సాక్షి, హైదరాబాద్: నగర పోలీసులు ఓ రోజు రాత్రి సిటీ సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అటుగా వచ్చిన వ్యక్తి కదలికలపై వారికి అనుమానం కలిగి ‘లైవ్ స్కానర్’ద్వారా పరీక్షించారు. ఎలాంటి ‘అలెర్ట్’ రాకపోవడంతో వదిలేశారు. అతడు పొరుగు రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్‌గా ఉండటంతో ఆ రాష్ట్ర పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. ఇలాంటి ఆస్కారం నేరగాళ్లకు ఇవ్వకుండా ఉండేందుకు, మిస్సింగ్, గుర్తుతెలియని మృతదేహాలకు సంబంధించిన కేసులను కొలిక్కి తెచ్చేందుకు రాష్ట్ర పోలీసు విభాగం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తోంది. తమ అధికారిక యాప్ ‘టీఎస్ కాప్’లో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం(ఎఫ్‌ఆర్‌ఎస్) పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 2012 నుంచి రాష్ట్రంలో అరెస్టైన నేరగాళ్లల్లో 50 వేల మంది ఫొటోలతో ఏర్పాటు చేసిన డేటాబేస్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న వాంటెడ్ లిస్ట్‌తో దీనిని అనుసంధానించారు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ లింకును మరో వారం రోజుల్లో డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు.
లైవ్ స్కానర్లతో...
ఇప్పటికే పోలీసు విభాగం అనేక పోలీసుస్టేషన్లకు లైవ్ స్కానర్లు అందించింది. ఇవి అనునిత్యం గస్తీ పోలీసుల వద్ద అందుబాటులో ఉంటున్నాయి. రాష్ట్రంలో అరెస్టైన, వాంటెడ్‌గా ఉన్న పాత నేరగాళ్ల వేలిముద్రలను డిజిటలైజ్ చేసిన ఫింగర్ ప్రింట్స్ బ్యూరో వాటిని ఓ సర్వర్‌లో నిక్షిప్తం చేసింది. ఈ డేటాబేస్‌ను యాప్ రూపంలో సిబ్బంది స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి కనెక్ట్ చేసుకోవడానికి, వేలిముద్రలు తీసుకోవడానికి అనువైన అత్యాధునికమైన స్కానర్లను సైతం పంపిణీ చేశారు. సిబ్బంది తనిఖీ సమయాల్లో అనుమానితుల వేలిముద్రను లైవ్ స్కానర్ ద్వారా సేకరిస్తారు. దీనిని పూర్తిస్థాయిలో సర్వర్ సెర్చ్ చేసి గతంలో ఇతడిపై కేసులు ఉన్నాయా.. ఎక్కడైనా వాంటెడ్‌గా ఉన్నాడా.. అనే విషయం గుర్తిం చి అప్పటికప్పుడే పోలీసులను అప్రమత్తం చేస్తుంది. లైవ్ స్కానర్ డేటాబేస్‌లో బయటి రాష్ట్రాలకు చెందినవారి వేలిముద్రలు ఉండవు. మరోపక్క అవతలి వ్యక్తి తన వేలిముద్రలను ఇవ్వడానికి నిరాకరిస్తే బలవంతం చేసే ఆస్కారం తక్కువ.
ఫొటో తీస్తే సరి...
ఈ ఇబ్బందుల్ని అధిగమించడానికి తనిఖీ సిబ్బంది యాప్‌లోని ఈ లింకులోకి వెళ్లి అనుమానిత వ్యక్తిని ఫొటో తీస్తే సరిపోతుంది. డేటాబేస్‌లోని నేరగాళ్ల ఫొటోలను క్షణాల్లో సెర్చ్ చేసి గుర్తిస్తుంది. గతంలో చిన్న, చిన్న నేరాలతో పోలీసు రికార్డులకు ఎక్కిన, కేసులు వీగిపోయినవారికి ఈ డేటాబేస్‌తో ఎలాంటి ఇబ్బంది ఉండదు. 90 శాతం కంటే ఎక్కువ పోలికలు సరిపోయినవారిని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తారు.
మరికొన్ని అంశాలు సైతం...
ఎఫ్‌ఆర్‌ఎస్ వ్యవస్థకు మరో మూడు అంశాలనూ చేరుస్తున్నారు. అంతర్జాతీయ పోలీసు ఆర్గనైజేషన్ (ఇంటర్‌పోల్), జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ), కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సహా అనేక విభాగాలు తమకు వాంటెడ్‌గా ఉన్న వ్యక్తుల వివరాలను ఫొటోలతో సహా అధికారిక వెబ్‌సైట్లలో పొందుపరుస్తున్నాయి. ఈ కేటగిరీల నుంచి సేకరించిన ఫొటోలనూ సర్వర్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. వీటికి తోడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అదృశ్యమైనవారి ఫొటోలను డేటాబేస్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. ఎక్కడైనా గుర్తుతెలియని మృతదేహం లభించినా, తాను ఎవరో చెప్పుకోలేని స్థితిలో దొరికినా సెర్చ్ చేస్తారు. ఆయా వ్యక్తులు ఎక్కడైనా అదృశ్యమైన వారు అయితే ఆ వివరాలను సర్వర్ గుర్తించి వెంటనే అప్రమత్తం చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment