సీసీఎస్ పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేశామని, ఎవరినీ అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు.
కాగా ప్రముఖ వ్యాపారవేత్త చాముండేశ్వరినాథ్ మధ్యవర్తిత్వం ద్వారా అంజనారెడ్డి రూ.8 కోట్లు వసూలు చేశారు.అయితే రేసింగ్ నిర్వహణలో విఫలం అయినందున కొంత డబ్బును వెనక్కి ఇప్పించేందుకు హామీ ఇచ్చారని, అయితే ఆ డబ్బు చెల్లించడంలో అంజనారెడ్డి విఫలం కావడంతో కోర్టు ఆదేశాలతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment