ఐఎం ఉగ్రవాదులకు కలిసొచ్చిన చేపల వేట విధానం | IM Terrorists Bombs Buy From Karnataka | Sakshi
Sakshi News home page

వేట.. తూటా

Published Tue, Sep 11 2018 10:08 AM | Last Updated on Tue, Sep 11 2018 10:08 AM

IM Terrorists Bombs Buy From Karnataka - Sakshi

దిల్‌సుఖ్‌నగర్‌లో దొరికిన పేలని బాంబు లోపలి స్లర్రీ (ఫైల్‌)

సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటకలోని తీర ప్రాంతాల మత్స్యకారులు చేపల వేటకు అవలంభించే విధానమే ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రవాదులకు కలిసొచ్చింది. గోకుల్‌చాట్, లుంబినీపార్క్, పుణె, ముంబై, బెంగళూర్‌లలో పేలుళ్లకూ బాంబులు తయారు చేయడానికి ముష్కరులు ‘మీన్‌ తూటా’ ల నుంచే పేలుడు పదార్థం సేకరించారు. ఐఎం మాస్టర్‌ మైండ్‌ రియాజ్‌ భత్కల్‌ వృత్తిరీత్యా సివిల్‌ కాంట్రాక్టర్‌. తనకున్న పరిచయాలతో తొలినాళ్లలో అమ్మోనియం నైట్రేట్‌ను సమీకరించుకునేవాడు. అయితే దేశంలోని కొన్ని చోట్ల విధ్వంసాలు జరగడం, ఆ బాంబుల్లో అమ్మోనియం నైట్రేట్‌ వాడినట్లు తేలడంతో నిఘా పెరిగింది. దీంతో పేలుడు పదార్థం సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న రియాజ్‌ కన్ను మీన్‌ తూటాలపై పడింది.  

ఇదీ ‘మీన్‌ తూటా’...
కర్ణాటకలోని ఉడిపి, రత్నగిరి, శిరుల్‌గుప్ప తీరప్రాంతాల మత్స్యకారులు చేపల వేటకు వలలతో పాటు ‘మీన్‌ తూటా’లను వినియోగిస్తుంటారు. అమ్మోనియం నైట్రేట్‌ స్లర్రీ (పేస్టులా ఉండే పదార్థం) ప్యాకెట్‌ లో డిటోనేటర్‌ ఏర్పాటు చేసి దానికి చిన్న ఫ్యూజ్‌ వైర్‌ జత చేస్తారు. ఈ వైరును వెలిగించి నీటిలో తడవకుండా చిన్న కుండలో పెట్టి కాస్త బరువుతో పడవకు కాస్త దూరంగా సముద్రంలో పడేస్తారు. స్లర్రీ పేలుడు ధాటికి వెలువడే షాక్‌ వేవ్స్‌ ప్రభావంతో ఆ ప్రాంతంలోని చేపలన్నీ చనిపోయి పైకి తేలుతాయి. దీన్నే అక్కడి మత్స్యకారులు ‘మీన్‌ తూటా’ అంటారు. మీన్‌ అంటే చేప, తూటా అంటే పేలేది అని అర్థం. ఈ విధానం నిషేధం అయినప్పటికీ ఎవరూ పట్టించుకోవట్లేదు.  

దేశం దాటే వరకు...  
ఉత్తర కన్నడ, మంగుళూరుల్లోని కొన్ని ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుడడంతో నిర్మాణరంగంలో వినియోగించడానికి అమ్మోనియం నైట్రేట్‌ స్లర్రీ విక్రయానికి పలువురు లైసెన్సులు పొందారు. ప్రభుత్వ నిఘా, ఆడిట్‌ పక్కాగా లేకపోవడంతో ఆ వ్యాపారులే అక్రమంగా మత్స్యకారులకు ‘మీన్‌ తూటా’లు అమ్మేస్తుంటారు. ఈ విధానాలు అధ్యయనం చేసిన రియాజ్‌ పేలుడు పదార్థం సమీకరణకు ఇదే మార్గాన్ని ఎంచుకున్నాడు. 2008లో దేశం దాటే వరకు తానే సమీకరించాడు. ఆ ఏడాది ఐఎం ఉగ్రవాదుల అరెస్టులు ప్రారంభం కావడంతో దేశం దాటేశాడు. ఆ తర్వాత పేలుడు పదార్థం సమీకరించే మార్గం తెలిసినప్పటికీ.. దాన్ని ఎలా సేకరించాలి? ఎవరితో అవసరమైన వారికి అందించాలి? అంశంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. భత్కల్‌ ప్రాంతానికి చెందిన అనేక మందికి ఎరవేసిన రియాజ్‌... అనుచరుడు అఫాఖీని ‘మీన్‌ తూటా’లు ఖరీదు చేయడానికి వినియోగించుకున్నాడు. పాక్‌ నుంచి రియాజ్‌ ఇచ్చే ఆదేశాల ప్రకారం అఫాఖీ పని చేసేవాడు. చేపల వేటకని మీన్‌తూటాలు తెప్పించేవాడు. వీటిలోని స్లర్రీ ప్యాకెట్లను పేలుళ్లు జరిపే ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదులకు అనుచరుల ద్వారా పంపడం లేదా వారినే మంగుళూరు, బెంగళూరు రప్పించి అప్పగించడం చేసేవాడు. ఈ అమ్మోనియం నైట్రేట్‌ స్లర్రీని వినియోగించే ఉగ్రవాదులు బాంబులు తయారు చేసి పేల్చారు. అమ్మోనియం నైట్రేట్‌ స్లర్రీ దుర్వినియోగం కాకుండా.. ఉత్పత్తి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. తయారు చేసిన నాటి నుంచి గరిష్టంగా ఆరు నెలలు మాత్రమే అది సమర్థంగా పని చేస్తుంది. ఆ తర్వాత అందులోని శక్తి తగ్గిపోయి పెద్దగా ప్రభావం చూపదు. అయితే ఐఎం ఉగ్రవాదులు చిన్నస్వామి స్టేడియం, జంగ్లీ మహరాజ్‌ రోడ్‌లలో పేలుళ్లకు వినియోగించిన స్లర్రీ ఎక్స్‌పైర్‌ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆ రెండు చోట్లా దాంతో తయారు చేసిన బాంబులు పేలడంతో తీవ్రత తక్కువగా ఉండి ప్రాణనష్టం జరగలేదు.  

ముష్కరుల తరలింపునకు సన్నాహాలు...
జంట పేలుళ్లతో పాటు పేలని బాంబు కేసులో దోషులుగా తేలిన ఉగ్రవాదులు అనీఖ్, అక్బర్, తారీఖ్‌లతో పాటు ఈ కేసుల్లో అభియోగాలు వీగిపోయిన సాదిఖ్, ఫారూఖ్‌లను (వీరిపై ఇతర రాష్ట్రాల్లో కేసులున్నాయి. దీంతో జైలు నుంచి బయటకు రారు) ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ సహా ఇతర విభాగాల అధికారులు పట్టుకున్నారు. వీరిపై దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదై ఉన్నాయి. ఈ ఉగ్రవాదుల్ని ఆయా కారాగారాల నుంచి ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌ తీసుకొచ్చారు. అలాగే మిగిలిన రాష్ట్రాల వారూ తీసుకెళ్లాల్సి ఉంది. ఇప్పుడు ఇక్కడి కేసుల విచారణ, శిక్షల విధింపు సైతం పూర్తి కావడంతో తమ తమ కేసులకు సంబంధించి తీసుకెళ్లడానికి ఇతర రాష్ట్రాల పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం న్యాయస్థానం ఉరిశిక్షలు విధించిన తర్వాత కూడా ముష్కరుల ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదని చర్లపల్లి జైలు అధికారులు చెబుతున్నారు. వీరిలో ఏ కోణంలోనూ పశ్చాత్తాపం కనిపించట్లేదనిపేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement