నిర్వీర్యం చేసిన బాంబ్‌లోని టైమర్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని గోకుల్‌చాట్, లుంబినీపార్క్, ఆపై దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చి సెంటర్, 107 బస్టాప్‌లతో పాటు దేశ వ్యాప్తంగా 2005 ఫిబ్రవరి నుంచి 11 విధ్వంసాలకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సంస్థ వినియోగించిన బాంబుల్లో టైమర్లుగా ‘సమయ్’ వాచీలనే వాడారు. వేర్వేరు సమయాల్లో తయారు చేసిన బాంబుల్లోనూ ఒకే తరహా వాచీలనే ఎందుకు వాడారనే మిస్టరీని 2007 నాటి జంట పేలుళ్ల కేసులను దర్యాప్తు చేసిన ఆక్టోపస్ అధికారులు ఛేదించారు. సదరు కంపెనీ తయారు చేసే వాచీల్లో ఉన్న స్పేస్ (ఖాళీ)తో పాటు ప్రత్యేకమైన అలారం కనెక్షన్ కారణంగానే దీనిని ఎంపిక చేసుకున్నట్లు గుర్తించారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు నగరంలో చోటు చేసుకున్న జంట పేలుళ్ల నుంచి ఢిల్లీ పేలుళ్ల వరకు ఒకే తరహా బాంబులను వినియోగించారు. ‘వీ’ ఆకారంలో ఉండే ఈ బాంబులను సాంకేతిక పరిభాషలో ‘షేప్డ్ బాంబ్స్’గా పిలుస్తారు. అమ్మోనియం నైట్రేట్ సమ్మిళిత పేలుడు పదార్థమైన ‘నియోజల్–90’ని వీటిలో వాడారు. బాంబు పేలిన వెంటనే అపరిమిత వేగంతో దూసుకుపోయి ఎదుటి వారి శరీరాలను ఛిద్రం చేసేందుకు సైకిల్ చెర్రాలను స్లి్పంటర్స్‌గా వినియోగించారు. పేలుడు పదార్థాన్ని ఎలక్ట్రిక్ డిటోనేటర్ సాయంతో పేల్చారు.
ఈ డిటోనేటర్‌కు ప్రేరణ అందించేందుకు 9 వోల్టుల బ్యాటరీని టైమర్‌తో కలిపి ఉపయోగించారు. బాంబు ఫలానా సమయానికి పేలాలని సెట్ చేసేందుకు టైమర్ అవసరమవుతుంది. ఐఎం సంస్థ దేశ వ్యాప్తంగా జరిపిన అన్ని వరుస పేలుళ్లలోనూ టైమర్‌గా సమయ్ కంపెనీకి చెందిన వాచ్‌లనే ఏర్పాటు చేసింది. ఈ టైమర్ సర్క్యూట్‌ను ఆజామ్‌గఢ్‌కు చెందిన ‘సిమి’ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ ఆరిఫ్ బదర్ అలియాస్ లడ్డాన్ తయారు చేశాడు. పాకిస్తాన్‌లో ఉగ్రవాద శిక్షణ పొందిన ఆరిఫ్ ఆజామ్‌గఢ్‌లో ఓ ఎలక్ట్రానిక్ దుకాణం నిర్వహిస్తూ ఆ ముసుగులోనే టైమర్లను తయారు చేశాడు. అంతకు ముందు అజంతా, చైనా వాచీలతో చేసిన ప్రయోగాలు ఫలించలేదు. డిటోనేటర్లకు అవసరమైన ప్రేరణ అందించడానికి 9 వోల్టుల బ్యాటరీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిని ఉంచే ఖాళీ అజంతా, చైనా వాచీల్లో లేదు. ఆ ఖాళీతో పాటు అలారం కనెక్షన్‌లో కట్ సౌకర్యం ఉన్న కారణంగానే సమయ్ వాచీలను ఎంపిక చేసుకుని టైమర్ సర్యూ్కట్స్ రూపొందించాడు.
మరోపక్క బాంబు పేలాల్సిన సమయాన్ని అలారం ద్వారా నిర్ణయిస్తారు. ఆ సమయం వచ్చిన వెంటనే అలారం మోగడానికి అనువుగా బ్యాటరీ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ విద్యుత్‌ను 9 వోల్టుల బ్యాటరీకి సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందుకు అనువుగా సమయ్ వాచీల్లో అలారం కనెక్షన్‌కు కట్ ఉంటుంది. అనుకున్న ప్రకారం బాంబు పేలడానికి ఈ కనెక్షన్ ఎంతో కీలకం. ఇన్ని అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే అతను ప్రత్యేకంగా వీటినే ఎంపిక చేసుకున్నాడని ఆక్టోపస్ అధికారులు నిర్ధారించారు. ఈ సర్క్యూట్‌కు పాజిటివ్ కనెక్షన్లు (+)ఇవ్వడానికి ఎరుపు, పసుపు, బూడిద రంగు వైర్లను, నెగెటివ్ కనెక్షన్ (–) ఇచ్చేందుకు తెలుపు, నలుపు వైర్లను వాడారని నిర్ధారించారు. ఈ రెండు కనెక్షన్లనూ బాంబును అసెంబుల్ చేసే వ్యక్తి కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే అన్ని ప్రాంతాల్లో ఇవే రంగులను వినియోగించారు. ఐఎం టైమర్ల గుట్టును పసిగట్టడానికి ఆక్టోపస్ అధికారులు అప్పట్లో భారీ అధ్యయనమే చేయాల్సి వచ్చింది. గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌లతో పాటు దిల్‌సుఖ్‌నగర్‌లోని ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్ వద్ద పెట్టిన బాంబులను రియాజ్ భత్కల్ తయారు చేశాడు. వీటికి టైమర్లను కనెక్ట్ చేసింది మాత్రం సాదిఖ్ షేక్. అప్పట్లో పుణె క్యాంప్ ఏరియాలో ఉన్న ఇతడి వద్దకు వాచీలను తీసుకువెళ్లిన రియాజ్ కనెక్ట్ చేసే విధానాన్ని తెలుసుకున్నాడు. ఈ విషయంతో పాటు మరికొన్ని అంశాలూ ఆధారాలతో నిరూపితం కాని నేపథ్యంలో సాదిఖ్‌పై అభియోగాలు వీగిపోయాయి.
కొంత ఊరట...
ప్రభుత్వ వైఫల్యం కారణంగానే గోకుల్‌చాట్ కేసులో మిగతా నిందితులు తప్పించుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత కొందరినైనా శిక్షించడం ఊరట కలిగిస్తోంది. నా సోదరి మృతి చెంది 11 ఏళ్లు గడుస్తున్నా తాను పనిచేస్తున్న ఆర్టీసీ నుంచి ఎలాంటి సహాయం, పరిహారం అందలేదు. ఇప్పటికైనా ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలి. – మన్నె చంద్రకళ (గోకుల్‌చాట్ మృతురాలు సుశీల సోదరి)
Comments
Please login to add a commentAdd a comment