అతి వేగం...దానికి తోడు మూల మలుపు.. | Four Engineering students killed in car accident running speed at 130 | Sakshi
Sakshi News home page

అతివేగమే నలుగురిని బలి తీసుకుంది.

Published Wed, May 1 2019 11:08 AM | Last Updated on Wed, May 1 2019 11:47 AM

Four Engineering students killed in car accident running speed at 130 - Sakshi

సాక్షి, యాదాద్రి : బొమ్మలరామారం మండలం మైసిరెడ్డి గ్రామ శివారులో గత రాత్రి జరిగిన ఘోర ప్రమాదానికి అతి వేగమే కారణమని స్పష్టమవుతోంది. దానికి తోడు మూల మలుపు. దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన మలుపు వద్ద బోల్తా పడినట్టు ఘటనా స్థలంలో దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రమాదంలో కారు తుక్కుతుక్కయింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థి పరిస్థితి విషమంగా వుంది. వారంతా ఇబ్రహీంపట్నం శ్రీ ఇందు ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులుగా భావిస్తున్నారు.

చదవండి...(రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థుల దుర్మరణం)

బొమ్మలరామారంలోని ఓ పెట్రోల్‌ బంక్‌ ఆవరణలో వున్న ఓ ప్రైవేటు గెస్ట్‌హౌజ్‌లో అందరూ కలిసి పార్టీ చేసుకున్నారని తెలుస్తోంది. అనంతరం అందరూ కలిసి హోండా కారులో హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా రాత్రి 10.30-10.45 గంటల మధ్య నాగినేనిపల్లి వెళ్లే మార్గంలో మూల మలుపు వద్ద ఘోరం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నల్లగొండకు చెందిన స్ఫూర్తి, చాదర్‌ఘాట్‌కు చెందిన ప్రణీత, చంపాపేట ప్రగతినగర్‌కు చెందిన చైతన్యలు అక్కడికక్కడే చనిపోయారు. ఇదే ఘటనలో కుంట్లూరుకు చెందిన మనీష్‌ రెడ్డి, చంపాపేట్‌కు చెందిన వినీత్‌ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా వినీత్‌ రెడ్డి తుది శ్వాస విడవగా మనీష్‌ రెడ్డి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. 

ఇక మృతి చెందినవారిలో ప్రణీత వాళ్ళ అమ్మ, నాన్న అమెరికాలో ఉంటున్నట్లు తెలిసింది. చాదర్‌ఘాట్‌లోని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటూ  చదువుకుంటుంది. స్ఫూర్తిరెడ్డి స్వస్థలం నల్గొండ. చైతన్య స్వస్థలం అవంగపట్నం, నారాయణ పేట్ మండలం, మహబూబ్ నగర్,  ప్రస్తుతం వీరు హైదరాబాద్‌ జిల్లలగూడా గాయత్రి నగర్‌లో ఉంటున్నారు.  వినీత్ రెడ్డి స్వస్థలం కోహెడ, అబ్దుల్లా పూర్ మెట్. ఈ ఘటనలో గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మనీష్ రెడ్డి స్వస్థలం హయత్ నగర్, కుంట్లూరు. మృతి చెందిన చైతన్య, స్ఫూర్తి, వినీత్, ప్రణీత మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందించనున్నారు. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బుధవారం ఉదయం భువనగిరి ఏరియా ఆస్పత్రికిని విద్యార్థుల మృతదేహాలను సందర్శించి, సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement