ఉరి శిక్ష ఖరారు.. అమలు ఎలా? | Galos Hang men Posts Empty In Telangana | Sakshi
Sakshi News home page

ఉరి శిక్ష ఖరారు.. అమలు ఎలా?

Published Tue, Sep 11 2018 9:14 AM | Last Updated on Fri, Sep 21 2018 10:18 AM

Galos Hang men Posts Empty In Telangana - Sakshi

2013 ఫిబ్రవరి 23న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చి సెంటర్, 107 బస్టాప్‌లలో పేలుళ్లకు పాల్పడిన ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రవాదులు ఐదుగురికి 2016 డిసెంబర్‌ 19న...

దిల్‌సుఖ్‌నగర్, లుంబినీ పార్కు బాంబు పేలుళ్ల కేసుల్లో ఉగ్రవాదులకు న్యాయ స్థానం ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. మరో మూడు దశలు దాటితే..మొత్తం ఏడుగురు ఉగ్రవాదులు ఉరికంబం ఎక్కాల్సిందే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే...రాష్ట్రంలో ఇప్పుడు ఏ జైలులోనూ గ్యాలోస్‌ (ఉరికంబం ఉండే ప్రాంతం సాంకేతిక నామం) లేవు. తలారులు(హ్యాంగ్‌మెన్‌) లేరు. ఈ నేపథ్యంలో మొత్తం ఏడుగురు ఐఎం ఉగ్రవాదులకు మరణశిక్ష అమలు చేయడం ఖరారైతే... అది ఎక్కడన్నది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఆఖరి ఉరి శిక్షను 38 ఏళ్ల క్రితం ముషీరాబాద్‌లోని సెంట్రల్‌ జైలులో అమలు చేశారు. ముషీరాబాద్‌ సెంట్రల్‌ జైలునే కొన్నేళ్ల క్రితం చర్లపల్లికి మార్చారు. అక్కడ జైలు నిర్మిస్తున్నప్పుడు గ్యాలోస్‌ కోసం ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసినప్పటికీ... ఉరికంబం ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉరికంబం ఉన్న జైలు కేవలం రాజమండ్రి సెంట్రల్‌ జైలు మాత్రమే. ఐఎం ఉగ్రవాదులకు ఉరిశిక్ష ఖరారైతే చర్లపల్లిలో గ్యాలోస్‌ను ఏర్పాటు చేయడమో లేక రాజమండ్రిలో అమలు చేయించడమో మాత్రమే మార్గాలు. కాగా లుంబినీ పార్కులో పేలుడుకు పాల్పడిన అనీఖ్, అక్బర్‌లకు సోమవారం కోర్టు ఉరిశిక్ష విధించగా...దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడిన ఐదుగురు ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రవాదులకు 2016 డిసెంబర్‌ 19న కోర్టు ఉరి శిక్ష విధించింది. ఇవి అమలు కావాల్సి ఉంది.  2007 ఆగస్టు 25న లుంబినీ పార్క్‌లో పేలుడుకు పాల్పడడంతో పాటు దిల్‌సుఖ్‌నగర్‌ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జ్‌ వద్ద బాంబు పెట్టిన ఇద్దరు ఐఎం ఉగ్రవాదులకు సోమవారం...  
 
క్యాపిటల్‌ పనిష్మెంట్‌గా పరిగణించే మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానాలు తీర్పు చెప్పాయి. మరో మూడు దశలు దాటితే ఈ ముష్కరులకు విధించిన శిక్ష ఖరారైనట్లే! ఇక్కడ తెరపైకి వచ్చే ఆసక్తికర అంశం ఏమిటంటే... ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ జైలులోనూ గ్యాలోస్‌ (ఉరికంబం ఉండే ప్రాంతం సాంకేతిక నామం) లేవు. తలారులుగా పిలిచే హ్యాంగ్‌మెన్‌ పోస్టులు అసలే లేవు. ఈ నేపథ్యంలో మొత్తం ఏడుగురు ఐఎం ఉగ్రవాదులకు మరణశిక్ష అమలు చేయడం ఖరారైతే... అది ఎక్కడన్నది ఆసక్తికరంగా మారింది.

సాక్షి, సిటీబ్యూరో  :సిటీలో పేలుళ్లకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం ఏడుగురు ఉగ్రవాదులకు ట్రయల్‌ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ తీర్పును దోషులు హైకోర్టులో సవాల్‌ చేసే ఆస్కారం ఉంది. ఇప్పటికే డిఫెన్స్‌ లాయర్లు ఈ మేరకు ప్రకటించారు. దిల్‌సుఖ్‌నగర్‌ కేసుల్లో ఆ ప్రాసెస్‌ కూడా మొదలైంది. ఇలా జరగని పక్షంలో శిక్ష విధించిన న్యాయస్థానమే ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తుంది. అప్పుడు ఉన్నత న్యాయస్థానం ‘రిఫర్డ్‌ ట్రయల్‌’గా పిలిచే విధానంలో తనంతట తానుగానే విచారణ చేయొచ్చు. హైకోర్టు సైతం ట్రయల్‌ కోర్టు విధించిన శిక్షలను సమర్థిస్తే... దోషులు పిటిషన్‌ దాఖలు చేయడం ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. సుప్రీంలోనూ వీరికి చుక్కెదురైతే క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసుకోవచ్చు. దోషులో లేదా వారి తరఫు వారో ఈ పిటిషన్లను దాఖలు చేయడానికి ఆస్కారం ఉంది. రాష్ట్రపతి సైతం క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరిస్తే దోషులకు విధించిన మరణశిక్ష ఖరారైనట్లే. దీంతో శిక్ష విధించిన న్యాయస్థానం పరిధిలోకి వచ్చే రాష్ట్రంలో దీన్ని అమలు చేయడానికి సన్నాహాలు ప్రారంభమవుతాయి. కానీ మరి రాష్ట్రంలో ఒక్క జైలులోనూ ఉరికంబం లేదు.  

38 ఏళ్ల క్రితం చివరిసారి... 
ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఆఖరి ఉరి శిక్షను 38 ఏళ్ల క్రితం ముషీరాబాద్‌లోని సెంట్రల్‌ జైలులో అమలు చేశారు. 1978లో భారత వైమానిక దళంలో పనిచేసిన ఎయిర్‌మెన్‌ రామవతార్‌ యాదవ్‌పై హత్య కేసు నిరూపితం కావడం, మరణశిక్ష ఖరారు కావడంతో ఉరి తీశారు. అప్పటి జైల్‌ సూపరింటెండెంట్‌ సుబ్బారెడ్డి పర్యవేక్షణలో శిక్ష అమలు చేశారు. రామవతార్‌ ఓ వివాహితతో సంబంధం కొనసాగించాడు. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న సందర్భంలో సదరు వివాహిత కుమారుడు చూశాడు. తమ గుట్టురట్టవుతుందనే ఉద్దేశంతో ఇద్దరూ కలిసి ఆ బాలుడిని చంపేశారు. మృతదేహాన్ని హుస్సేన్‌సాగర్‌లో పడేసేందుకు గన్నీ బ్యాగ్‌లో కట్టి సైకిల్‌పై తీసుకొస్తున్న రామవతార్‌ ఓ కానిస్టేబుల్‌కు ఎదురుపడటంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం రామవతార్‌కు ఉరి, వివాహితకు జీవితఖైదు విధించింది.  చంచల్‌గూడ జైల్లో శిక్ష అనుభవించిన ఆ వివాహిత రామవతార్‌ యాదవ్‌ను ఉరి తీసిన విషయం తెలుసుకొని ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది.  

జైలు మారడంతో...
ముషీరాబాద్‌ సెంట్రల్‌ జైలునే కొన్నేళ్ల క్రితం చర్లపల్లికి మార్చారు. అక్కడ జైలు నిర్మిస్తున్నప్పుడు గ్యాలోస్‌ కోసం ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసినప్పటికీ... ఉరికంబం ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉరికంబం ఉన్న జైలు కేవలం రాజమండ్రి సెంట్రల్‌ జైలు మాత్రమే. మరోపక్క తెలంగాణ జైళ్ల శాఖలో కొన్ని దశాబ్దాలుగా హ్యాంగ్‌మెన్‌గా పిలిచే తలారీ పోస్టులు లేవు. ఏళ్లుగా ఉరిశిక్ష అమలు లేకపోవడంతో కొందరు హెడ్‌–వార్డర్స్‌కే ఈ అంశంలో ప్రాథమిక శిక్షణ ఇస్తున్నారు. అవసరమైనప్పుడు వీరిలో ముందుకొచ్చిన వారికి ప్రత్యేక అలవెన్స్‌ ఇవ్వడం ద్వారా దోషుల్ని ఉరితీయించవచ్చని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా ఓ రాష్ట్రంలోని ఓ జైలులో ఉరికంబం లేకపోతే అదే రాష్ట్రంలోని మరో జైలులో దీన్ని అమలు చేసే ఆస్కారం ఉంది. అయితే తెలంగాణలోని ఏ జైలులోనూ గ్యాలోస్‌ లేని నేపథ్యంలో ఐఎం ఉగ్రవాదులకు ఉరిశిక్ష ఖరారైతే చర్లపల్లిలో గ్యాలోస్‌ను ఏర్పాటు చేయడమో లేక రాజమండ్రిలో అమలు చేయించడమో మాత్రమే మార్గాలు. అయితే రాజమండ్రిలో ఉరిశిక్ష అమలు చేస్తే అది ఆంధ్రప్రదేశ్‌ సర్కారు అమలు చేసినట్లవుతుందని, ఈ నేపథ్యంలో గ్యాలోస్‌ ఏర్పాటుకే ప్రాధాన్యం ఉంటుందని పేర్కొంటున్నారు. దీనికి ప్రత్యేకించి ఎలాంటి అనుమతులు లేని నేపథ్యంలో అవసరమైతే రెండుమూడు రోజుల్లోనే ఏర్పాటు చేయవచ్చని స్పష్టం చేస్తున్నారు.  

రాజమండ్రిలో 40 ఏళ్ల క్రితం..
రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఆఖరుసారిగా 1976 ఫిబ్రవరిలో ఉరిశిక్ష అమలు చేశారు. ఓ హత్య కేసులో దోషిగా తేలిన అనంతపురం జిల్లాకు చెందిన నంబి కిష్టప్పను ఉరి తీశారు. ఆ తర్వాత కొందరు ఖైదీలను ఉరిశిక్ష అమలు కోసం ఈ జైలుకు తరలించినా అవి అమలు కాలేదు. 1875 నుంచి గ్యాలోస్‌ కలిగి ఉండి, ఇప్పటికీ కొనసాగుతున్న కేంద్ర కారాగారం రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌ మాత్రమే. స్వాతంత్య్రానంతరం దేశవ్యాప్తంగా వివిధ కారాగారాల్లో మొత్తం 94 మందిని ఉరితీశారు. అత్యధికంగా 42 శిక్షల్ని రాజమండ్రి సెంట్రల్‌ జైల్లోనే అమలు చేశారు. క్యాపిటల్‌ పనిష్మెంట్‌గా పిలిచే ఉరిశిక్షను అమలు చేసే ముందు సదరు ఖైదీని ఆఖరి కోరిక ఏమిటని అడగడం అనవాయితీ. హత్య కేసులో ఉరిశిక్షకు గురైన కిష్టప్ప తన ఆఖరి కోరికగా లడ్డూ తింటానని కోరాడు. దీంతో జైలు అధికారులు ఉరితీయడానికి ముందు అతడికి లడ్డూలు అందించారు. రాజమండ్రి జైలు తలారీ ధర్మరాజు ఇతడిని ఉరితీశారు.  

ఆ ఇద్దరి శిక్షకు బ్రేక్‌...
1993 నాటి చిలకలూరిపేట బస్సు దహనం కేసులో నిందితులుగా ఉండి, దోషులుగా తేలిన విష్ణువర్ధన్‌రావు, చలపతిరావులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ శిక్ష ఖరారు కావడంతో అమలు కోసం ఇద్దరినీ 1997లో రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. 1999లో శిక్ష అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు ఉరి తీయాల్సి ఉండగా... సుప్రీంకోర్టు స్టే విధించడంతో తెల్లవారుజామున ఒంటిగంటకు రాజమండ్రి జైలు అధికారులకు ఫోన్‌ ద్వారా, 3గంటలకు అధికారికంగా ఉత్తర్వులు అందడంతో శిక్ష అమలు ఆగిపోయింది. ఆపై వీరికి పడిన శిక్ష జీవితఖైదుగా మారింది. విజయవాడలో జరిగిన శ్రీలక్ష్మి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మనోహర్‌కు కింది కోర్టు ఉరిశిక్ష వి«ధించడంతో 2004లో రాజమండ్రికి తరలించారు. హైకోర్టు ఈ శిక్షను జీవితఖైదుగా మార్చడంతో ఇతడిని నెల్లూరు సెంట్రల్‌ జైలుకు పంపారు. 2011లో ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన బి.వెంకటేశ్వరరావు, కె.శ్రీనివాసదోర విషయంలోనూ ఇలానే జరిగింది.  

భూగర్భంలో ఉరికంబం  
రాజమండ్రి సెంట్రల్‌ జైలులోని గ్యాలోస్‌ 1980 వరకు ప్రధాన ద్వారం పక్కనే బహిరంగ ప్రదేశంలో ఉండేది. ఖైదీని జైలు గది నుంచి బయటకు తీసుకువచ్చి, ఉరిశిక్ష అమలు చేసిన తర్వాత మృతదేహాన్ని ఉరికంబం కింద ఉండే ప్రత్యేక చాంబర్‌లో దింపుతారు. ఇక్కడి నుంచి నేరుగా ట్రే ద్వారా సంబంధీకులకు అప్పగించాలని, మృతదేహాన్ని జైలు మీదుగా బయటకు తీసుకురాకూడదనే ఉద్దేశంతో ఇలా ఏర్పాటు చేశారు. ఆ తరువాత దీన్ని అడ్మినిస్ట్రేటివ్‌ భవనం పరిసరాల్లోకి మార్చారు. మూడేళ్ల క్రితం ఈ గ్యాలోస్‌ ఉన్న ప్రాంతంలోనే రూ.7.5 కోట్లతో కొత్తగా పరిపాలనా భవనాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలోనే గ్యాలోస్‌ను అది ఉన్న ప్రాంతం నుంచి మార్చడం ఇష్టం లేక భవనం కింద భూగర్భంలో ఏర్పాటు చేశారు. ఈ తరహా గ్యాలోస్‌ కలిగిన కారాగారం దేశంలో మరోటి లేదు. నిర్మాణాలు ఎన్ని మారినా ఇప్పటికీ బ్రిటిష్‌ కాలం నాటి ఇనుప ఉరికంబాన్నే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. తరచూ దీనికి ఆయిలింగ్‌ చేస్తూ పనితీరు దెబ్బతినకుండా జైలు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు..
అతడు ఊహాచిత్రాలు గీయడంలో దిట్ట
మూడు బాంబుల టైమర్లుగా 'సమయ్‌' వాచీలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement