స్ఫూర్తిరెడ్డి (ఫైల్) వినిత్‌రెడ్డి (ఫైల్) చైతన్యరెడ్డి (ఫైల్) ప్రణీత (ఫైల్)
సాక్షి,, సిటీబ్యూరో: యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మల రామారం, నాగినేనిపల్లి రహదారిలో మైసిరెడ్డి గ్రామ శివారు మూలమలుపు వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందడంతో నగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎల్‌బీనగర్ రాక్‌టౌన్ కాలనీకి చెందిన స్ఫూర్తిరెడ్డి, సరూర్‌నగర్, గాయత్రినగర్‌కు చెందిన చైతన్యరెడ్డి, చాదర్‌ఘాట్‌లో ఉంటున్న ప్రణీత, కుంట్లూరుకు చెందిన మనీష్‌రెడ్డి, చంపాపేట్‌కు చెందిన వినీత్‌రెడ్డి ఇబ్రహీంపట్నంలోని శ్రీ ఇందు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఈయర్ చదువుతున్నారు. మంగళవారం స్నేహితులందరూ కలిసి బొమ్మలరామారంలోని శ్రీబృందావన్ ఫామ్‌హౌస్‌లో జరిగిన వీడ్కోలు కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతుండగా అతివేగం కారణంగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో స్పూర్తిరెడ్డి, చైతన్యరెడ్డి, ప్రణీతరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, వినీత్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మనీష్‌రెడ్డి సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
తల్లడిల్లిన తండ్రి గుండె...
మన్సూరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థిని మేరెడ్డి స్పూర్తిరెడ్డి (22) మృతితో రాక్‌టౌన్‌కాలనీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. నల్లగొండ జిల్లా, ఏపీ లింగోటం గ్రామానికి చెందిన నరేందర్‌రెడ్డి ఆరు నెలలుగా నాగోలు డివిజన్ పరిధి రాక్‌టౌన్‌కాలనీలోని నిర్వాణ ఎలైట్‌లో ఉంటూ కన్‌స్ట్రక్షన్ వ్యాపారం చేస్తున్నాడు. నరేందర్‌రెడ్డి, వాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె స్ఫూర్తిరెడ్డి శ్రీ ఇందు కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. స్ఫూర్తిరెడ్డి మృతిపై సమాచారం అందడంతో నరేందర్‌రెడ్డి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాడు. మృతదేహాన్ని భువనగిరి ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. న్యూజిలాండ్‌లో ఉంటున్న స్పూర్తిరెడ్డి మేనమామ దేవేందర్‌రెడ్డి వచ్చిన తర్వాత అంతక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. అప్పటివరకు మృతదేహాన్ని ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆసుపత్రిలో భద్రపరిచారు. నరేందర్‌రెడ్డికి బీపీ లెవల్స్ పడిపోతుండంటంతో బంధువులు, కుటుంబసభ్యులు అందోళనగా చెందుతున్నారు. ఆమె తల్లి వాణి కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం ఉదయం మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అండగా ఉంటాడనుకున్నాం...
మీర్‌పేట: మహబూబ్‌నగర్ జిల్లా, దేవరకద్రకు చెందిన గుదిబండ రాంరెడ్డి, మాధవి దంపతులు 15 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చి జిల్లెలగూడ మున్సిపాలిటీ పరిధిలోని న్యూ గాయత్రినగర్ ఫేజ్–2లో ఉంటున్నారు. రాంరెడ్డి రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, తల్లి మాదవి కర్మన్‌ఘాట్ భూపేష్‌గుప్తానగర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. వారికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. బొమ్మలరామారం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వారి కుమారుడు చైతన్యరెడ్డి మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చేతికి అందివచ్చిన కుమారుడి ఆకస్మిక మృతితో వారు బోరున విలపించారు. ఉన్నత హోదాలో చూడాలనుకున్న కుమారుడిని విగతజీవిగా చూస్తానని అనుకోలేదని తల్లిదండ్రులు వాపోయారు. అంత్యక్రియల నిమిత్తం చైతన్యరెడ్డి భౌతికకాయాన్ని బుధవారం దేవరకద్రకు తీసుకెళ్లారు.
అప్యాయంగా పలకరించేవాడు..
చంపాపేట సాయిరాంనగర్‌కు చెందిన వినీత్‌రెడ్డి తండ్రి విశ్వేశ్వరరెడ్డి అబిడ్స్‌లో ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. కుమారుడు వినిత్‌రెడ్డితో పాటు కుమార్తె కూడా ఉంది. వినీత్‌రెడ్డి మృతి వార్త తెలియడంతో డివిజన్ పరిధిలోని పలు కాలనీల వాసులు వారి ఇంటికి వచ్చి విశ్వేశ్వరరెడ్డి దంపతులను ఓదార్చారు. మృతుడు వినీత్‌రెడ్డి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించే వాడని, అతడి మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
కళాశాలకు సెలవు...
విద్యార్థుల మృతి నేపథ్యంలో బుధవారం శ్రీ ఇందు ఇంజనీరింగ్ కాలేజీకి సెలవు ప్రకటించారు. శ్రీ ఇందు కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు సరదాగా ఫామ్‌హౌస్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషయం తెలియడంతో కళాశాల యాజమాన్యం ఘటనాస్థలానికి చేరుకుంది. గత నెల 29న ఇంజినీరింగ్ ఫైనల్ పరీక్షలు రాసిన వీరిలో నలుగురు విద్యార్థులు మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. విద్యార్థుల మృతికి సంతాపంగా బుధవారం మౌనం పాటించి నివాళులర్పించారు.
డబీర్‌పురాలో విషాద ఛాయలు
డబీర్‌పురా: పాతబస్తీ డబీర్ పురా నూర్‌ఖాన్ బజార్‌కు చెందిన ప్రణీత(22) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ ప్రాంతం లో విషాధ చాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు అమెరికాలో ఉండగా, చిన్నతనం నుంచి నగరంలో అమ్మమ్మ రేణుక వద్ద ఉంటూ చదువుకుంటున్న ప్రణీత రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలియడంతో పోచమ్మ దేవాలయ పరిసరాల ప్రజలు కంట తడిపెట్టారు. ఇబ్రహీం పట్నంలోని శ్రీ ఇందూ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న ప్రణీత స్నేహితులతో కలిసి బొమ్మల రామారంలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌజ్ పార్టీ చేసుకొని తిరి గి వస్తుండగా మంగళవారం రాత్రి నాగినేనిపల్లి వెళ్లే మార్గంలో కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
తల్లిదండ్రుల కోసం నిరీక్షణ...
ప్రణీత మృతదేహాన్ని చాధర్‌ఘాట్‌లోని తుంబె ఆసుపత్రిలో ఉంచారు. అమెరికాలో ఉంటున్న తల్లిదండ్రులు వచ్చిన అనంతరం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. బీటెక్ పూర్తి చేయడంతో మంచి ఉద్యోగం సాధిస్తుందని ఆశించామని...అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment