spurthi reddy
-
మన నగరానికి ఏమైంది?
మన నగరానికి ఏమైంది? ఓవైపు హత్యలు, మరోవైపు ఆత్మహత్యలు, ఇంకోవైపు ప్రమాదాలు... వెరసి కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నా యి. మంగళవారం రాత్రి, బుధవారం చోటుచేసుకున్న ఘటనలతో నగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. యాదాద్రి జిల్లాబొమ్మలరామారం మండలం మైసిరెడ్డి గ్రామ శివారులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సిటీకి చెందిన నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మరోవైపు తార్నాకలో నివసిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి రోహిత్ శామ్యూల్‌ను మౌలాలి రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గంలోని చెట్ల పొదల్లో బండరాయితో మోది గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయగా.. పహాడీషరీఫ్ ఠాణా పరిధి ఈద్గా ప్రాంతంలోని శ్మశాన వాటిక సమీపంలో గుర్తు తెలియని వ్యక్తిని ఆగంతకులు చంపేశారు. ఇక రామచంద్రపురం ఠాణా పరిధిలో కానిస్టేబుల్‌గా పనిచేసే మందరికా (32)ను హత్నూరు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేసే ప్రకాశ్ పటాన్చెరు సమీపంలోని ఓ పంట చేనులో గొంతునులిమి చంపి పెట్రోల్ పోసి తగలబెట్టాడు.ఇంకోవైపు అల్వాల్‌లో బీటెక్ విద్యార్థి సాయికిరణ్ ఆత్మహత్య చేసుకోగా.. సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్ పరిధిలోని ఆదయ్యనగర్‌లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. గుర్తు తెలియని యువకుడి దారుణ హత్య పహాడీషరీఫ్: గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జల్పల్లి ఈద్గా ప్రాంతంలోని శ్మశాన వాటిక సమీపంలో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన మున్సిపల్ సిబ్బంది బుధవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించడంతో పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ శంకర్, బాలాపూర్ అదనపు ఇన్స్పెక్టర్ సుధీర్ కృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా గుర్తు తెలియని యువకుడిని దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. వాదే ముస్తఫా బస్తీకి వెళ్లే రహదారిపై హత్య చేసి ఈడ్చుకెళ్లి గోతిలో పడేసి ఆనవాళ్లు గుర్తించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలు ఆధారాలు సేకరించాయి. ఎల్బీ నగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్, వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి మెడపై మూడు కత్తిపోట్లు, కుడి కన్ను దిగువన మరో గాయం ఉన్నట్లు గుర్తించారు. మృతుడు కుడి చేతిపై ‘మామ్’, ‘మమత’ పేర్లతో రెండు పచ్చబొట్లు ఉన్నాయి. మృతుడి కుడి చేతి బొటన వేలిని కోసి వేశారు. మృతుడి వయసు 25–30 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు. చెరువు వరకు వెళ్లిన డాగ్ స్క్వాడ్. పోలీస్ జాగిలం 200 మీటర్ల దూరం వెళ్లి జల్పల్లి చెరువు ఒడ్డున ఆగిపోయింది. మృతదేహం పడి ఉన్న ప్రాంతం నుంచి వాదే ముస్తఫా బస్తీ వైపు వెళుతూ....రహదారికి చాటుగా ఉన్న గుండ్ల వైపు ఉన్న నీటి వరకు జాగిలం వెళ్లడాన్ని బట్టి....నిందితులు డాగ్ స్క్వాడ్‌కు దొరకకుండా చెరువులో స్నానం చేసి వెళ్లి ఉండవచ్చునని భావిస్తున్నారు. -
కన్నవారికి...కడుపు కోత
సాక్షి,, సిటీబ్యూరో: యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మల రామారం, నాగినేనిపల్లి రహదారిలో మైసిరెడ్డి గ్రామ శివారు మూలమలుపు వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందడంతో నగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎల్బీనగర్ రాక్‌టౌన్ కాలనీకి చెందిన స్ఫూర్తిరెడ్డి, సరూర్‌నగర్, గాయత్రినగర్‌కు చెందిన చైతన్యరెడ్డి, చాదర్‌ఘాట్‌లో ఉంటున్న ప్రణీత, కుంట్లూరుకు చెందిన మనీష్‌రెడ్డి, చంపాపేట్‌కు చెందిన వినీత్‌రెడ్డి ఇబ్రహీంపట్నంలోని శ్రీ ఇందు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఈయర్ చదువుతున్నారు. మంగళవారం స్నేహితులందరూ కలిసి బొమ్మలరామారంలోని శ్రీబృందావన్ ఫామ్‌హౌస్‌లో జరిగిన వీడ్కోలు కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతుండగా అతివేగం కారణంగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో స్పూర్తిరెడ్డి, చైతన్యరెడ్డి, ప్రణీతరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, వినీత్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మనీష్‌రెడ్డి సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లడిల్లిన తండ్రి గుండె... మన్సూరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థిని మేరెడ్డి స్పూర్తిరెడ్డి (22) మృతితో రాక్‌టౌన్‌కాలనీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. నల్లగొండ జిల్లా, ఏపీ లింగోటం గ్రామానికి చెందిన నరేందర్‌రెడ్డి ఆరు నెలలుగా నాగోలు డివిజన్ పరిధి రాక్‌టౌన్‌కాలనీలోని నిర్వాణ ఎలైట్‌లో ఉంటూ కన్స్ట్రక్షన్ వ్యాపారం చేస్తున్నాడు. నరేందర్‌రెడ్డి, వాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె స్ఫూర్తిరెడ్డి శ్రీ ఇందు కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. స్ఫూర్తిరెడ్డి మృతిపై సమాచారం అందడంతో నరేందర్‌రెడ్డి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాడు. మృతదేహాన్ని భువనగిరి ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. న్యూజిలాండ్‌లో ఉంటున్న స్పూర్తిరెడ్డి మేనమామ దేవేందర్‌రెడ్డి వచ్చిన తర్వాత అంతక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. అప్పటివరకు మృతదేహాన్ని ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రిలో భద్రపరిచారు. నరేందర్‌రెడ్డికి బీపీ లెవల్స్ పడిపోతుండంటంతో బంధువులు, కుటుంబసభ్యులు అందోళనగా చెందుతున్నారు. ఆమె తల్లి వాణి కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం ఉదయం మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటాడనుకున్నాం... మీర్‌పేట: మహబూబ్‌నగర్ జిల్లా, దేవరకద్రకు చెందిన గుదిబండ రాంరెడ్డి, మాధవి దంపతులు 15 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చి జిల్లెలగూడ మున్సిపాలిటీ పరిధిలోని న్యూ గాయత్రినగర్ ఫేజ్–2లో ఉంటున్నారు. రాంరెడ్డి రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, తల్లి మాదవి కర్మన్‌ఘాట్ భూపేష్గుప్తానగర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. వారికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. బొమ్మలరామారం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వారి కుమారుడు చైతన్యరెడ్డి మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చేతికి అందివచ్చిన కుమారుడి ఆకస్మిక మృతితో వారు బోరున విలపించారు. ఉన్నత హోదాలో చూడాలనుకున్న కుమారుడిని విగతజీవిగా చూస్తానని అనుకోలేదని తల్లిదండ్రులు వాపోయారు. అంత్యక్రియల నిమిత్తం చైతన్యరెడ్డి భౌతికకాయాన్ని బుధవారం దేవరకద్రకు తీసుకెళ్లారు. అప్యాయంగా పలకరించేవాడు.. చంపాపేట సాయిరాంనగర్‌కు చెందిన వినీత్‌రెడ్డి తండ్రి విశ్వేశ్వరరెడ్డి అబిడ్స్‌లో ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. కుమారుడు వినిత్రెడ్డితో పాటు కుమార్తె కూడా ఉంది. వినీత్‌రెడ్డి మృతి వార్త తెలియడంతో డివిజన్ పరిధిలోని పలు కాలనీల వాసులు వారి ఇంటికి వచ్చి విశ్వేశ్వరరెడ్డి దంపతులను ఓదార్చారు. మృతుడు వినీత్‌రెడ్డి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించే వాడని, అతడి మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కళాశాలకు సెలవు... విద్యార్థుల మృతి నేపథ్యంలో బుధవారం శ్రీ ఇందు ఇంజనీరింగ్ కాలేజీకి సెలవు ప్రకటించారు. శ్రీ ఇందు కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు సరదాగా ఫామ్‌హౌస్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషయం తెలియడంతో కళాశాల యాజమాన్యం ఘటనాస్థలానికి చేరుకుంది. గత నెల 29న ఇంజినీరింగ్ ఫైనల్ పరీక్షలు రాసిన వీరిలో నలుగురు విద్యార్థులు మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. విద్యార్థుల మృతికి సంతాపంగా బుధవారం మౌనం పాటించి నివాళులర్పించారు. డబీర్‌పురాలో విషాద ఛాయలు డబీర్‌పురా: పాతబస్తీ డబీర్ పురా నూర్ఖాన్ బజార్‌కు చెందిన ప్రణీత(22) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ ప్రాంతం లో విషాధ చాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు అమెరికాలో ఉండగా, చిన్నతనం నుంచి నగరంలో అమ్మమ్మ రేణుక వద్ద ఉంటూ చదువుకుంటున్న ప్రణీత రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలియడంతో పోచమ్మ దేవాలయ పరిసరాల ప్రజలు కంట తడిపెట్టారు. ఇబ్రహీం పట్నంలోని శ్రీ ఇందూ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న ప్రణీత స్నేహితులతో కలిసి బొమ్మల రామారంలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌజ్ పార్టీ చేసుకొని తిరి గి వస్తుండగా మంగళవారం రాత్రి నాగినేనిపల్లి వెళ్లే మార్గంలో కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిదండ్రుల కోసం నిరీక్షణ... ప్రణీత మృతదేహాన్ని చాధర్‌ఘాట్‌లోని తుంబె ఆసుపత్రిలో ఉంచారు. అమెరికాలో ఉంటున్న తల్లిదండ్రులు వచ్చిన అనంతరం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. బీటెక్ పూర్తి చేయడంతో మంచి ఉద్యోగం సాధిస్తుందని ఆశించామని...అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
అతి వేగం...దానికి తోడు మూల మలుపు..
సాక్షి, యాదాద్రి : బొమ్మలరామారం మండలం మైసిరెడ్డి గ్రామ శివారులో గత రాత్రి జరిగిన ఘోర ప్రమాదానికి అతి వేగమే కారణమని స్పష్టమవుతోంది. దానికి తోడు మూల మలుపు. దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన మలుపు వద్ద బోల్తా పడినట్టు ఘటనా స్థలంలో దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రమాదంలో కారు తుక్కుతుక్కయింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థి పరిస్థితి విషమంగా వుంది. వారంతా ఇబ్రహీంపట్నం శ్రీ ఇందు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులుగా భావిస్తున్నారు. చదవండి...(రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థుల దుర్మరణం) బొమ్మలరామారంలోని ఓ పెట్రోల్ బంక్ ఆవరణలో వున్న ఓ ప్రైవేటు గెస్ట్‌హౌజ్‌లో అందరూ కలిసి పార్టీ చేసుకున్నారని తెలుస్తోంది. అనంతరం అందరూ కలిసి హోండా కారులో హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా రాత్రి 10.30-10.45 గంటల మధ్య నాగినేనిపల్లి వెళ్లే మార్గంలో మూల మలుపు వద్ద ఘోరం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నల్లగొండకు చెందిన స్ఫూర్తి, చాదర్‌ఘాట్‌కు చెందిన ప్రణీత, చంపాపేట ప్రగతినగర్‌కు చెందిన చైతన్యలు అక్కడికక్కడే చనిపోయారు. ఇదే ఘటనలో కుంట్లూరుకు చెందిన మనీష్ రెడ్డి, చంపాపేట్‌కు చెందిన వినీత్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా వినీత్ రెడ్డి తుది శ్వాస విడవగా మనీష్ రెడ్డి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ఇక మృతి చెందినవారిలో ప్రణీత వాళ్ళ అమ్మ, నాన్న అమెరికాలో ఉంటున్నట్లు తెలిసింది. చాదర్‌ఘాట్‌లోని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటూ చదువుకుంటుంది. స్ఫూర్తిరెడ్డి స్వస్థలం నల్గొండ. చైతన్య స్వస్థలం అవంగపట్నం, నారాయణ పేట్ మండలం, మహబూబ్ నగర్, ప్రస్తుతం వీరు హైదరాబాద్ జిల్లలగూడా గాయత్రి నగర్లో ఉంటున్నారు. వినీత్ రెడ్డి స్వస్థలం కోహెడ, అబ్దుల్లా పూర్ మెట్. ఈ ఘటనలో గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మనీష్ రెడ్డి స్వస్థలం హయత్ నగర్, కుంట్లూరు. మృతి చెందిన చైతన్య, స్ఫూర్తి, వినీత్, ప్రణీత మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందించనున్నారు. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం ఉదయం భువనగిరి ఏరియా ఆస్పత్రికిని విద్యార్థుల మృతదేహాలను సందర్శించి, సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. -
రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో రెండో స్థానం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్రస్థాయి అండర్–7 చెస్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణి స్ఫూర్తిరెడ్డి రెండోస్థానంలో నిలిచిందని జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి రవిరాజు, కోచ్ జాకీర్‌హుస్సేన్ తెలిపారు. ఈ నెల 24 నుంచి 26 వరకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన 31వ రాష్ట్రస్థాయి పోటీల్లో విశాఖ క్రీడాకారిణి 5.5 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా స్ఫూర్తిరెడ్డి 5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిందన్నారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక ఇండోర్ స్టేడియంలో డీఎస్డీఓ బాషామోహిద్దీన్ క్రీడాకారిణిని అభినందించారు. జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి రవిరాజు మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీలు సెప్టెంబర్ మొదటి వారంలో విజయవాడలో జరుగుతాయన్నారు.